ఆంధ్రప్రదేశ్‌

2019 ఎన్నికలు లక్ష్యంగా గ్రామస్థాయ నుంచి బిజెపి ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 16: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బిజెపి నిర్ణయంచింది. ఇందులో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటుచేయాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో మోదీ చిత్రపటాన్ని ఏర్పాటుచేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొంటున్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని, కేంద్రం నుంచి నేరుగా పంచాయతీలకే అనేక నిధులు మంజూరవుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మోదీ ప్రజా సంక్షేమానికి చేస్తున్న కృషిపై గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఆ పార్టీ నేతలు మరో అడుగు ముందుకువేసి వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్రం నిధులు సమకూరుస్తోందని, ఆ నిధుల మంజూరు తమ ఘనతేనంటూ తెలుగుదేశం నేతలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఇళ్ళు, మరుగుదొడ్లు, రహదారుల నిర్మాణానికి, ఉపాధి హామీ తదితర పథకాలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. విశాఖ, కాకినాడ, తిరుపతి తదితర నగరాలను తొలి విడతలోనే స్మార్ట్‌సిటీలుగా ఎంపిక చేసి నిధులు మంజూరు చేస్తోందని గుర్తుచేశారు. 2019 ఎన్నికల నాటికి గ్రామస్థాయిలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఎర్రచందనం ముఠా అరెస్ట్
నాగలాపురం, ఏప్రిల్ 16: ఎర్రచందనం హైజాక్ ముఠాను అరెస్ట్‌చేసి ఒక లారీ, రూ.15 లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలను పట్టుకున్న సంఘటన శనివారం ఉదయం చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం కారణి గ్రామ సమీపాన చోటుచేసుకుంది. సత్యవేడు సి ఐ నరసింహులు తెలిపిన వివరాల మేరకు.. రామచంద్రాపురం మండలం ఎన్ ఆర్ కమ్మపల్లికి చెందిన శేఖర్ (31), తిరుచానూరు బైపాస్ కెనడ నగర్‌కు చెందిన పడగర్తి రామకృష్ణ (29), మంగళంకు చెందిన బాలిరెడ్డి దినేష్ రెడ్డి (22) మరికొంతమందితో కలిసి కొంత కాలంగా ఎర్రచందనం అక్రమ రవాణాదారులకు పైలెట్‌గానూ, సలహాదారులుగానూ వ్యవహరిస్తూ వస్తున్నారు. వీరు డబ్బు ఎక్కువగా సంపాదించాలన్న ఆశతో గత కొంతకాలంగా తిరుపతి, ఇతర ప్రాంతాల నుంచి ఎర్రచందనం అక్రమంగా రవాణా అవుతున్న వాహనాల సమాచారం తెలుసుకొని మార్గ మధ్యంలో ఆపి తామే పోలీసులమని చెప్పి డ్రైవర్లను బెదిరించేవారు.

స్మగ్లర్లు ఇంటిదొంగలే!
ఒక అధికారి, నలుగురు ఫారెస్టు సిబ్బంది అరెస్టు
కడప,ఏప్రిల్ 16: శేషాచలం, నల్లమల అటవీ ప్రాంతాల్లో యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్న అటవీశాఖకు చెందిన ఒక ఫారెస్టు అధికారి, నలుగురు సిబ్బందిని శనివారం అరెస్టు చేశారు. ఓఎస్‌డి (ఆపరేషన్స్) సత్యఏసుబాబు నేతృత్వంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠి శనివారం వివరిస్తూ నలుగురు ఇంటి దొంగలతోపాటు 11 మంది ఎర్రచందనం స్మగ్లర్లను కూడా అరెస్టు చేశామని తెలిపారు. గత ఐదేళ్లుగా ఎర్రచందనం స్మగ్లర్లకు నలుగురు ఫారెస్టు సిబ్బంది సహకరిస్తూ ఎర్రచందనాన్ని ఎల్లలు దాటిస్తున్నట్లు చెప్పారు. రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎల్ శ్రీరాములు నాయక్ , ఫారెస్టు ప్రొటెక్షన్ వాచర్లు రామకృష్ణ, పెంచలయ్య, వెంకటేసు, తిరుపతిలకు ఇందులో పాత్ర ఉండగా, ఇప్పటికే ఒకరు సస్పెన్షన్‌కు గురయ్యారన్నారు. వీరంతా రాయచోటి, కోడూరు ఫారెస్టు ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా రాయచోటి రూరల్ సర్కిల్ పరిధిలోని సుండుపల్లె అటవీ సమీపంలో, అలాగే రైల్వేకోడూరు మాధవరం పోడు సమీపంలోని వాగేటికోన వద్ద 2.52 టన్నుల ఏ-గ్రేడ్ ఎర్రచందనం దుంగలను శనివారం స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.3కోట్లు చేస్తుందని పట్టుబడిన స్మగ్లర్లే తెలిపారన్నారు. దుంగలతోపాటు రెండు కార్లు, ఒక ట్రక్కు, ఒక ఆటో, నాలుగు మోటార్ బైక్‌లు, స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే ఎర్రచందనం స్మగ్లర్లు గజ్జల శ్రీ్ధర్‌రెడ్డి, జుబేనాయక్, ప్రసాద్ తోపాటు మరో 8మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గత కొన్నిరోజులుగా ఓఎస్‌డి సత్యఏసుబాబు నేతృత్వంలో మైదుకూరు అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు, రాయచోటి రూరల్ సిఐ ప్రభాకర్, రైల్వేకోడూరు సిఐ రసూల్‌ఖాన్ నిఘావేసి శనివారం వీరిని అరెస్టు చేశారన్నారు.

పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే
2 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
ఖమ్మం, ఏప్రిల్ 16: వచ్చే నెల 1వ తేదీలోగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుంటే 2 నుంచి నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేయనున్నట్లు నెట్‌వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు డాక్టర్ గొంగూర వెంకటేశ్వర్లు, గురునాథరావు స్పష్టం చేశారు. శనివారం వారిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మందికి వైద్య సేవలు అందించామని, గత 8 నెలలుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా 200 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఆసుపత్రులకు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. అందులో ఖమ్మం జిల్లాకు సుమారు 15కోట్ల రూపాయల బకాయి ఉందన్నారు. బిల్లులను విడుదల చేయాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, ఆరోగ్యశ్రీ సిఈఓకు కూడా సమస్యను విన్నవించామన్నారు. గత మూడు నెలలుగా తమ సమస్యను చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వైద్యం అందించి ఇప్పుడు తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామన్నారు. సమస్య పరిష్కారం కాకపోవటం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

హంస వాహనంపై
ఒంటిమిట్ట రామయ్య
ఘనంగా ఊంజల్ సేవ, వేణుగోపాలంకారం
ఒంటిమిట్ట, ఏప్రిల్ 16: మరో అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు శనివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు సీతారామలక్ష్ముణులకు పండితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య పంచామృతాభిషేకం జరిపి, తిరుమల తరహాలో ఊంజల్ సేవ నిర్వహించారు. ఒక ప్రక్క వేద పండితుల వేద పారాయణాల ఘోషతో మరో పక్క స్వామివారి చరిత్రను గాయని భక్తులకు వివరిస్తుండగా స్వామివారికి ఊంజల్ సేవ కన్నుల పండువగా సాగింది. శనివారం ఉదయం స్వామివారు వేణుగోపాలంకారంలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. రామనామ స్మరణలు మిన్నంటగా రాత్రి సైతం భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. కేరళ వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య రామయ్యకు వేణుగోపాలంకారం, ఊంజల్‌సేవ, తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఊంజల్ సేవ అనంతరం సీతారామలక్ష్ముణులు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. భక్తులు కాయ, కర్పూరాలు సమర్పించుకుని భక్తిని చాటుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

పనుల్లో జాప్యం చేస్తే
బ్లాక్‌లిస్టులో పెడతాం

కాంట్రాక్టర్లకు సిఎం హెచ్చరిక
మార్కాపురం/ పెద్దదోర్నాల, ఏప్రిల్ 16: పూలసుబ్బయ్యవెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగితే సహించేది లేదని, అవసరమైతే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. శనివారం సాయంత్రం టనె్నల్ ప్రాంతంలోని అతిథిగృహాంలో అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈప్రాజెక్టు పరిధిలో ఏడు ప్యాకేజీలు ఉండగా ఒక్కొక్క ప్యాకేజీపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే అనేక పర్యాయాలు కాంట్రాక్టర్ల కోరికమేరకు సమయం పెంచామన్నారు. ఇకపై అలాంటి పరిస్థితులు ఉండవని, దీనిని దృష్టిలో పెట్టుకొని పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలుచేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను కాంట్రాక్టర్లు సిఎం దృష్టికి తీసుకువెళ్తూ పనులు ప్రారంభమైన సమయంలో త్వరితగతిన చేయాలని భావించామని, మధ్యలో రాళ్ళు, నీళ్ళు, మట్టి లాంటివి అడ్డుపడటంతో జాప్యం జరుగుతుందని తెలిపారు. సిఎం స్పందిస్తూ టెండర్లు తీసుకునే సమయంలో రాబోయే సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని, అలాకాకుండా ఇప్పుడు కుంటిసాకులు చెప్పి పనులను జాప్యం చేయడం సరైన చర్య కాదని అన్నారు. ఇప్పటివరకు తాము ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సహించామని , ఇకపై రోజువారి, నెలవారి పనులు వివరాలను అందచేయాలని, అలాచేయకుంటే బ్లాక్‌లిస్టులో పెడుతామని అన్నారు. టెక్నికల్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిపుణులతో చర్చించి వాటి పరిష్కారం కనుగొని 45రోజుల్లో నివేదికలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ప్రాజెక్టు కెనాల్స్ తదితర ప్రాంతాల్లో చిన్నచిన్న పిల్లకాలువల గురించి నెలరోజుల్లో పూర్తిచేసి నివేదిక అందచేయాలని ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన విషయాలలో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించి కాంట్రాక్టర్లు పనులు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని, విడిభాగాలను ముందుగానే తెప్పించుకొని పనులు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఫీడర్ కెనాల్స్ పూరె్తైతే వాటిద్వారా వచ్చే నీటిని దగ్గరలోని చెరువులను నింపేవిధంగా చూడాలని ఆదేశించారు. ఒకసారి పనులను తీసుకున్న తరువాత ఆ పనులు పూర్తిచేయాల్సిన బాధ్యత ప్రతిఒకరిపై ఉందని, ఇకనుంచి ప్రాజెక్టు నిర్మాణపనులపై ప్రతినిత్యం సమీక్షించడం జరుగుతుందని అన్నారు. పనులు చేసే సమయంలో కొత్తకొత్త ఆలోచనలను మెరుగుపరచుకొని త్వరితగతిన సమస్యను అధిగమించి నిర్మాణపనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. ఈసమీక్ష సమావేశంలో జల వనరులశాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శిద్దా రాఘవరావు తదితరులు పాల్గొన్నారు
వెలుగొండ సొరంగం పనులు పరిశీలించిన సిఎం
ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద ఉన్న పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోగల రెండవ సొరంగం పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం సాయంత్రం పరిశీలించారు. ఒంగోలు నుంచి 4.14 గంటలకు వెలుగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న చంద్రబాబు 4.45 గంటలకు వెలుగొండ సొరంగంలోకి వెళ్ళి పనులను పరిశీలించి 5.10గంటలకు బయలుదేరి వెలుగొండ ప్రాజెక్టు అతిథి గృహానికి చేరుకొని కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

గురుకులాల్లో కార్పొరేట్ విద్య
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
శింగరాయకొండ, ఏప్రిల్ 16: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం ప్రకాశం జిల్లా శింగరాయకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ఆయన రాజీవ్ విద్యామిషన్ ద్వారా 13కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలల్లో మెరుగైన విద్యతోపాటు మంచి వసతులు కల్పిస్తోందన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 500 మాత్రమే ఉన్న సీట్లను తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే 1000 సీట్లు పెంచామన్నారు. కార్పొరేట్ పాఠశాలలు కన్నా గురుకుల పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తారని, ప్రతి పేద విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన సూచించారు. విద్యార్థులతో మమేకమై రానున్న రోజుల్లో ఎటువంటి ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారని విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎటువంటి ఫీజు లేకుండా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీఓను తెచ్చిందన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే స్కాలర్‌షిప్‌లు గతంలో సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి వచ్చేవని, ప్రస్తుత ప్రభుత్వం ప్రతి నెలా విద్యార్థి బ్యాంక్ ఖాతాలో స్కాలర్‌షిప్‌లు జమ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు.

గోదావరిలో డ్రెడ్జింగ్‌కు రంగం సిద్ధం
వెలికిరానున్న లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక టెండర్లు పిలిచిన కార్పొరేషన్ విస్తరించనున్న నదీ గర్భం

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 16: గోదావరి నదిలో డ్రెడ్జింగ్‌కు రంగం సిద్ధమైంది. ఈ ప్రక్రియలో నదీ గర్భాన్ని లోతు చేసి నీటి లభ్యత పెరిగేలా చేయడంతోపాటు రోజుకు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఒడ్డుకు చేరనుంది. దశాబ్దాల తరబడి గోదావరి నదిలో ఇసుక డ్రెడ్జింగ్ జరగలేదు. పూడిక బాగా పెరిగిపోయింది. ఇసుక మేటలు ద్వీపాల్లా పెరిగిపోయాయి. నదీ గర్భం పూడుకుపోవడంతోపాటు పరీవాహక ప్రాంతం విస్తరించింది. దీంతో నది గమన దిశలు మారిపోతున్నాయి. సాధారణంగా ఇసుక మేటలు, దిబ్బలను తొలగించేందుకు నిరంతరం డ్రెడ్జింగ్ ప్రక్రియ కొనసాగించాల్సి ఉంది. ఈ ప్రక్రియ దశాబ్దాలుగా సాగనేలేదు. ఇసుక డిమాండ్ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి నదిలో డ్రెడ్జింగ్ చేయాలని తలంపు వచ్చింది. గత పుష్కరాలకు ముందే ముఖ్యమంత్రి ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికి కార్యరూపం దాల్చింది. ఈ డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక దిబ్బలను తొలగించడం ద్వారా సుమారు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక లభించగలదని అంచనా. నదిలో నీటి లభ్యతకు ఢోకా ఉండదని, రబీలో నీటి కష్టాలు తప్పుతాయని, సీలేరుపై ఆధారపడకుండానే నీటి లభ్యత చేకూరుతుందని అంచనా వేస్తూ నివేదిక ఇవ్వడంతో డెడ్జింగ్‌కు రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆ సంస్థ పర్యవేక్షణలో పెట్రోలియం అనే మరో సంస్థ ఇసుక డ్రెడ్జింగ్‌కు అనుమతి పొందినట్టు తెలుస్తోంది. ఈ సంస్థలు టెండర్ ప్రక్రియలో ఇసుక దిబ్బల తొలగింపు, ఇసుక తరలింపు చేపట్టనున్నట్టు సమాచారం. కనీసం మూడేళ్లపాటు ఈ ప్రక్రియ కొనసాగించేలా నిర్ధేశించారు. నెలకు కనీసం లక్ష నుండి లక్షా యాభై క్యూబిక్ మీటర్ల ఇసుకను బయటకు తీసే అవకాశం ఉందని ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ డ్రెడ్జింగ్ వల్ల నదీ గర్భం పెరుగుతుంది. ఇసుక దిబ్బలను ప్లవింగ్ ద్వారా బలహీన పర్చడం, ప్రవాహానికి అడ్డంకులులేకుండా చేయడం, ఇసుక తొలగింపు డ్రెడ్జింగ్ ప్రక్రియలో కీలక విధులు. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో డ్రెడ్జింగ్ విధులు నిర్వహించేలా ఆ సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం బ్రిడ్జిలంక, ఔరంగాబాద్, గోంగూర తిప్ప తదితర ప్రాంతాలను గుర్తించి డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు అప్పగిస్తున్నారు. ఎట్టకేలకు డ్రెడ్జింగ్ విధులు వల్ల గోదావరిలో నీటి లభ్యత పెరిగి రబీకి నీటి ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది.