ఆంధ్రప్రదేశ్‌

క్రమశిక్షణ తప్పుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 2: ‘పార్టీలో క్రమశిక్షణ గతంలో మాదిరిగా ఉండటం లేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నోరు పారేసుకుంటున్నారు. సమయపాలన పాటించడం లేదు. ప్రధానితో మీటింగంటే నేను అరగంట ముందే వెళ్తా. హాల్ బయటకు వచ్చిన తర్వాత డిన్నర్‌కు వెళ్లినా పద్ధతి ప్రకారం నాకు కేటాయించిన సీట్లో కూర్చుంటా. కానీ మీకు మీటింగులంటే లెక్కలేదు. పార్టీ అధ్యక్షుడంటే లెక్కలేదు. బాధ్యతగా ఉండాల్సిన మీరే ఇంత ఆలస్యంగా వస్తే ఎలా.. మీ పద్ధతేమీ బాగోలేదు. మార్చుకోండ’ని మంత్రులు, పార్టీ సీనియర్లపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... మంగళవారం తన నివాసంలో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముందు ఆలస్యంగా వచ్చిన మంత్రి జవహర్, అమర్‌నాథ్‌రెడ్డి, ఆ తర్వాత ఇంకా బాగా ఆలస్యంగా వచ్చిన మంత్రి అఖిలప్రియపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసి క్లాసు తీసుకున్నారు. తాను ప్రధాని భేటీకి హాజరయ్యే సమయంలో పాటించే పద్ధతిని ఈ సందర్భంగా మంత్రులు, పార్టీ నాయకులకు వివరించారు. ఇటీవలి కాలంలో కట్టుతప్పుతున్న క్రమశిక్షణపైనా ఆయన మండిపడ్డారు. అన్నీ తెలిసిన నేతలు పార్టీ ఆదేశించిన దాన్ని చేయకుండా పెడధోరణిని ప్రోత్సహిస్తున్నారన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని హెచ్చరించారు. ‘కొంతమంది చాలా అతిగా మాట్లాడుతున్నారు. వాళ్లకూ బాధ్యత ఉంది. కొందరు చేసే తప్పుల వల్ల పార్టీ-ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. మీ సొంత అజెండాను పార్టీపై రుద్దుతున్నారు. ఇది కరెక్టు కాదు. మూడేళ్లలో పార్టీ చాలామందికి నామినేటెడ్ పదవులిచ్చింది. అయినా ఏమీ ఇవ్వలేదన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. త్వరలో మిగిలిన వాటిని భర్తీ చేస్తాం. ఆలయ, మార్కెట్ కమిటీల ఖాళీలనూ భర్తీ చేస్తాం. దేశంలో ఏ పార్టీ ప్రభుత్వం ఇవ్వనన్ని పదవులు మనమే ఇచ్చాం. అది గుర్తుంచుకోండ’ని చెప్పారు. జన్మభూమి కమిటీల పనితీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల పార్టీ తనకు సంబంధం లేకపోయినా నష్టపోతోంది. అందువల్ల ఇప్పుడున్న జన్మభూమి కమిటీ వ్యవస్థను మారుస్తున్నాం. ఇకపై పార్టీ గ్రామ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఇద్దరు డ్వాక్రా మహిళలు, ఎంపిటిసి, సర్పంచులు జన్మభూమి కమిటీలో ఉంటారని వెల్లడించారు. స్థానికంగా ఎంపిటిసి, సర్పంచ్ వైసీపీకి చెందిన వారుంటే కమిటీలో మిగిలిన వారు పార్టీకి సంబంధించిన వారయినందున మెజారిటీ మనకే ఉంటుందన్నారు. మహానాడును బ్రహ్మాండంగా నిర్వహించాలని, రాష్ట్ర కమిటీ నియామకాలను తనకు వదిలేయాలన్నారు. పార్టీ కమిటీలలో సామాజిక న్యాయం తప్పనిసరిగా ఉండాలని బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఇకపై ప్రతి నెల జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గంలో బహిరంగసభ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి రెండునెలలకోసారి ఏదో ఒక జిల్లాలో పదివేలమందితో రాష్టస్థ్రాయిలో బహిరంగసభ నిర్వహిస్తే తాను దానికి హాజరవుతానని చెప్పారు. ఇప్పుడు పార్లమెంటు నియోకవర్గానికి ఏడు అసెంబ్లీ స్థానాలుంటే త్వరలో దాని సంఖ్య తొమ్మిదికి పెరుగుతుందని, పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించే బాధ్యత వాటి ఇన్చార్జి మంత్రులదేనన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలు, పార్టీ నేతలతో సమన్వయ బాధ్యతలూ వారివేనని స్పష్టం చేశారు. త్వరలో కొన్ని జడ్పీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నందున అన్ని స్థానాలు గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. మనం ఇప్పటివరకూ పై స్థాయి నేతలపైనే దృష్టి పెడుతున్నాం. ఇకపై సెకండరీ గ్రేడ్ లీడర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గాల స్థాయిలో ఎవరు బాగా పనిచేస్తున్నారో గుర్తించండి అని ఆదేశించారు. మనం చేసే పనలు చెప్పుకోవాల్సిన బాధ్యత మనకుంది. గతంలో కష్టపడి తీసుకువచ్చిన వోక్స్‌వ్యాగన్ వంటివి కాంగ్రెస్ అవినీతి భయం వల్ల వెనక్కివెళ్లాయి. ఇప్పుడు మన కృషి వల్ల కియా, ఇసుజు లాంటి పెద్ద కంపెనీలొస్తున్నాయి. వాటివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
కలెక్టర్లతో సమన్వయం చేసుకోండి
ఎన్నికలు మరో రెండేళ్లే ఉన్నందున మంత్రులు జిల్లాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. నిధులకు కొదువ లేదని, పనులు ఎక్కడ చేస్తే పార్టీకి అనుకూల వాతావరణం ఉందనుకుంటే అక్కడ పనులు చేపట్టాలని ఆదేశించారు. ‘నేను కలెక్టర్లతో మాట్లాడా. మీరు వాళ్లతో సమన్వయం చేసుకోండి. ఆ విషయంలో మొన్నటిలా ఇబ్బందులేమీ ఉండవ’ని స్పష్టం చేశారు.

చిత్రం..చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టిడిపి సమన్వయ కమిటీ సమావేశం