ఆంధ్రప్రదేశ్‌

రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: రెండు ఎకరాల అసామీగా రాజకీయాలకు వచ్చి నేడు రెండు లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో చెప్పాలని సిఎం చంద్రబాబును కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారంతో మూడవ రోజుకు చేరింది. కిర్లంపూడిలోని స్వగృహంలోనే భార్య పద్మావతి సహా ఉద్రిక్త పరిస్థితుల నడుమ ముద్రగడ ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. ముద్రగడ దంపతులు ఆదివారం కూడా వైద్య పరీక్షలను నిరాకరించారు. వైద్యులు ఉదయం నుండి సాయంత్రం వరకు పరీక్షలు నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైద్యులు ఇంట్లోకి వెళ్ళే అవకాశం లేకుండా తలుపులు వేసుకుంటున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి పర్యవేక్షణలో ప్రత్యేక అంబులెన్స్‌ను కూడా ముద్రగడ నివాసం వద్ద ఉంచారు. ఆయన ఉదయం మీడియాతో మాట్లాడుతూ తాను డిమాండ్ల విషయంలో చర్చలకు సిద్ధమని ప్రకటించినా ప్రభుత్వం మాత్రం మొండివైఖరినే అవలంభిస్తున్నట్టు తన మిత్రుల ద్వారా తెలిసిందన్నారు. చంద్రబాబు మొండి అయితే తాను జగమొండినని ముద్రగడ వ్యాఖ్యానించారు. న్యాయపరమైన తన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా లేదని సమాచారం అందిందన్నారు. గతంలో రెండు ఎకరాల భూమి కలిగిన చంద్రబాబు ఇప్పుడు రెండు లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో బహిరంగ పర్చాలని ముద్రగడ ప్రశ్నించారు. ఆ ఉపాయం చెబితే కాపు జాతి సహా అన్ని జాతుల వారూ మీ దారిలోనే నడుస్తారని, ఇక బీసీ రిజర్వేషన్లు, వెయ్యి కోట్లు అడగేది లేదన్నారు. తనకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పదే పదే రావద్దని, తమ ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ‘ఆమరణ నిరాహార దీక్షలో ఉండి ఆహారం లేకుండా ఎలా బతకవచ్చో తనను చూసి వైద్య చరిత్రలో తన పేరు రాసుకోండి’ అని చంద్రబాబుకు సూచించారు. తనను చూసేందుకు అభిమానంతో వస్తున్న నేతలు, కాపు సామాజికవర్గాన్ని కిర్లంపూడి రాకుండా కట్టడి చేస్తుండటం బాధగా ఉందన్నారు.
క్షీణిస్తున్న ముద్రగడ ఆరోగ్యం...
ముద్రగడ సహా ఆయన భార్య పద్మావతి ఆరోగ్యం ఆదివారం సాయంత్రానికి క్షీణించినట్టు తెలుస్తోంది. ఇరువురికీ షుగర్ లెవెల్స్ పడిపోయినట్టు సమాచారం! వైద్య పరీక్షలకు నిరాకరించడంతో ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడం దారుణమని కాపు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిర్లంపూడి, ప్రత్తిపాడు గ్రామాలలో సాయుధ దళాల పహారా కొనసాగుతోంది. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ తదితర రాజకీయ పార్టీలకు చెందిన నేతలను ముద్రగడ నివాసంలోకి పోలీసులు అనుమతించడం లేదు. ముఖ్య నేతలను సమీప గ్రామాల్లోనే అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు. అమలాపురం మాజీ ఎంపి జివి హర్షకుమార్‌ను ఆదివారం ప్రత్తిపాడు గ్రామంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కారణంగా పలువురు నేతలు పరామర్శకు దూరం అవుతున్నట్టు సమాచారం! అయితే ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె చిరంజీవి తదితరులు సోమవారం ముద్రగడను పరామర్శించనున్నట్టు కిర్లంపూడికి సమాచారం అందింది. అయితే పోలీసులు వీరిని నిలువరించే అవకాశం ఉన్నట్టు సమాచారం! నేతల రాకను దృష్టిలో ఉంచుకుని ఆయా చెక్‌పోస్ట్‌లకు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు తగు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. మరోవైపు ముద్రగడ ఆమరణ దీక్షకు మద్దతుగా కాపు సామాజికవర్గానికి చెందిన పలువురు నిరాహార/రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు.

చిత్రం... మూడవరోజు ఆమరణ దీక్షలో ముద్రగడ దంపతులు