ఆంధ్రప్రదేశ్‌

ఉగ్రవాదం, అవినీతి నిర్మూలనకే నగదు రహిత లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 20: దేశ సమగ్రత, ఆర్థికాభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారిన అవినీతి, ఉగ్రవాదాలను శాశ్వతంగా పారదోలేందుకు నగదు రహిత లావాదేవీలు దోహదపడతాయని పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. సోమవారం గుంటూరు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఏర్పాటు చేసిన డిజి ధన్‌మేళా కార్యక్రమాన్ని అశోక్ గజపతిరాజు, శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ డిజిటల్ లావాదేవీల వల్ల ప్రజల్లో జవాబుదారీతనం పెరగడమే కాకుండా అవినీతి నిర్మూలనమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకే అందుతాయన్నారు. దేశ జనాభాలో ఇప్పటివరకు ఒక శాతం మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని, నగదు రహిత లావాదేవీల వల్ల మరింతమంది పన్ను చెల్లింపుదారులుగా మారతారని ఆయన చెప్పారు. దీంతో దేశం ఆర్థికంగా బలోపేతం కావడమే కాకుండా పేద, బడుగు వర్గాల సంక్షేమానికి మరిన్ని పథకాలు అమలు చేయవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి మంత్రి మండలి సమావేశంలోనే నల్లధనం నిర్మూలనకు చర్యలు చేపట్టేలా తీర్మానం చేసిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తుచేశారు.
5.15 కోట్ల మందికి ఆధార్
రాష్ట్రంలో 5.22 కోట్ల మంది జనాభాకు గాను ఇప్పటివరకు 5 కోట్ల 15 లక్షల మందికి ఆధార్ కార్డులు జారీ చేసినట్లు యునిక్ (ఆధార్) డెప్యూటీ డైరెక్టర్ జనరల్ రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఎంపిక చేసిన 18 పథకాలను ఆధార్ నెంబర్‌తో దేశంలో మొట్టమొదట అనుసంధానం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కు దక్కుతుందని తెలిపారు. రాష్ట్రంలో కోటీ 30 లక్షల మందికి చెందిన రేషన్ కార్డులను, 35 లక్షల మంది పింఛన్‌దారులను, 70 లక్షల మంది జాతీయ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులను ఆధార్‌తో అనుసంధానం చేయడం అభినందనీయమన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, నీతి ఆయోగ్ సలహా సంఘ సభ్యులు ఎకె జైన్, కలెక్టర్ కాంతిలాల్ దండే, జెసి క్రితికా శుక్లా, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..నగదు రహిత లావాదేవీలపై వివరాలు అడిగి తెలుసుకుంటున్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. పక్కన స్పీకర్ కోడెల