ఆంధ్రప్రదేశ్‌

బీమా సొమ్ము కోసం హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: ఆస్తి కోసం రక్త సంబంధీకులను హతమార్చిన సంఘటనలు చూశాం. అయితే త్వరలో చనిపోతాడని తెలిసిన వ్యక్తి పేరిట బీమా చేయించి, అనంతరం హత్య చేసి బీమా సొమ్ము దక్కించుకున్న నిందితుల జాతకాలు పోలీసులు బయటపెట్టారు. వినడానికి ఇది సినిమా కథలా ఉన్నప్పటికీ విశాఖ నగరంలో చోటుచేసుకున్న ఈ సంఘటన పూర్తి వివరాలను నగర శాంతి భద్రతల డిసిపి నవీన్ గులాఠీ సోమవారం విలేఖరులకు వెల్లడించారు. విశాఖ నగరానికి చెందిన కదిరి వెంకటేష్ గత ఏడాది ఆగస్టు 11న ట్రైన్‌లో ప్రయాణిస్తూ సామర్లకోట వద్ద ప్రమాద వశాత్తు కింద పడి మరణించాడు. వెంకటేష్ మృతిపై సామర్లకోట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాద వశాత్తు మరణించినట్టు విచారణలో తేల్చి కేసు ముగించేశారు. పోలీసు దర్యాప్తు తదితర అంశాలను బీమా సంస్థలకు అందించి మృతుని బంధువులు బీమా మొత్తానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ కేసులో నిందితులకు సహకరించిన వ్యక్తి ఒకరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వీరంతా కటకటకాల పాలయ్యారు. మృతుడు వెంకటేష్ మరణించే నాటికి కొద్ది రోజుల ముందు నుంచి తీవ్ర అనారోగ్యం (హెచ్‌ఐవి పాజిటివ్)తో బాధ పడుతున్నాడు. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని భావించిన వెంకటేష్ సోదరి కుప్పిలి మాధురి, ఆమె భర్త కె నాగేంద్ర మృతుని పేరిట హైరిస్క్ బీమా పాలసీలు చేయించారు. జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి)సహా పలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి బీమా చేయించారు. అయితే అనారోగ్యంతో ఉన్న వెంకటేష్ మరణించకపోవడంతో బీమా మొత్తాన్ని పొందడం ఆలస్యం అవుతోందని భావించిన సోదరి, ఆమె భర్త మరో ముగ్గురితో కలిసి హత్యకు పథకం వేశారు. వీరికి కె కామేశ్వరరావు, బి రామచంద్రప్రసాద్, మరో వ్యక్తి బి రామ్‌ప్రసాద్ సహకరించారు. వెంకటేష్‌ను హత్య చేసి రైలు నుంచి కిందకు తోసేసి, తమకేమీ తెలియనట్టే నటించారు. కొద్ది రోజుల కింద వెంకటేష్‌కు చెందిన బీమా పాలసీల మొత్తం చేతికి అందడం మొదలైంది. ఎల్‌ఐసి నుంచి రూ.24 లక్షలు, భారతీయ స్టేట్ బ్యాంకు నుంచి రూ.25 లక్షలు, హెచ్‌డిఎఫ్‌సి నుంచి రూ.20 లక్షల మేర బీమా సొమ్ము వీరు అందుకున్నారు. ఈ మొత్తంలో వెంకటేష్ హత్యకు సహకరించిన కామేశ్వరరావుకు రూ.6 లక్షలు, బి రామచంద్రప్రసాద్‌కు రూ.11 లక్షలు, బి రాంప్రసాద్‌కు రూ.30 వేలు ఇచ్చారు. రాం ప్రసాద్‌కు తక్కువ మొత్తం ఇవ్వడంతో ఎదురు తిరిగి జరిగిన సంగతి పోలీసులకు వివరించాడు. దీంతో విశాఖ త్రీ టౌన్, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు జరిపి వెంకటేష్‌ను హత్య చేసినట్టు నిర్ధారించారు. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుని సోదరి దంపతులు బీమా సొమ్ముతో రామ్ నగర్‌లో ఒక ప్లాట్, ఒక కారు, 4 లక్షలతో బంగారం కొనుగోలు చేయడమే కాకుండా మరో 12 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. నగదు, నగలు స్వాదీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు.