ఆంధ్రప్రదేశ్‌

నోట్ల మార్పిడి ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 21: విజయవాడ కేంద్రంగా పశ్చిమ గోదావరి, గుంటూరు ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి రద్దయిన పాత నోట్లను మారుస్తూ పట్టుబడ్డారు. 17 మందిని అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు నిందితుల నుంచి 6 లక్షల 80వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొంత నగదు కొత్తగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రెండు వేల రూపాయలు నోట్లు కాగా, ఎక్కువ శాతం వంద నోట్లు ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని అవకాశంగా తీసుకుని కమీషన్లకు కక్కుర్తిపడి వీరంతా ఈ నేరాలకు పాల్పడినట్లు నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ తెలిపారు.
బందరు రోడ్డులోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం విలేఖరులకు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఏడుగురు వర్తకుల నుంచి నిందితుల్లోని కొందరు రూ.6లక్షల 80వేలు చలామణిలో ఉన్న కొత్త రెండు వేల నోట్లు, పాత వంద నోట్లు సమీకరించి 30శాతం కమీషన్‌కు రద్దయిన నోట్లు తీసుకుని మార్పిడి చేసే ప్రయత్నం చేశారని సీపీ తెలిపారు. ఇందులో 20శాతం కమీషన్ ఏలూరు వర్తకులకు, మిగిలిన 10శాతం మధ్యవర్తులకు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందన్నారు. సమాచారం అందుకుని ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన ఆపరేషన్ సాయంత్రానికి ముగించి మొత్తం 17మందిని అదుపులోకి తీసుకున్నట్లు సవాంగ్ తెలిపారు. వీరిలో నగరానికి చెందిన శ్రీనివాసరావు, నాగరాజు, సైమన్, జీవన్, కీర్తి, కిరణ్, శ్రీనివాస్ కుమార్, శ్రీనివాసరావు, అచ్యుతరావు, లక్ష్మణరావు, కైలాష్, ఏలూరుకు చెందిన పి శ్రీనివాసరావు, సింహాచలం, నాగేశ్వరరావు, భరత్‌కుమార్, శ్రీను ఉన్నారు. మిగిలిన వారంతా గుంటూరుకు చెందిన వారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్ర ఉందా? అనేదానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా ప్రస్తుత పరిస్థితిని ఆసరా చేసుకుని కొందరు వ్యక్తులు కొత్త-పాత నోట్ల మార్పిడికి సంబంధించి చేస్తున్న ప్రచారాలు, వదంతులను ప్రజలు నమ్మవద్దని సీపీ సూచించారు. ఎవరైనా కమీషన్ తీసుకుని నోట్ల మార్పిడికి పాల్పడతామనే వారి మాటలు నమ్మి మోసపోవద్దని, వారికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలని కోరారు. ఈ తరహా నేరాలకు పాల్పడేవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి కార్యకలాపాలపై పక్కా నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదుపులోకి తీసుకున్న నిందితులను అరెస్టు చేసే విషయంలో న్యాయనిపుణులతో సంప్రదిస్తామని ఆయన వివరించారు. విలేఖరుల సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ పి హరికుమార్, డిసిపి జి పాలరాజు, క్రైం అదనపు డిసిపి రామకోటేశ్వరరావు, టాస్క్ఫోర్స్, సిసిఎస్ ఏసిపిలు పాల్గొన్నారు.

చిత్రాలు..నోట్ల మార్పిడి కేసు వివరాలు వెల్లడిస్తున్న విజయవాడ సిపి గౌతం సవాంగ్.
పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులు