ఆంధ్రప్రదేశ్‌

హామీలపై మడమ తిప్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 28: విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నింటినీ తు.చ తప్పక నెరవేరుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. శుక్రవారం నవ్యాంధ్ర రాజధాని ప్రభుత్వ భవనాల సముదాయంతోపాటు రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడుతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జైట్లీ మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే ప్రాయోజిత ప్రాజెక్టులకు ఏ మేరకు నిధులు వస్తాయో అదేరకంగా 90శాతం నిధులు అందిస్తామని ప్రకటించారు. ఎర్నింగ్ ఎయిడ్ ప్రాజెక్టులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడులను ఆకర్షించేందుకు అహరహం శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ తరహాలోనే నూతన నగరంగా అమరావతి నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం మొదటి ఐదేళ్లలో 2లక్షల మూడువేల కోట్లు ఇస్తుందని వివరించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రానికి మేలు చేస్తామన్నారు. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ఏపిలోని 13 జిల్లాల్లో ఏర్పాటుకాని జాతీయ సంస్థలు మంజూరు చేశామని, ఎయిమ్స్, ఐఐఎం, ఐఐటి ఇంకా అనేక సంస్థలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. పెట్రోలియం పరిశ్రమలను స్థాపిస్తామన్నారు. భూ సేకరణ పూర్తయితే విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యతను కేంద్రం తీసుకుందని చెప్పారు. రాజధానికి భూములిచ్చిన రైతులు మూలధనం పన్ను మినహాయించాల్సిందిగా చేసిన విజ్ఞప్తిని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాజధాని అంటే అల్లాఉద్దీన్ అద్భుతద్వీపం కాదు.. రాత్రికి రాత్రి ఏ శక్తులు పూర్తిచేయలేవు.. కష్టపడితేనే ఏపికి భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చిన దాఖలాలు లేవన్నారు. ఏపికి అన్యాయం చేసిన ప్రతిపక్ష పార్టీల వాళ్లే కేంద్రం ప్యాకేజీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేయటం విచారకరమన్నారు. పనిచేసే ముఖ్యమంత్రిని ప్రశంసిస్తే ఇద్దరూ ఏకమయ్యారనే విమర్శలు చేస్తారని.. ఏమీ లేకపోతే మరో నింద వేస్తారని మండిపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్న దశలో ప్రపంచ పెట్టుబడిదారులు భారత్ వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు తక్కువ సమయంలో ఇవ్వలేనన్ని నిధులు కేటాయించామని, అయినా విమర్శలు తప్పటంలేదని అన్నారు. గుంటూరు- విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టుతో పాటు విద్యుత్‌లైన్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని అంతర్గత రహదార్లకు జాతీయ రహదార్లను అనుసంధానం చేస్తామని చెప్పారు. మరో 18 వందల కోట్లతో డ్రెడ్జింగ్ కార్పొరేషన్, 54 వేల కోట్లతో ఇతర ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు. ఎన్నికలు, పదవులు తనకు ప్రాధాన్యం కాదన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు కాపిటల్ గైన్, ఆదాయపన్ను రద్దుచేయాలని చేసిన విజ్ఞాపనకు కేంద్రం నుండి త్వరలో సానుకూల స్పందన వస్తుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా మారిందని, కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు హోదాకు తగిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని కోరారు. ఏడాదిలో ఎన్నో ఇబ్బందులను అధిగమించి రాజధానికి శంకుస్థాపన చేశామని, ఈ గడ్డ నుంచే పాలన సాగించాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని సచివాలయ భవనాలను పూర్తిచేశామని గుర్తుచేశారు. హేతుబద్ధతలేని విభజనతో అన్యాయం జరిగింది.. అప్పుడే ప్రత్యేక హోదా ఇస్తామని యూపిఏ ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ వల్లే సెంటిమెంట్ వేళ్లూనుకుందన్నారు. కొత్త రాష్ట్రం.. సమస్యలు బోలెడు ఉన్నాయి.. రాష్ట్రానికి అన్యాయం జరక్కుండా కేంద్రం అన్నివిధాల సాయపడుతోందని చెప్తూనే ప్యాకేజీకి, హోదాకు వ్యత్యాసం లేకపోతే నష్టం ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కష్టాలు శాశ్వతం కాదని, కేంద్రం ఇచ్చే ఆర్థిక చేయూతతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హోదా వల్ల ప్రోత్సాహకాలు రావన్నారు. ప్యాకేజీతో 90 శాతం గ్రాంటు ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. రాజధాని రైతులకు పన్నుల రాయితీ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖలో రైల్వేజోన్, మెట్రో రైలు ప్రాజెక్టులు, కడపలో స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టులకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కాపిటల్ గైన్ నుంచి రాజధాని రైతులకు మినహాయింపునిచ్చి సర్వీస్ టాక్స్, ఇన్‌కంటాక్స్‌లను రద్దుచేయటంతో పాటు అప్పులమీద బాండ్లు ఇవ్వాలని జైట్లీకి ప్రతిపాదించారు.

చిత్రం... రాజధాని భవనాల శంకుస్థాపన ఫలకం ఆవిష్కరిస్తున్న జైట్లీ, చంద్రబాబు