ఆంధ్రప్రదేశ్‌

పులిచింతల - సాగర్ కుడికాల్వ అనుసంధానం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఫిబ్రవరి 13: పులిచింతల జలాశయాన్ని సాగర్ కుడికాల్వకు అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతాంగ సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్, నేతలు కొలనుకొండ శివాజీ, డాక్టర్ ఎస్ రాజమోహన్ మాట్లాడారు. గోదావరి నీరు పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణా నదికి, ప్రకాశం బ్యారేజీ నుండి ఎత్తిపోతల ద్వారా పులిచింతల రిజర్వాయర్‌లోకి, పులిచింతల బ్యాక్‌వాటర్ నుండి లిఫ్ట్ చేయటం ద్వారా సాగర్ కుడికాల్వ ఆయకట్టుకు, చింతలపూడి లిఫ్ట్ ద్వారా సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు సరఫరా చేయాలని సూచించారు. దీంతో డెల్టా, సాగర్ ఆయకట్టుకు గోదావరి నీరు, శ్రీశైలం వద్దకు చేరే కృష్ణానీరు రాయలసీమకు అంది రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆచరణలోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పథకం గురించి సంబంధిత అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో చర్చలు జరిపి అమలుచేస్తే రాష్ట్రానికి భవిష్యత్‌లో మంచినీరు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. గోదావరి నీళ్లు రాయలసీమకు అందించటం ఎలా సాధ్యపడుతుందని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగం, ప్రాజెక్ట్‌ల నిర్మాణం వంటి అంశాలను గమనిస్తే చివరకు రాష్ట్ర సమగ్రతకే విఘాతం కలిగించేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని అమలుచేస్తే కృష్ణాడెల్డాకు నీటి కొరత తీర్చటంతో పాటు ప్రకాశం బ్యారేజీ నుండి పులిచింతల వరకు మధ్యలో లభ్యమయ్యే 15 నుండి 20 టిఎంసిల నీటిని రాజధాని, డెల్టా ప్రాంత మంచినీటి అవసరాలకు వినియోగించవచ్చని వారు సూచించారు. ప్రత్యేకంగా పులిచింతల రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీరు నిల్వ చేసుకోవటంతో పాటు సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు జూలై 15 నుండి ప్రతి సంవత్సరం సాగునీరు అందించవచ్చన్నారు. రాయలసీమ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 850 అడుగుల మేర ఎత్తులో ఉండటంతో ఈ ప్రాంతానికి నీరు ఎత్తిపోయటం సాధ్యం కాదన్నారు. కనుక ఎగువ నుండి వచ్చే నీటిని రాయలసీమకు ఈ పథకం ద్వారా తరలించే అవకాశం ఉందని వారు వివరించారు. వరదలు వచ్చినప్పుడు పోతిరెడ్డిపాడు కాలువ ద్వారా 50వేల క్యూసెక్కులు, వెలిగొండ ద్వారా 11,200, హంద్రీ-నీవా ద్వారా 3,800 క్యూసెక్కులు అంటే రోజుకు 5.6 టిఎంసీలు రాయలసీమలోని తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, సోమశిల రిజర్వాయర్లకు చేర్చటం ద్వారా వేలాది చెరువులు నిండిపోవటంతో పాటు భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని వారు వివరించారు. ఈ పథకం అత్యంత తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ముఖ్యంగా శ్రీశైలం వద్దకు చేరే నీరు దిగువకు (నాగార్జున సాగర్‌కు) విడుదల చేసే అవసరం చాలావరకు తగ్గిపోవటంతో పాటు రాయలసీమకు తరలించే గొప్ప అవకాశం లభిస్తుందని వారు వివరించారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచటం, రోడ్ కమ్ బ్యారేజీ నిర్మాణం, రెండు లిఫ్ట్‌ల ఏర్పాటు, పులిచింతల నుండి సాగర్ కుడికాల్వకు పంపే మార్గం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఖర్చు ఉండదని, ప్రస్తుతం అమలు చేస్తున్న నీటిపారుదల వ్యవస్థను వినియోగించుకొని దీన్ని అమలుచేయవచ్చని వడ్డే, ఎర్నేని వివరించారు.