ఆంధ్రప్రదేశ్‌

బడ్జెట్‌లో వెయ్యి కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: వచ్చే బడ్జెట్‌లో కాపు కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లను కేటాయించనున్నట్టు అర్థిక మంత్రి, కాపు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రకటించారు. కాపులను బిసి జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన దీక్షపై సిఎం చంద్రబాబుతో కేబినెట్ సబ్ కమిటీ విశాఖలో ఆదివారం మధ్యాహ్నం భేటీ అయింది. అనంతరం కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు విలేఖరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉన్న కాలంలో అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా పలు సామాజిక వర్గాల నుంచి వచ్చిన విజ్ఞాపనల మేరకు ఎస్సీ,ఎస్టీ, బిసి, మహిళా డిక్లరేషన్లు ఇచ్చారని, వాటినే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చేర్చారని ఈ సందర్భంగా యనమల అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత కాపులను బిసిలుగా గుర్తించేందుకు రాజ్యాంగ బద్ధంగా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం ఉన్న బిసి రిజర్వేషన్లకు ఎటువంటి భంగం వాటిల్లకుండా కాపులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాపులను ఆర్థికంగా ఆదుకునేందుకు వీలుగా కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.100 కోట్ల నిధులను కేటాయించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిధుల కేటాయింపు తగ్గినా ఈ సంవత్సరం మార్చినాటికి వచ్చే దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, వారికి ఆర్థిక సాయం అందించనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రం రూ.7వేల కోట్ల లోటులో ఉందని, జీతాలు చెల్లించేందుకు సైతం నిధుల్లేక విలవిల్లాడుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా, కొన్ని శక్తులు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. నేర చరిత కలిగిన నాయకులు ముద్రగడను వెనకుండి నడిపిస్తున్నారన్నారు. కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలని దీక్ష చేస్తున్న ముద్రగడకు సంఘీభావం తెలుపుతున్నది హర్షకుమార్, చింతామోహన్, రఘువీరారెడ్డి, మంద కృష్ణ మాదిగ తదితర నాయకులని, వారికి కాపు రిజర్వేషన్లతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రిజర్వేషన్లకోసం కాపులను రెచ్చగొడుతున్న పార్టీలు, అదే సమయంలో మీ హక్కులకు భంగం కలుగుతోందంటూ అటు బిసిలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే బిసి ఐక్య వేదిక తిరుపతిలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి, తమ రిజర్వేషన్లకు భంగం వాటిల్లకుండా చూడాలంటూ డిమాండ్ చేస్తున్నారని, ఇలా ఎవరికివారు ప్రభుత్వాన్ని బెదిరించాలని చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన అనంతరం విపత్కర పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది మంచి పరిణామం కాదన్నారు. రాష్ట్ర భవిష్యత్, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా అన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉద్యమం జరుగుతున్న తీరును సమీక్షిస్తున్నామని, సమయం వచ్చినప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి గంటా
కాపులను బిసిల్లో చేర్చాలన్న హామీకి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కాపు కార్పొరేషన్‌కు ఇప్పటికే 52వేల దరఖాస్తులు అందాయని, వీటిని పరిష్కరించేందుకు రూ.500 కోట్లు అవసరం అవుతాయన్నారు. అయినా ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగాగ ఉందన్నారు. ముద్రగడ డిమాండ్‌లన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించే ప్రక్రియను ప్రారంభించినా దీక్షకు దిగడంలో అర్థం లేదన్నారు. సంయమనం పాటించడం ద్వారా అనుకున్నది సాధించుకోవాలని కాపులకు సూచించారు. రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా కుల సంఘాలు తమ ఉద్యమాలను విరమించుకోవాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున దీక్షను విరమించాలని, అలాగే సిఎం చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని హితవు పలికారు. సమావేశంలో మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చెలమలశెట్టి రామానుజయ, తదితరులు పాల్గొన్నారు.