ఆంధ్రప్రదేశ్‌

ఓర్వలేకే వ్యక్తిగత విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 9: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ పనితీరు బాగుండడమే కాకుండా గత మూడేళ్ల కాలంలో ఎక్కడా ఒక్క అవినీతి ఆరోపణ రాకపోవడంతో వైకాపా వ్యక్తిగత విమర్శలు, అసభ్యకర ప్రచారానికి తెర లేపిందని కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమితులైన ఆయన మంగళవారం కర్నూలులో విలేఖరులతో మాట్లాడుతూ నిజాయితీతో కూడిన పాలన అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తూ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు. బాబు పనితీరుపై వైకాపా నిర్వహించిన సర్వేలో ప్రజల నుంచి సంతృప్తికర సమాధానం రావడంతో జగన్ దిక్కుతోచని స్థితిలో పడ్డారన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక తన కిరాయిమూకలతో చంద్రబాబు, లోకేష్‌పై అభ్యంతరకర, అసభ్య పదజాలంతో సాంఘిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారాన్ని ప్రారంభించారని ఆరోపించారు. అమెరికాలో పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని అభాసుపాలు చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే వాస్తవాలు తెలుసుకున్న అమెరికా అధికారులు చంద్రబాబుకు భద్రత పెంచుతూ ఆయన కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహించుకోవడానికి అవసరమైన సహాయం అందించారన్నారు.

గ్రానైట్ క్వారీలో ప్రమాదం
ముగ్గురు దుర్మరణం
అద్దంకి, మే 9: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ఈర్లపాలెం వద్ద గల శ్రీనివాస గ్రానైట్ క్వారీలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. క్వారీలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో గ్రానైట్ రాళ్లను ప్రొక్లయినర్ ద్వారా పక్కకు జరిపే క్రమంలో గ్రానైట్‌రాయి పక్కన ఉన్న వ్యక్తులను గమనించకుండా ప్రొక్లయినర్ డ్రైవర్ రాయిని పక్కకు నెట్టాడు. రాయి పక్కనే ఉన్న క్వారీ ప్రొడక్షన్ మేనేజరు చెన్నైకు చెందిన శ్రీనివాస పళని(48), గ్రానైట్ మార్కర్ రహంతుల్లా(48) అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలుడు రుత్విక్ (7) తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందారు. రహంతుల్లా ప్రకాశం జిల్లా వెలిగొండ్ల మండలం వెదుళ్ళచెరువుకు చెందినవ్యక్తిగా గుర్తించారు.

పోలవరం నిర్వాసిత రైతుల ఖాతాల్లో
రూ.1660 కోట్లు జమ

మంత్రి దేవినేని ఉమ

విజయవాడ, మే 9: పశ్చిమగోదావరి జిల్లాల్లో పోలవరం నిర్వాసిత రైతులకు 1660 కోట్ల రూపాయలకు పైగా నష్ట పరిహారం చెల్లించినట్టు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. నాలుగు మండలాలకు చెందిన 34 గ్రామాల నిర్వాసిత రైతులకు చెందిన 15,548 ఎకరాలకు ఈ మొత్తం చెల్లించినట్టు ఆయన వివరించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018 జూన్ నాటికి పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని అందించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. ఇందులో భాగంగా 15,562 ఎకరాల భూములిచ్చిన 6,842 మంది రైతుల ఖాతాల్లో నేరుగా జమచేశామన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే రైతుల ఖాతాల్లోకి ఈ మొత్తాలను జమ చేసిందన్నారు. దేశ చరిత్రలోనే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం ఇదే మొదటిసారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, రైతులకు నష్టపరిహారం పంపిణీలో సిఎం చంద్రబాబునాయుడు వెనుకంజ వేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్టులో గ్యాలరీ వాక్ నవంబర్‌లో పెట్టాలని సిఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. చంద్రబాబుతో పాటు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి ఈ మెయిల్స్ పంపుతోందని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. దాని మీద విచారణ జరుగుతోందన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం పనులను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని మంత్రి దేవినేని ఆరోపించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో తప్పుడు కేసులు వేశారన్నారు. కేసులు వేయాలంటూ పక్క రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలకు సూచనలిస్తున్నారన్నారు.

ఏఓబిలో పట్టుకు
మిలీషియా సహకారం
గాలికొండ దళంలో
మళ్లీ రిక్రూట్‌మెంట్?
కార్యాచరణలో
కోరుకొండ దళం
ఉనికి చాటుకోనున్న
మావోలు

విశాఖపట్నం, మే 9: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్ట్‌లను పూర్తిగా అణచివేసి, పైచేయి సాధించామని పోలీసులు చెపుతున్నారు. ఇది కొంత వరకూ వాస్తవమే. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన బెజ్జంగి ఎన్‌కౌంటర్‌లో సుమారు 30 మంది మావోయిస్ట్‌లను కోల్పోయి, గాలికొండ దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఏఓబిలో గట్టి పట్టున్న గాలికొండ దళం పూర్తిగా నిర్వీర్యమైపోవడంతో ఇక ఏఓబిలో మావోయిస్ట్ కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పడిందని పోలీసులు భావించారు. ఏజెన్సీలో పోలీసులదే పైచేయి అనుకుంటున్న సమయంలో మళ్లీ కోరుకొండ దళం పుంజుకుని, పలు విధ్వంస కార్యక్రమాలకు పాల్పడుతూ వస్తోంది. రెండు రోజుల కిందట రాళ్లగడ్డ దగ్గర మావోలు పేల్చిన మందుపాతరకు హోంగార్డ్ బలైపోయాడు. వాస్తవానికి పోలీస్ అధికారుల లక్ష్యంగా ఈ బ్లాస్టింగ్ జరిగింది. ఇదిలా ఉండగా అంతరించుకుపోయిందనుకుంటున్న గాలికొండ దళం మళ్లీ శక్తి పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. బెజ్జంగి ఎన్‌కౌంటర్ తరువాత అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయిన మిలిషియా సభ్యులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. వారి సహకారంతో గాలికొండ దళాన్ని మళ్లీ బలోపేతం చేయడానికి మావోయిస్ట్ నాయకులు సన్నాహాలు చేస్తున్నట్టు భోగట్టా. నక్సల్స్‌బరి ఉద్యమం ప్రారంభమై 50 సంవత్సరాలైన సందర్భంగా ఏఓబిలో మావోయిస్ట్‌లు వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రిక్రూట్‌మెంట్‌ను కూడా పెద్దఎత్తున చేపడుతున్నట్టు సమాచారం. చత్తీస్‌గడ్, ఒడిశా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్ట్‌లను పూర్తిగా అంతమొందించేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే కోబ్రా బలగాలు చత్తీస్‌గడ్‌కు చేరుకున్నాయి. దీంతో అక్కడున్న మావోలు ఒడిశా, విశాఖ ఏజెన్సీల్లో తలదాచుకోవచ్చన్న సమాచారం పోలీసుల వద్ద ఉండడంతో ఏఓబిలో కూడా కూంబింగ్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీంతో ఏఓబిలో మళ్లీ అలజడి మొదలైంది.