ఆంధ్రప్రదేశ్‌

ఎపిలోనూ యుపి ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 10: ఉత్తరాది ఎన్నికలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా ఉంటాయన్న ఎగ్జిట్‌పోల్స్ నేపథ్యంలో, ఫలితాల అనంతరం ఏపిలో కూడా యుపి ప్రయోగానికి బిజెపి నాయకత్వం సిద్ధమవుతోంది. ఆంధ్రపదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలపై సీరియస్‌గా దృష్టి సారించాలని కూడా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. యుపీలో కుల సమీకరణలతో విజయానికి చేరువయిన ఫార్ములానే, ఏపీలోనూ అమలు చేయాలని నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఓబీసీలో పెద్ద కులమైన యాదవులకు, 19.8 శాతం ఉన్న ముస్లింలకు ఒక్క సీటు ఇవ్వకుండా, ఓబీసీలోని మిగిలిన కులాలకు చేరువయి, టికెట్లు ఇచ్చిన ప్రయోగం ఫలించినట్లు ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయని బిజెపి నేతలు విశే్లషిస్తున్నారు. తనతో రాని కులాల కోసం పరుగులు పెట్టి ప్రయాస పడకుండా, తనతో కలసి వచ్చే కులాలనే ఎంపిక చేసుకుని సక్సెస్ అయిన విధంగానే, ఏపిలో కూడా తనతో కలసి వచ్చే కులాలనే ఎంపిక చేసుకుని, నాయకత్వ బాధ్యతలు కూడా వారికే అప్పగించాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వివరించాయి.
ఎన్నికల ఫలితాల తర్వాత ఏపితోపాటు తెలంగాణ, ఒడిశా పార్టీలోనూ పెనుమార్పులు వస్తాయని బిజెపి నేతలు జోస్యం చెబుతున్నారు. ఎవరినైతే ఎంపిక చేసుకుంటారో అదే సామాజికవర్గాన్ని ఇప్పటినుంచే ప్రోత్సహించే విధానానికి శ్రీకారం చుట్టనుంది. యుపిలో పెద్ద సంఖ్యలో ఉన్న యాదవులను కాదని, మిగిలిన బీసీలను ఏవిధంగా ప్రోత్సహించిందో ఏపీలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్న కాపులను దరిచేర్చుకునేందుకు పార్టీ రంగం చేసిందని, అటు తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉన్న కాపులకు నాయకత్వ బాధ్యత కట్టబెట్టడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని గంపగుత్తగా ఆకట్టుకోవాలన్నది పార్టీ వ్యూహమంటున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో బలంగా ఉన్న బీసీ వెలమ, తూర్పు కాపు, కళింగులు, తూర్పు కాపులను ప్రోత్సహించాలని భావిస్తోంది. రాష్ట్రంలో కమ్మ వర్గంతోపాటు కొన్ని బీసీ కులాలు తెలుగుదేశంవైపు, రెడ్డితోపాటు మైనారిటీలు వైసీపీ ఉండగా, ఐదుజిల్లాల్లో బలంగా ఉన్న కాపులు భవిష్యత్తులో ఎటువెళ్లాలో అర్థంకాని అయోమయంలో ఉన్నారు. పవన్‌కు మద్దతునివ్వాలా.. లేదా? ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉంటారా లేక అన్నయ్య చిరంజీవి గతంలో తమను సగంలో వదిలేసి వెళ్లినట్లు అస్తస్రన్యాసం చేసి వెళతారా? పైగా పవన్ తనపై కులముద్ర వేయవద్దని చెబుతున్నందున ఆయన విధానాలేమిటో అర్థం కానందున, పవన్‌కు జైకొట్టడం ఎంతవరకూ సరైనదన్న భావన కాపు వర్గాల్లో ఉంది.
ఇప్పటికే రెండుపార్టీలకు సంప్రదాయ మద్దతుదారుగా ఉన్న కులాల వెంట పడేకంటే, నాయకత్వం అందిస్తే వచ్చేందుకు సిద్ధంగా ఉన్న కాపులను ప్రోత్సహించడమే సరైనదన్న నిర్ణయానికి నాయకత్వం కూడా వచ్చిందంటున్నారు. ఫలితాల అనంతరం ఆ మేరకు కాపు వర్గానికి చెందిన నేతకే పార్టీ పగ్గాలు అందిస్తారంటున్నారు. నిజానికి గతంలోనే ఆ వర్గానికి చెందిన సీనియర్ నేత సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణలో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కే సమయంలో, పార్టీని శాసిస్తున్న ఒక సీనియర్ చక్రం అడ్డువేసి, ప్రస్తుత అధ్యక్షుడినే కొనసాగేలా చూడటంలో విజయం సాధించారు. అయితే, పార్టీలో కమ్మ సామాజికవర్గాన్ని ఎంత ప్రోత్సహించినా వారు మానసికంగా తెలుగుదేశం బలపడాలని చూస్తున్నారే తప్ప, ఆ వర్గాన్ని పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయని వైనాన్ని గ్రహించిన తర్వాతనే నాయకత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అటు తెలంగాణలో కూడా మున్నూరు కాపు, యాదవ, పద్మశాలి, ముదిరాజ్‌లలో ఇప్పటికీ ఏ ఒక్క వర్గం ఏ ఒక్క పార్టీకి మద్దతుగా లేదు. అక్కడ తెలుగుదేశం బలంగా ఉన్నప్పుడు ఈ వర్గాలన్నీ ఆ పార్టీకే మద్దతునిచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కులాల్లో ఒక వర్గాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా మున్నూరు కాపు వర్గానికి చెందిన సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు.
ఇదిలాఉండగా, యుపిలో ఒక పోలింగ్‌బూత్ లిస్టులో ఉండే 30మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించిన ప్రయోగమే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమలుచేయనున్నట్లు చెబుతున్నారు. యుపిలో కులాలవారీగా సమీకరణల విషయంలో సంఘ్ ఏడాదిన్నర నుంచి క్షేత్రస్థాయిలో వ్యూహరచన చేసిందని, ఏపిలో కుల సమీకరణపై సంఘ్ కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందని పార్టీ నేతలు వివరించారు. ‘యుపి ఫలితాల తర్వాత మన రాష్ట్రంలోనూ అనూహ్య మార్పులుంటాయి. తెలుగుదేశంతో పొత్తుతో సంబంధం లేకుండా 12 పార్లమెంటు స్థానాల్లో గెలుపే ప్రాతిపదికగా నిర్ణయాలుండబోతున్నాయి. నాగపూర్‌లో ఇటీవల జరిగిన సంఘ్ కీలక సమావేశంలో కూడా ఏపి, తెలంగాణ, ఒడిషాపై సీరియస్‌గా దృష్టి సారించాలని నిర్ణయించింద’ని ఓ సీనియర్ నేత వెల్లడించారు.