ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, ఏప్రిల్ 9: తిరుపతి నుంచి చిత్తూరు వెడుతున్న మారుతీ వ్యాన్‌ను ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు పాకాలవారి పల్లెవద్ద ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు తిరుచ్చి జిల్లా మాడియంబట్ల గ్రామానికి చెందిన తొమ్మిది మంది తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి తిరుగుప్రయాణంలో చంద్రగిరి మండలంలోని పాకాల వారి పల్లె వద్ద వెడుతుండగా చిత్తూరు నుంచి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వ్యాన్‌ను ఢీకొంది. సంఘటనా స్థలంలోనే మారుతీ వ్యాన్ డ్రైవర్ రామస్వామి(60), ఆనంద్(12) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు తీవ్రగాయాలతో బాధపడుతున్న యువరాణి(18) బాలకృష్ణ(32), మహలక్ష్మి(24) రమేష్‌కుమార్(36), మోహన్‌దాస్ (42), మేనక (56)ను 108లో రుయా అసుపత్రికి తరలించారు. అయితే రుయాలో చికిత్స పొందుతూ యువరాణి మృతి చెందింది. మిగిలిన వారికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. చంద్రగిరి పోలీసులు ఈమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
ఎచ్చెర్ల, ఏప్రిల్ 9: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన ఫార్మసీ విద్యార్థిని సంతోషి(18) శనివారం తరగతి గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని ఓ ఫార్మసీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. స్వగ్రామం నుంచి బస్సులో కళాశాలకు చేరుకున్న సంతోషి భోజనం అనంతరం తరగతి గదిలో అపస్మారక స్థితికి చేరుకుంది. నోటి నుంచి నురగలు రావడంతో వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. తరగతి గదిలో గుళికలు, సూసైడ్ నోట్ లభించాయి. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వీధికుక్కల దాడిలో వృద్ధుడి మృతి
గోపాలపట్నం, ఏప్రిల్ 9: ఉదయం నడకకు వెళ్లిన వృద్ధుడిపైకి మూకుమ్మడిగా దాడిచేసిన వీధికుక్కలు చీల్చిచెండాడి చంపేసిన సంఘటన విశాఖపట్నంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని 66వ డివిజన్ పద్మనాభనగర్‌కు చెందిన అమరపిన్ని ముసలయ్య(70) శనివారం తెల్లవారుజామున ఉదయం నడకకు వెళ్లగా వెనుకనుంచి వచ్చిన ఐదు వీధికుక్కలు మూకుమ్మడిగా దాడిచేశాయి. దీంతో ఆయన కిందపడడంతో పైకి లఘించి కాళ్లు, చేతులకు గాట్లుపడేలా కరిచాయి. ఛాతి భాగంలో సైతం పెద్దపెద్ద గాట్లు పెట్టాయి. దీంతో ముసలయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇదిలా ఉండగా ఉగాది రోజు పద్మనాభనగర్‌లోనే లేమల్ల మనోజ్ (13), సోలాపు ఈశ్వరరావు(45)పై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. వీరు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఎస్సీల అభివృధ్ధికి రూ. వెయ్యి కోట్లు
ఏలూరు, ఏప్రిల్ 9 : రాష్ట్రంలో ఎస్సీల ఆర్ధిక పురోభివృద్ధికి ఈ ఏడాది వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి శనివారం స్థానిక ఇరిగేషన్ అతిధిగృహానికి చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే బడేటి బుజ్జి, జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కిషోర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఎస్‌సిల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు. సమాజంలో ఆర్ధికంగా వెనుకబడిన అన్ని కులాల్లోని పేదలకు ఆర్ధిక చేయూతను అందించి సమన్యాయం సాధిస్తామని, ఇందుకు అవసరమైన నిధులను దశల వారీగా విడుదల చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద జిల్లా స్థాయిలో వివిధ శాఖలకు కేటాయించిన నిధులు ఎంతెంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించామన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్‌సి, ఎస్‌టిలు నివసించే ఇళ్ల కాలనీల్లో సిమెంటు రోడ్లు నిర్మించేందుకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే బడేటి బుజ్జి మంత్రిని కోరారు.

పిసిసి అధికార ప్రతినిధిగా కందులదుర్గేష్
విజయవాడ, ఏప్రిల్ 9: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధిగా శాసనమండలి మాజీ సభ్యుడు, తూ.గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ నియమితులయ్యారు. ఈ మేర పిసిసి కార్యాలయంలో శనివారం పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఇదే సందర్భంలో గుంటూరు జిల్లా ముప్పాళ్లకు చెందిన డాక్టర్ హనుమంతరావును పిసిసి డాక్టర్స్ సెల్ అధ్యక్షునిగా కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ రాధాకృష్ణను ఉపాధ్యక్షునిగా నియమిస్తూ ఆ మేర నియామక పత్రాలను అందజేశారు.

రెసిడెన్షియల్ స్కూళ్లుగా హాస్టళ్లు
దేవరపల్లి, ఏప్రిల్ 9: రాష్ట్రంలోగల అన్ని హాస్టళ్లను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం, స్టాక్‌నగర్ గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిపి గెడా మురళీ అజిత్‌కుమార్ స్వగృహంలో మంత్రి కిషోర్‌బాబు విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1445 ఎస్సీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, ఇకపై ప్రతి హాస్టల్‌ను రెసిడెన్షియల్ స్కూలుగా మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటికే 50 ఎస్సీ హాస్టళ్లను రెడినియ్షయల్ స్కూల్స్‌గా మార్పు చేసినట్టు తెలిపారు. రానున్న రెండు సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో మార్పు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్‌టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పారు. మొదటి దశలో రూ.425 కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి తెలిపారు.