ఆంధ్రప్రదేశ్‌

మనకెందుకీ మరక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 21: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలనుంచి వస్తున్న వ్యతిరేక ప్రభావం రాజకీయంగా తమపై పడకుండా జాగ్రత్తపడాలని తెలుగుదేశం నిర్ణయించింది. రెండురోజుల నుంచి మంత్రులు, పార్టీ నేతల స్వరం పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. జనంలో మోదీ నిర్ణయంపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో, తాము పెద్దనోట్ల రద్దును స్వాగతించటం కంటే దానివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించి వాటినే ప్రస్తావించి మాట్లాడటం ద్వారా ‘పెద్ద’మరక వదిలించుకోవాలని తెదేపా నాయకత్వం భావిస్తోంది.
పెద్దనోట్ల రద్దుతో ప్రజల్లో మోదీపై పెరుగుతున్న వ్యతిరేకత ప్రభావం తమపై పడకుండా తెదేపా నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. గతంలో పెద్దనోట్ల రద్దుపై మాట్లాడిన చంద్రబాబు, ఇప్పుడు జనం పడుతున్న కష్టాల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. మంత్రులు, ఎంపిలు సైతం అదే బాట పడుతున్నారు. ఇన్నిరోజులయినా పరిష్కారం కాని సమస్యను తన రాజకీయ జీవితంలో ఇప్పుడే చూస్తున్నానని బాబు కూడా వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం.
ఆ పార్టీ ఎంపి డాక్టర్ శివప్రసాద్ నేరుగా నిరసన ప్రదర్శన నిర్వహించడంతోపాటు, ప్రధానిపై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్య చర్చనీయాంశమయింది. ఎన్నికల్లో భార్యపిల్లలు లేని వారిని అనర్హులుగా ప్రకటించాలని మోదీనుద్దేశించి చేసిన వ్యాఖ్య పరిశీలిస్తే మోదీ నిర్ణయం వల్ల ప్రజల్లో మొదలైన వ్యతిరేకత, తమను ఎక్కడ తాకుతుందోనన్న ఆందోళన అధికారపార్టీ ప్రజాప్రతినిధుల్లో ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. దానికితగినట్లే నియోజకవర్గ ప్రజలు మంత్రులు, ఎమ్మెల్యేలను నోట్ల కష్టాలపై నిలదీస్తున్న పరిస్థితి.
మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా ముందుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ప్రజలు ఇబ్బందులు పడుతుండటం బాధాకరమని, దానికి తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లకోసం బాబు కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ అనుభవజ్ఞుడైన బాబు సలహాలు తీసుకుంటే ఈ సమస్య వచ్చేదికాదన్నారు.
తెదేపా వైఖరి మారేందుకు ఆ పార్టీ కొద్దిరోజుల నుంచి చేస్తున్న సర్వేలు కూడా కారణమంటున్నారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలే తప్ప నల్లధనం ఉన్న వారెవరూ ఇబ్బందిపడటం లేదని, రాజకీయనాయకులు ఎక్కడా ఏటిఎంలలో కనిపించడం లేదన్న అభిప్రాయం ఆ సర్వేలో వెల్లడయింది. మోదీ నిర్ణయం వల్ల చంద్రబాబు కూడా అప్రతిష్టపాలవుతున్నారన్న నివేదికలు వస్తున్నాయి. అందుకే ముందు పెద్దనోట్ల రద్దుపై రోజూ మాట్లాడిన బాబు, ఇప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు, వారికి ప్రత్యామ్నాయంగా 100, 50 నోట్లను అందుబాటులో ఉంచాలంటూ రోజూ సమీక్షలు పెట్టి బ్యాంకర్లను కోరుతున్నారు. కేంద్రానికి వరసపెట్టి లేఖలు రాస్తున్నారు. దీనివల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చన్న లక్ష్యం కనిపిస్తోంది.
మోదీ నిర్ణయం వల్ల రాజకీయంగా బిజెపి కంటే తమకే ఎక్కువ నష్టం కలిగిస్తుందన్న ఆందోళన తెదేపా నాయకత్వంలో ఉంది. మిత్రపక్షంలో ఉన్నందున ఆ మరక తమకూ అంటుతుందని, మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దీనిపై పెద్దగా ఆందోళన వ్యక్తం చేయకపోవడాన్ని కూడా తెదేపా నాయకత్వం నిశితంగా గమనిస్తోంది. పెద్దనోట్ల రద్దు వల్ల ఇటీవల బిజెపి అధికారంలో ఉన్న మహారాష్టల్రో నీటి సంఘాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి తుడిచిపెట్టుకుపోయిన వైనాన్ని తెదేపా నాయకత్వం గ్రహించింది. తాజాగా మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో పార్టీలతో సంబంధం లేకుండా రైతులే వచ్చి, పాతనోట్లను రోడ్డుమీద వేయడం వంటి సంఘటనలు మోదీపై పెరుగుతున్న వ్యతిరేకతగా పార్టీ నేతలు విశే్లషిస్తున్నారు. బిజెపి నేతలతో అంతర్గతంగా సంభాషిస్తున్న తెదేపా నేతలు ఆ పార్టీలోనూ వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించింది.
పెద్దనోట్ల రద్దుపై ముందు అందరికంటే ఎక్కువగా మాట్లాడి దెబ్బతిన్న తెదేపా ఇప్పుడు జనస్పందన, ప్రతికూల ఫలితాలు పరిశీలించి, ఇంకా మేల్కొనకపోతే ప్రజల్లో దెబ్బతింటామన్న అంతిమ నిర్ణయానికి వచ్చింది. ఇకపైనా నోట్లపై ప్రజలు పడుతున్న కష్టాలతోపాటు, వాటికి ప్రత్యామ్నాయాలపై నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్రంపై ఒత్తిడి వ్యూహానే్న అమలుచేయాలని నిర్ణయించింది.