ఆంధ్రప్రదేశ్‌

ఎద్దుల అమ్మకంపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 9: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల ఆధీనంలోని గోశాలలకు చెందిన ఎద్దులను విక్రయించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్కృతంలో గోవు అంటే ఆవు, ఎద్దు రెండూ అని, ఆవును కామధేనువుగా, ఎద్దును నందీశ్వరునిగా పూజిస్తారని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థలం లేదని, సంఖ్య ఎక్కువగా ఉందని, నిర్వహణకు ఖర్చు ఎక్కువ అవుతోందని, తదితర కారణాలతో ఎద్దులను ఆమ్మివేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఎద్దులను, మగ పెయ్యలను విక్రయించడం అమానుషమని, హిందూ సంప్రదాయాలకు విరుద్ధమని తెలిపింది. వీటిని అమ్మడాన్ని నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆవులకు, ఎద్దులకు, పెయ్యలకు, గర్భంతో ఉన్నవాటికి, రోగం బాధపడుతున్న వాటి కోసం వేర్వేరుగా ప్రత్యేక షెడ్లు నిర్మించాలని ఆదేశించింది. గోపంచకం, జీవామృతం వంటివి తయారు చేసి వాటిని సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించేలా చూడాలని ఆదేశించింది. అన్నప్రసాదాల తయారీ కేంద్రాల్లోని గంజి, బియ్యం కడుగు నీరు, ఆకుకూరల వ్యర్థాలను సేకరించి గోశాలల్లో వినియోగించాలని కూడా ఉత్తర్వులో పేర్కొన్నారు. అవసరం ఉన్న హిందూ రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుని ఎద్దులను ఇవ్వాలని పేర్కొన్నారు. గోశాలల్లో 25 ఎద్దులు, గోవులకు మించి ఉన్న చోట్ల గౌరవ వేతనంపై పశువైద్యుల సేవలు ఉపయోగించుకోవాలని, ప్రధాన ఆలయాల పరిధిలో 5-10 ఎకరాల్లో పశుదాణా పెంచాలని, ఇకపై గోశాల వ్యవహారాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించేందుకు నిర్ణయించినట్టు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జెఎస్‌వి ప్రసాద్ ఉత్తర్వుల్లో తెలిపారు.

కాపు సంక్షేమమే ధ్యేయం

కాపుల్లో చీలిక అసాధ్యం
కాపు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామానుజయ

విజయవాడ, మే 9: కాపుల సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయం.. ఇందుకోసం సిఎం చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేస్తున్నారని అఖిల భారత కాపు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం కులాల్లో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ముఖ్యంగా కాపులను బలిజలు, తూర్పు కాపులు, ఒంటరులను విడదీయటానికి కుట్రలు పన్నుతున్నారని అయితే అది ఎన్నటికీ నెరవేరదన్న వాస్తవాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని అన్నారు. విజయవాడలోని ఒక హోటల్‌లో మంగళవారం అఖిల భారత కాపు సమాఖ్య రాష్టస్థ్రాయి సమావేశం జరిగింది. 13 జిల్లాల నుంచి పెద్దఎత్తున నాయకులు తరలివచ్చారు. సభకు అధ్యక్షత వహించిన రామానుజయ మాట్లాడుతూ కాపుల సంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసం చంద్రబాబు రాష్ట్రంలో తొలిసారిగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఈ సంస్థ ద్వారా కాపుల సమగ్రాభివృద్ధికి పాటుపడుతున్నామని అన్నారు. ఆర్థిక స్వావలంబనతోనే కాపుల సమగ్రాభివృద్ధి సాధ్యమని గుర్తించి అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని అన్నారు. కాపు జాతికి తొలిసారిగా వెయ్యి కోట్లు కేటాయించిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు రాజా మాష్టారు (గుంటూరు), మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది నరహరశెట్టి శ్రీహరి (విజయవాడ), రాయలసీమ అధ్యక్షుడు ఊక విజయకుమార్, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడారు.

డయల్ 100 స్థానంలో 112

డిజిపి నండూరి సాంబశివరావు
విజయవాడ (క్రైం), మే 9: ప్రభుత్వ పాలనలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్తమ పద్ధతిలో వినియోగించడం ద్వారా మెరుగైన అభివృద్ధి ఫలితాలు సాధించవచ్చని డిజిపి నండూరి సాంబశివరావు అన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ‘టెక్నోపోల్ ఏపి-2018’ రూపొందించినట్లు తెలిపారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌తో కలిసి పోలీసు శాఖలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏవిధంగా వినియోగించాలనే అంశంపై మంగళవారం ఇక్కడ జరిగిన టెక్నాలజీ డ్రైవెన్ పోలీసింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (టెక్నోపోల్ ఏపి-2018) కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పోలీసులు ప్రజలకు ఏవిధంగా సాంకేతికంగా చేరువకావాలి, పౌరులు పరిసర ప్రాంతాలను గమనించడం, అనుమానాస్పదమైన వ్యక్తుల సంచారం, వస్తువుల సమాచారం అందించడం, కళాశాలు, విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్‌ను అరికట్టడం కోసం శాస్త్ర సాంకేతికతను ఏవిధంగా ఉపయోగించాలి, స్వచ్ఛంద పోలీసు సేవలు, డిఎన్‌ఏ, వేలిముద్రలు, చేతిముద్రలు, కనుపాప ముద్రలు, ఫోరెన్సిక్, సిసి కెమేరాల వినియోగం, ఈ చలానా విధానం, డయల్ 100, డయల్ 112, కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్, తదితర అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా డిజిపి మాట్లాడుతూ క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్కింగ్ సిస్టం ప్రాముఖ్యతను వివరించారు. నేరాల అదుపులో పోలీసు శాఖ ప్రజలకు ఉత్తమ సేవలు అందించవచ్చనే అంశంపై సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాలకు కారణాలను డిసిపి క్రాంతిరాణా టాటా వివరిస్తూ నివారణకు కొన్ని ప్రతిపాదనలు చేశారు. సాయంత్రం 4 గంటలకు జిల్లా ఎస్పీలకు, కమిషనర్‌లకు గోల్‌సెట్టింగ్ అనే అంశంపై జిల్లాల వారీగా శాస్త్ర సాంకేతిక వినియోగంలో దిశానిర్దేశం చేశారు. సదస్సులో హోం సెక్రటరీ కెఆర్ అనూరాధ, సిఐడి అదనపు డిజి ద్వారకాతిరుమలరావు, ఆపరేషన్స్ అదనపు డిజి ఎన్‌వి సురేంద్రబాబు, లా అండ్ ఆర్డర్ అదనపు డిజి హరీష్‌గుప్తా, సిఐడి ఐజి సునీల్‌కుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీలు పాల్గొన్నారు. పోలీసు టెక్నికల్ ఐజి దామోదర్, ఆరో బెటాలియన్ కమాండెంట్ గోపీనాథ్ జెట్టి సదస్సు నిర్వాహకులుగా వ్యవహరించారు.
ఇక డయల్ నెం. 112
మనకు అలవాటైన డయల్ 100 స్థానంలో ఇక 112 నెంబర్ రానుంది. ఇక నుంచి 112కు చేయాల్సి ఉంటుందని డిజిపి తెలిపారు. రాష్ట్ర విభజనలో డయల్ 100 కోల్పోయామని, డయల్ 100, 108ను కూడా హైదరాబాద్‌లోనే వదిలేయాల్సి వచ్చిందన్నారు. అందుకే ఇప్పుడు డయల్ 112ను తీసుకొచ్చామని వివరించారు. ప్రస్తుతం పనిచేస్తున్న డయల్ 100కు ఫోన్ చేస్తే ఆ కాల్ హైదరాబాద్ కాల్ సెంటర్‌లో రిసీవ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు సమాచారం అందిస్తున్నారన్నారు. ఇప్పుడు ఈ విధానం తమ రాష్ట్రంలోనే ఏర్పాటు చేసుకుంటామని కేంద్రాన్ని కోరగా ఎన్‌ఇఆర్‌ఎస్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిదని, ఇందుకు రూ. 9.5 కోట్లు రాష్ట్రానికి కేటాయించిదని, ఈ కేంద్రాన్ని విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో ఏర్పాటు చేస్తామని డిజిపి చెప్పారు. ఇటీవల విశాఖ మన్యంలో మావోల బాంబుదాడిలో చనిపోయిన షేక్ వలీ అనే హోంగార్డు సేవలను గుర్తిస్తూ డిజిపి అతని కుటుంబ సభ్యులకు పోలీసు సంక్షేమ నిధి నుంచి రూ. 15లక్షల చెక్కును అందించారు.

విశాఖలో పట్రాకార్ప్‌కు స్థలం

ద్వైపాక్షిక సమావేశాలతో సిఎం బిజీ

విజయవాడ, మే 9: అమెరికాలోని కాలిఫోర్నియా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలువురు ప్రారిశ్రామికవేత్తలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఐదోరోజు పర్యటనలో యుఎస్‌ఐబిసి సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి వరుస ద్వైపాక్షిక సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. పట్రాకార్ప్ సిఈవో జాన్ ఎస్ సింప్సన్‌తో తొలిగా భేటీ అయ్యారు. విశాఖలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ అమెరికన్ బీపీవో పరిమిత స్థలం కారణంగా విస్తరించలేకపోయామని, విశాఖ బిపివోలో 1500 మంది ఉద్యోగులు ఉండగా, స్థలం సమస్య కారణంగా నయా రాయపూర్‌కు 500 మంది ఉద్యోగులను తరలించినట్టు చెప్పారు. విశాఖలో తగిన కార్యాలయ సముదాయం ఉంటే మరో 500 ఉద్యోగాలు కల్పిస్తామని సింప్సన్ చెప్పగా దీనికి వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి టెక్ మహీంద్ర బిల్డింగ్స్ కేటాయించాలని ఏపిఐఐసికి నిర్దేశించారు.
నైపుణ్యం పెంచేందుకు బెల్‌కర్వ్ లాబ్స్
వీసా కార్డ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెమెట్రియస్ మరంటీస్‌తోనూ ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ బెల్ కర్వ్ లాబ్స్ ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. సంస్థ కార్యకలాపాలపై ప్రెజెంటేషన్ ఇచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు ప్రపంచ వ్యాప్తంగా 40శాతం నైపుణ్యం కొరవడినట్టుగా గుర్తించినట్టు చెప్పారు. భారత్‌లో ఈ సమస్య అధికంగా ఉందని, అమెరికాలో ఇప్పటికే ‘వర్క్ రెడీ కమ్యూనిటీస్’ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు, ఏపీలో ఈ అంశంపై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ సిఎండి డాక్టర్ రవీంద్ర వర్మతోనూ ముఖ్యమంత్రి భేటీ కాగా వారధులు, రహదారులు, ఓడరేవుల నిర్మాణం తమ ప్రత్యేకతగా వర్మ వివరించారు. ముఖ్యమంత్రితో ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా సమావేశమయ్యారు. సిలికాన్ వ్యాలీని ప్రభావితం చేసిన ప్రధానమైన వ్యక్తుల్లో వినోద్ ఖోస్లా కూడా ఒకరు. ఏపీలో స్టార్టప్స్ ప్రోత్సాహానికి అవసరమైన వ్యవస్థను రూపొందించడంలో సహకారం అందించాలని వినోద్ ఖోస్లాను ముఖ్యమంత్రి కోరారు.
క్లౌడ్ హబ్‌కు న్యుటనిక్స్ సాయం
సదస్సుకు ముందు ముఖ్యమంత్రితో న్యుటనిక్స్ సిఈఓ ధీరజ్ పాండే సమావేశమయ్యారు. ఈ సంస్థలో 50 శాతం పైగా ఇంజనీర్లు తెలుగువారే కావడం విశేషం. అయితే ఏపీని క్లౌడ్ హబ్‌గా రూపొందించడంలో ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ధీరజ్ పాండే ఆసక్తి కనబరిచారు. బృందంలో ఆర్థికమంత్రి యనమల, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఆర్థిక అభివృద్ధి మండలి కార్యనిర్వాహక అధికారి కృష్ణకిశోర్, సిఆర్‌డిఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఐటి ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మన్ ఆరోఖ్యరాజ్ ఉన్నారు.