ఆంధ్రప్రదేశ్‌

పులివెందుల దాహం తీర్చేదీ చంద్రబాబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: పులివెందులకు చివరికి దాహం తీర్చేది చంద్రబాబునాయుడేనని టిడిపి నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ముద్దు కృష్ణమ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ 21 మంది ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నారని పేర్కొంటూ వ్యాఖ్యానించిన జగన్ వాస్తవ పరిస్థితిని ఇప్పటికైనా అర్థం చేసుకుని మాట్లాడాలని అన్నారు. గతంలో గవర్నర్ రాంలాల్‌ను అడ్డంపెట్టుకుని ఎన్టీఆర్‌ను పడగొట్టాలని ఇందిరాగాంధీ చేసిన కుట్ర వెనుక నేటి కాంగ్రెస్ నేతలు లేరా అని నిలదీశారు. టిఆర్‌ఎస్‌ను వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువునా చీల్చిన నాడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని నిలదీశారు.
‘సేవ్ డెమొక్రసీ’ అనేంత అవసరం ఏం వచ్చిందని జగన్‌ను ఆయన నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యల కారణంగా కరవు తగ్గిందని, మహారాష్టల్రో తాగడానికి నీళ్లు లేక రైళ్లలో నీళ్లు తెప్పించుకుంటున్న పరిస్థితిని కళ్లారా చూస్తున్నామని అన్నారు. తెలంగాణలో, కర్నాటకలో, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కరవు ప్రభావం విపరీతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అతి స్వల్పంగా ఉన్న కరవు గురించి అర్థం లేని ఆందోళనలు, ఖాళీ బిందెల ప్రదర్శనలు చేస్తామనడం వైకాపా దివాళాకోరుతనమని అన్నారు. సీమలో కరవు నివారణకు జిల్లాకు 15 కోట్లు, ఇతర జిల్లాలకు 10 కోట్లు చొప్పున నిధులు కేటాయించి నీటి ఎద్దడిపై చంద్రబాబునాయుడు సమరం చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాకు 3 కోట్లు వెచ్చించి చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ నీరు, ఓఆర్‌ఎస్ పంపిణీ చేస్తున్నారని అన్నారు.

రెండు వర్శిటీల విసిల
ఎంపికకు సెర్చ్ కమిటీలు
హైదరాబాద్, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్‌లో రెండు విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్ల ఎంపికకు ప్రభుత్వం సెర్చ్ కమిటీలను నియమించింది. యోగి వేమన యూనివర్శిటీ సెర్చ్ కమిటీలో ఇసి నామినీగా ప్రొఫెసర్ వి ఎస్ ప్రసాద్, యుజిసి నామినీగా ప్రొఫెసర్ ఇందర్ మోహన్ కాపీని నియమించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ ఇసి నామినీగా ప్రొఫెసర్ ఎ లక్ష్మయ్యను, యుజిసి నామినీగా ప్రొఫెసర్ హెచ్ దేవరాజ్‌ను నియమించారు. ఇరు కమిటీల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక సభ్యుడిగా ఉంటారు. వీరంతా విసి పదవికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి మూడు పేర్లను సూచిస్తారు. వాటి నుండి ఒకరిని రాష్ట్ర గవర్నర్ విసిగా నియమించనున్నారు.

గూడూ లేదు..పోడూ పోయె!

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 20: పాలకుల నిర్లక్ష్యానికి, అధికారుల అలక్ష్యానికి అమాయక గిరిజనులు నానా అవస్థలకు గురవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా మన్యంలో పోడు వ్యవసాయం లేక ఆదివాసీలు అల్లాడుతున్నారు. కోట్ల విలువైన భూగర్భ సంపదను బహుళ జాతి కంపెనీలకు ధారాదత్తం చేస్తున్న పాలకులు గిరిజనుల పొట్టకూటి కోసం సెంటు అటవీ భూమికి సైతం పట్టాలివ్వకుండా చట్టాలతో నలిపేస్తున్న వైనమిది. ప్రస్తుతం తూర్పు మన్యంలో ఆదివాసీలు పోడు వ్యవసాయం కోసం ఆరాటపడుతున్నారు. తమకు పోడు పట్టాలివ్వాలని ఆక్రందన చేస్తున్నారు. కొండ కోనల మధ్య అమాయక జీవనం..వాగులు, వంకలు, సెలయేర్ల మధ్య సహజ జీవితం..వారికి తెలిసిందల్లా ఒకటే..అదే వ్యవసాయం. ఈ దేశం మూల నివాసులైన గిరిజనం అభివృద్ధికి ఆమడ దూరంలో పాలకుల నిర్లక్ష్యానికి గురై నలిగిపోతున్నారు. ఉపాధి లేక అలమటిస్తున్నారు.
పొట్ట నింపే పోడు వ్యవసాయం నుండి వారిని పాలకులు బెదరగొడుతున్నారు. తరతరాలుగా పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నామని.. ఇప్పుడు పోడు లేకుండా తమను భూమిల నుండి తరిమేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. గిరిజనుల అభివృద్ధికి, వారి జీవన ప్రమాణాలను పెంపొందించాల్సిన ఐటిడిఎ బహుళ జాతి కంపెనీల ప్రయోగశాలగా మారింది. గిరిజనుల అభివృద్ధికి నామ మాత్రంగా కూడా దోహదపడడం లేదని, తరతరాలుగా మారని గిరిజనుల జీవితాలను బట్టి అద్దమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రకరకాల పంటలు వేస్తూ విదేశాలలో గిరాకీ ఉన్న ఔషధ మొక్కల పెంపకం పేరుతో వివిధ రకాల పథకాలు పెట్టి గిరిజనుల భూములను ప్రయోగశాలగా మార్చిన ఐటిడిఎ చిత్తశుద్ధిగా గిరిజనుల జీవన స్థితిగతులు మార్చవలసి ఉంది. గిరిజనులు పోడు వ్యవసాయం చేసి జీవిస్తుంటే..అడవులను ధ్వంసం చేస్తున్నారని అటవీ శాఖాధికారులు గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. తమపై అక్రమ కేసులు బనాయిస్తూ చెట్టుకొకరు..పుట్టకొకరుగా చేస్తున్నారని గిరిజనులు ఆందోళన బాట పట్టారు. తరతరాలుగా పోడు వ్యవసాయానే్న నమ్ముకున్న తమకు పట్టాలివ్వాలని ఐటిడిఎ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకృతి వడిలో కాయకష్టం చేసుకుని జీవిస్తున్న ఆదివాసీలు ఇటు పోడు లేక..అటు ఉపాధి కానరాక ఉసూరుమంటున్నారు. ప్రభుత్వం 2005లో పట్టాలివ్వాలని చట్టం చేసినా పట్టించుకునే నాథుడు కరవయ్యాడు. పూర్వం నుండీ తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న గిరిజనమే కాకుండా ఇప్పుడు పోలవరం ప్రోజెక్టు ముంపు మండలాల్లో పోడు వ్యవసాయం కోసం గిరిజనులు పోరాటం సాగిస్తున్నారు. పోడు చేసిన భూములకు పట్టాలివ్వాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం రక్షణ కల్పించాలని డిమాండు చేస్తున్నారు. పోలవరం ముంపు మండలాల్లో ఒక లక్షా, 14వేల ఎకరాలకు పోడు పట్టాలు ఉండగా, ఇప్పటికి వచ్చి అధికారుల నుండి ఏ ఒక్కరికీ పట్టాలిచ్చిన దాఖలాలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం పోడు భూములకు పట్టాలివ్వాలని, తమపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని గిరిజనులు ఆందోళన బాట పట్టారు.