ఆంధ్రప్రదేశ్‌

ప్రజాసేవే నా ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరం ఎప్పుడోసారి పోయేవాళ్లమే మతాలు, ప్రార్థనా మందిరాలు లేకపోతే పిచ్చాసుపత్రులే గతి
సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు త్వరలో ఐదు అకాడమిలు 50వేల మందికి కూచిపూడి శిక్షణ
100కోట్లతో కూచిపూడిలో నాట్యారామం తెలుగు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు ఉగాది వేడుకల్లో చంద్రబాబు

విజయవాడ, మార్చి 29: మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, తన వరకు చనిపోయిన తర్వాత కూడా ప్రజలు తనను శాశ్వతంగా గుర్తించుకోవాలనే ఏకైక లక్ష్యంతో ప్రజల కోసం ఏదో చేయాలనే తపనతోనే బతుకుతున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ఉగాది వేడుకల సందర్భంగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పలుమార్లు భావోద్వేగంతో మాట్లాడారు. ‘‘ప్రతి రోజూ తెల్లవారుజామున కొంతసేపు ధ్యానంలో మునిగిపోతాను. అప్పుడే అన్నీ ఆలోచిస్తుంటా. కింది స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలా రాగలిగాను? నా తాత ముత్తాతల గతం ఏమిటి. ప్రస్తుతం ఉన్న ఈ స్థానం నుంచి ప్రజలకు ఏమి చేయగలను, ఇందుకు నాకున్న శక్తి సామర్థ్యాలు ఏమిటి, నా లక్ష్యసాధనలో ఏ విధంగా ముందుకెళ్లాలి’’ అని అనునిత్యం ఆలోచిస్తుంటానన్నారు. తన జీవితాంతం పేదలకు చేదోడువాదోడుగా ఉంటూ వారిని పైకి తీసుకురావాలనే మహా సంకల్పంతో పనిచేస్తున్నాన్నారు. తెలుగువారు గర్వించేలా రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టడమే కాదు.. అ అంటే అమ్మతోపాటు అమరావతిని చేర్చటమే కాక ఆ.. అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా చేసి చూపిస్తానన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక తుమ్మలపల్లి వారి కళా క్షేత్రం గ్రామీణ ప్రాభవం ఉట్టిపడేలా ఎంతో ఉత్సాహంగా జరిగిన హేమలంబ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఎం చంద్రబాబు, సమాజంలో మతాలు, ప్రార్థనా మందిరాలు లేకపోతే ప్రతి ఒక్కరూ మానసిక అశాంతితో పిచ్చాసుపత్రులకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఈ మందిరాల పట్ల న్యాయం, ధర్మం పాటించాలనేది ప్రతి ఒక్కరూ గుర్తించటమేగాక ఎవరికి వారు తమకు తోచిన సమయంలో కొంతసేపు అయినా భగవంతుని సేవలో ఉపశమనం పొందగల్గుతున్నారని అన్నారు. ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణానికి తెలుగు ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించడమేకాక ఆ ఏడాదిలో తమ తమ జన్మ నక్షత్రాలను బట్టి ఏ రోజు ఏమి చేయాలో, ఏమి చేయరాదో కూడా డైరీల్లో రాసుకుంటున్నారని అన్నారు. కూడిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ‘నాట్యారామా’నికి తొలుత వంద కోట్లు కేటాయిస్తామన్నారు. అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో తొలిదశగా వెయ్యి పాఠశాలల్లో 50వేల మంది విద్యార్థులకు కూచిపూడి శిక్షణ ఇవ్వబోతున్నామని, ఇందుకోసం అవసరమైన ఉపాధ్యాయులను నియమించగలమని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తెలుగు భాషా సంస్కృతిని పరిరక్షించుకోటానికై త్వరలోనే సంగీత, సాహిత్య, నృత్య, చరిత్ర, లలిత కళల అకాడమీలను పునరుద్ధరించడంతో పాటు జానపద, గ్రామీణ సాంకేతిక అకాడమీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వాటి ద్వారా తెలుగునాట సంస్కృతి, సంప్రదాయాలను కాపాడి తీరుతామన్నారు. ఆంగ్ల భాషను నేర్చుకుంటూనే మాతృభాష తెలుగును కాపాడుకోవాల్సి ఉందంటూ అందుకే విస్తృత అధికారాలతో తెలుగు సాధికార సంస్థను ఏర్పాటు చేశామన్నారు. మరింతగా తెలుగు భాషాభివృద్ధి కోసం శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌తో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు.
ఇక ఉగాదిని, ఉగాది పచ్చడితో ప్రారంభించే సంస్కృతి తెలుగు వారికొక్కరికే సొంతమని చంద్రబాబు అన్నారు. జీవితంలో కష్టం, సుఖం అన్నీ కలిసి ఉంటాయని తెలిపేందుకే ఈ పచ్చడిలో పులుపు, తీపి, వగరు, చేదుల కలయికతో కూడిన షడ్రుచులతో ఈ పచ్చడిని తయారు చేస్తున్నారన్నారు. అసలు ఈ ప్రపంచంలోనే తెలుగువారికి ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. ఇంగ్లీషు సంవత్సరాలలో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఉంటే శాలివాహన శకం తెలుగువారి ప్రత్యేకత అన్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి ఎంతో గర్వకారణమన్నారు. ఈ ఏడాది వర్షాలు లేకపోయినా, పంటలు సమృద్ధిగా పండగలవని పంచాంగాలు చెబుతుండటం చూస్తే తాము చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నీ దిగ్విజయంగా పూర్తి కాగలవనే ఆత్మ విశ్వాసం తనలో పెరుగుతున్నదని అన్నారు. తమ ప్రభుత్వం తాజాగా లేపాక్షి, గండికోట, విశాఖ, కాకినాడ, కృష్ణరాయ ఉత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలు చివరి వరుసలో ఉన్న ప్రతి పేదవానికి అందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని అన్నారు.
తొలుత వేదాంతం రాజగోపాల చక్రవర్తి అర్ధగంట పాటు పంచాంగం శ్రవణం చేయగా, బ్రహ్మశ్రీ కూర్మనాథం వ్యవసాయ పంచాంగ శ్రవణం చేశారు. సభలో శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ ఎ చక్రపాణి, ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, రాష్ట్ర మంత్రులు మాణిక్యాలరావు, ప్రత్తిపాటి పుల్లారావు ప్రసంగించారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం స్వాగతం పలికారు.

చిత్రం... హేమలంబ ఉగాది వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చందబాబు