రాష్ట్రీయం

కోటా ఇస్తే ఖబడ్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఖబడ్దార్ చంద్రబాబూ.. ఖబడ్దార్ రాజకీయ నాయకుల్లారా... ఓటు రాజకీయాల కోసం వత్తిళ్లకు లొంగి కాపులను బిసిలుగా గుర్తించే ప్రయత్నం చేస్తే పీఠాలు కదలగలవంటూ బిసి సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు, శాసనసభ్యుడు ఆర్.కృష్ణయ్య తీవ్రస్థాయిలో హెచ్చరించారు. చంద్రబాబు చేసే ప్రయత్నం పుణ్యమా అంటూ బిసిల్లోని 138 కులాలకు చెందిన 58 శాతం జనాభా ఏకమయ్యేందుకు అవకాశం లభించిందంటూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడంలో తమకెలాంటి అభ్యంతరం లేదని ఇందుకోసం తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన రీతిలోనే కులాల వారీ జనాభాను తేల్చాలంటూ ఆయన డిమాండ్ చేసారు. కమిషన్ సిఫార్స్‌లు, కేంద్రప్రభుత్వ రాజ్యాంగ సవరణలు లేకుండా గుడ్డిగా కాపులను బిసిలుగా గుర్తించే ప్రయత్నం చేస్తే పెద్దఎత్తున తిరుగుబాటు రాగలదంటూ హెచ్చరించారు. ఇందుకోసం బిసిలను చైతన్యపరిచేందుకై అన్ని జిల్లా కేంద్రాల్లో భారీఎత్తున బహిరంగ సభలు నిర్వహించదలిచామన్నారు. బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. గత యుపిఏ ప్రభుత్వం జాట్‌లకు రిజర్వేషన్ కల్పించగా తాము న్యాయపోరాటం చేసి చెంప చెళ్లుమనిపించామని అదేగతి చంద్రబాబుకు కూడా పట్టగలదంటూ హెచ్చరించారు. బిసిల ఓట్లతోనే ఎమ్మెల్యేలు, ఎంపిలు ఆపై మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కాగల్గుతున్నారనేది ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్నారు. తమ సహనాన్ని బలహీనతగా తీసుకుని నిర్ణయాలు తీసుకుంటే పీఠాలు కదలగలవంటూ మరోమారు హెచ్చరించారు. పేదలు కాపుల్లోనే కాదు రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల్లో కూడా వున్నారని అలాంటి వారికి ఆర్ధిక పరిస్థితులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవటంలో తప్పు లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం ఆర్ధిక, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ ప్రాధాన్యతలను బట్టి అంచనా వేస్తూ జనాభా నిష్పత్తికి తగ్గట్లుగా ఆయా రంగాల్లో ప్రాధాన్యత లేని పక్షంలోనే రిజర్వేషన్లు కల్పించాల్సి వుందన్నారు. అయితే కాపులు అన్ని రంగాల్లోను అగ్రస్థానంలోనే వున్నారనేది మరువరాదన్నారు. 50 శాతం జనాభాగా వున్న బిసిలకు ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి వుండగా ఒక్క కాపు కులానికే ఉప ముఖ్యమంత్రితో పాటు నలుగురు మంత్రులున్నారని అన్నారు. అలాగే ఎంపిల్లో కూడా అత్యధిక సంఖ్యలోనే వున్నారని గుర్తుచేశారు. గతంలో మండల కమిషన్ బిసిలకు అనుకూలమైన సిఫార్స్‌లు చేసినప్పుడు అగ్రవర్ణాలన్నీ ఏకమై తమ కులవృత్తులను హేళన చేస్తూ ఉద్యమించిన తీరును నేటికీ మర్చిపోలేదన్నారు. ఒక ఉద్యోగం కోసం ఓపెన్ కేటగిరీలో 70 శాతం మార్కులు వస్తే ఫర్వాలేదు, బిసిలు 68 శాతం మార్పులతో అవకాశం అందిపుచ్చుకుంటే వీరు ప్రతిభావంతులు కాదని వీరు వైద్యులుగా, ఇంజనీర్లుగా అనర్హులంటూ ప్రచారం చేస్తున్నారు. అదే 50 శాతం యాజమాన్యం సీట్లను 30 శాతం మార్కులు కూడా రాని అగ్రవర్ణాల వారు కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తుంటే వారు ఎలా అర్హులవుతారని కృష్ణయ్య ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే, సివిల్స్, బ్యాంకింగ్ ఇతర ఉద్యోగాల భర్తీలో బిసిలో కేటగిరీ లేనందున భవిష్యత్‌లో అగ్రకులాలు బిసిలుగా మారి ఆ ఉద్యోగాలన్నింటిని కొట్టివేసే పరిస్థితి వుందన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం పోరాడుతున్నది బిసి వర్గాల మినహా అగ్రవర్ణాలు కాదని అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులకే గాక బిసిలు కూడా 17 డిమాండ్లను తన ఎన్నికల మ్యానేఫాస్టోలో ఉంచారని ప్రధానంగా చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు తెప్పిస్తానంటూ చెప్పి నేటి వరకు ప్రధానమంత్రిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదంటూ ధ్వజమెత్తారు. తానేదో ఎన్నికల్లో కాపులకు హామీ ఇచ్చారంటూ చెబుతుంటే ఏ మాత్రం పప్పులు ఉడకపోవని హెచ్చరించారు. బిసిల్లో 14 కుల వృత్తి, కుల పరమైన కార్పొరేషన్లు వున్నాయని నాలుగైదు కోట్ల రూపాయల నిధులు లేవని, అదే కార్పొరేషన్‌కు వేల కోట్లు వేల కోట్లు ఎలా కుమ్మరిస్తారంటూ ప్రశ్నించారు. దేశంలో జాట్‌లు, పటేళ్లు, గుజ్జార్లు, తమిళనాడులో బ్రాహ్మణులు ఇలా అగ్రవర్ణాలు బిసి రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేస్తున్నాయంటూ అయినా న్యాయస్థానాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయన్నారు. అగ్రవర్ణాలను రాజ్యాధికారానికి దూరంగా వుంచేందుకు తమిళనాడు, యుపి, బీహార్ ప్రజలు చేస్తున్న కృషిని ఆంధ్రాలో కూడా ఆదర్శంగా తీసుకోవాలంటూ పిలుపునిచ్చారు. సభలో మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసగౌడ, విద్యార్థి సంఘం అధ్యక్షుడు మారేష్, నాయకులు పోతిన వెంకట మహేష్, సాల్మన్‌రాజు, లాకా వెంగళరావు యాదవ్, సుబ్బారావు యాదవ్, వివిధ జిల్లాలకు చెందిన నాయకులు ప్రసంగించారు.

చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణయ్య