ఆంధ్రప్రదేశ్‌

మూడుచోట్లా సత్తాచాటిన టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప/కర్నూలు/ నెల్లూరు, మార్చి 20: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టిడిపి సత్తాచాటింది. కడప, కర్నూలు, నెల్లూరుల్లో ఘన విజయం సాధించింది. ప్రతిక్ష వైకాపా ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. కడపలో నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిటెక్ రవి(మారెడ్డి రవీంద్రారెడ్డి) తన సమీప వైకాపా అభ్యర్థి వైఎస్.వివేకానందరెడ్డిపై 38 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో ఉదయం ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 839 ఓట్లు పోలవ్వగా అందులో 8 ఓట్లు చెల్లకుండాపోయాయి. దీంతో మిగిలిన 831 ఓట్లలో టిడిపి అభ్యర్థి బి.టెక్ రవికి 434 ఓట్లు, వైకాపా అభ్యర్థి వైఎస్.వివేకానందరెడ్డికి 396 ఓట్లు పోలయ్యాయి. మొత్తం మూడు రౌండ్లలో ఓట్లు లెక్కించారు. మొదటి రౌండ్‌లో వివేకా ఆభిక్యం సాధించగా చివరి రెండు రౌండ్లలో బిటెక్ రవి ఆధిక్యం కనబరచి విజేతగా నిలిచారు. దీంతో బిటెక్ రవి 38 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.
కాగా కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై 62 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సోమవారం ఉదయం 8 గంటలకు కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ స్కూల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 1084 ఓట్లు ఉండగా 1077 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 11 ఓట్లు చెల్లకుండా పోయాయి. టిడిపి అభ్యర్థి శిల్పాకు 564 ఓట్లు, వైకాపా అభ్యర్థి గౌరు వెంకటరెడ్డికి 502 ఓట్లు వచ్చాయి. దీంతో టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచి ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు పోటాపోటీగా వచ్చాయి. ఒక దశలో ఓట్లు సమానంగా వస్తాయా అన్న ఉత్కంఠ నెలకొంది. చివరకు టిడిపి 62 ఓట్ల ఆధిక్యత సాధించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.
నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ఎంపిడిఓ కార్యాలయంలో ప్రారంభమైంది. నెల్లూరు స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ టిడిపి నుండి పోటీ చేయగా వైసీపీ నుండి ఆనం విజయకుమార్‌రెడ్డి బరిలో నిలిచారు. కౌంటింగ్ జరిగిన గంట అనంతరం ఫలితం వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన వాకాటి నారాయణరెడ్డికి 465 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆనం విజయకుమార్‌రెడ్డికి 378 ఓట్లు వచ్చాయి. దీంతో వాకాటి నారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థిపై 87 ఓట్ల అధిక్యతతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. మొత్తం 851 ఓట్లకు గాను 8 ఓట్లు చెల్లలేదు. 5 టేబుల్‌పై కౌంటింగ్ జరిపారు. మొదటి టేబుల్‌లో వైసీపీ అభ్యర్థి మెజార్టీ ఉన్నప్పటికి మిగిలిన 4టేబుళ్లలో టిడిపి మెజార్టీ కొనసాగింది. దీంతో వాకాటి విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ వ్యవహరించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కౌంటింగ్ జరిగింది. ఎన్నికల పరిశీలకురాలుగా దేవాదాయశాఖ కమిషనర్ వైవి అనూరాధ పర్యవేక్షించారు.

చిత్రాలు.. ధృవీకరణ పత్రం అందుకుంటున్న కర్నూలు ఎమ్మెల్సీ విజేత శిల్పా చక్రపాణిరెడ్డి*నెల్లూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన టిడిపి అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి