ఆంధ్రప్రదేశ్‌

‘పార్లమెంటు’ కోసం ‘సైకిల్’ పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 1: రానున్న ఎన్నికల్లో మెజారిటీ పార్లమెంటు, దానితోపాటు అధిక సంఖ్యలో శాసనసభ స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించిన లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జిల వ్యవస్థ మంత్రులను పరుగులు పెట్టిస్తోంది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇటీవల రూపొందించిన, పార్లమెంటు ఇన్చార్జి వ్యవస్థ ద్వారా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలోని పార్టీ స్థితిగతులు, బలహీనతలు, ప్రతిపక్షాల పరిస్థితి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల తీరుతెన్నులు క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటికి అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దాలని బాబు సంకల్పించారు. గతంలో ఉన్న జిల్లా ఇన్చార్జి మంత్రుల వ్యవస్థ మాదిరిగా దీనిని ఆషామాషీగా తీసుకునేందుకు వీలులేకుండా, పటిష్టమైన మార్గదర్శకాలు రూపొందించారు. దీనితో మంత్రులు తమ శాఖాపరమైన అంశాలు, నియోజకవర్గ సమస్యలతోపాటు, తమకు అప్పగించిన పార్లమెంటు నియోజకకవర్గ బాధ్యతలపైనా అధిక దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా వివిధ కారణాలతో పార్టీకి దూరంగా ఉంటున్న వారిని గుర్తించి వారిని మళ్లీ ఉత్సాహపరచడం, వివిధ పదవుల్లో ఉన్న వారి పనితీరు విశే్లషించి వారినీ చైతన్యపరచటం వంటి బాధ్యతలు మంత్రులపై పెట్టింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ల సందర్భంగా అంతర్గత కలహాలు రేగకుండా ఇప్పటినుంచే అసంతృప్తిపరులు, సమర్థత ఉన్నా సరైన ప్రోత్సాహం లేక వౌనంగా ఉంటున్న వారిని గుర్తించి వారికి సరైన బాధ్యతలు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గ స్థాయిలో విబేధాలున్న వారితో చర్చించి వారి మధ్య సఖ్యత కుదిర్చాల్సి ఉంటుంది. పార్టీ బాగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాలు, ఒకస్థాయిలో ఉన్న నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి సారించడంతోపాటు, గత ఎన్నికల్లో మండల, వార్డు స్థాయిలో వచ్చిన ఓట్లను పరిశీలించి, అప్పట్లో పార్టీని ఆదరించని ప్రాంతాలపై పూర్తి స్థాయి దృష్టి సారించాల్సి ఉంది. ఆ రకంగా అక్కడ ఈసారి ఓట్ల శాతం పెంచుకోవాలన్నది నాయకత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, ఇన్చార్జి, పార్లమెంటు నియోజకవర్గాల ఎంపి, ఇన్చార్జిల పనితీరును సేకరించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరకంగా ఇది పార్టీ స్థితిగతులు క్షేత్రస్థాయి నుంచి తెలుసుకునే విధానమేనని సీనియర్లు విశే్లషిస్తున్నారు. ప్రధానంగా నాయకుల మధ్య కొనసాగుతున్న అంతర్గత విబేధాలు, పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలు, బలంగా ఉన్న నేతలు, ప్రోత్సాహం లేక అంటీముట్టనట్లు వ్యవహరిస్తోన్న నేతల వివరాలు తెలుసుకుని వారికి ప్రత్యామ్నాయ సూచనలు ఇచ్చే బాధ్యతను మంత్రులపై భుజస్కంధాలపై ఉంచింది. గత వారం అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు బాధ్యుల పేర్లు ప్రకటించిన నాయకత్వం, అప్పుడే వారిని నియోజకవర్గాలకు పరుగులు పెట్టిస్తోంది. ఈ వ్యవస్థను ఆషామాషీగా తీసుకోవద్దని, ఎన్ని పనులున్నా వాటిని పక్కకుపెట్టి ఇదే ముఖ్యమైన వ్యవహారంగా తీసుకోవాలన్న చంద్రబాబునాయుడు హెచ్చరికలు మంత్రులపై బాగా చూపిస్తున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి యనమల రామకృష్ణుడు విజయవాడలో సోమవారం పార్టీ నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బాపట్ల ఇన్చార్జిగా నియమితురాలైన మంత్రి పరిటాల సునీత ఒంగోలులో పర్యటించారు. కాగా మంత్రులు ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు, ఎంతమందిని కలుస్తున్నారన్న అంశాన్ని పార్టీ కార్యాలయం ప్రతిరోజూ సమీక్షిస్తుందంటే, ఈ వ్యవస్థపై చంద్రబాబునాయుడు ఎంత సీరియస్‌గా దృష్టిసారించారో స్పష్టమవుతోంది. తొలుత ఇల్లు చక్కదిద్దుకుని, తర్వాత ఎన్నికలపై దృష్టి సారించాలన్న లక్ష్యమే ఈ వ్యవస్థ ఏర్పాటుకు కారణమని అర్ధమవుతోంది.