ఆంధ్రప్రదేశ్‌

జూన్ 2 నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 18: రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు జూన్ 2 నుంచి 8వరకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ సకాలంలో, సక్రమంగా అందాలని సూచించారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ ఖరీఫ్ సీజన్ నుంచి కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు నేరుగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. వ్యవసాయశాఖ జారీచేసిన సాగు ధ్రువీకరణ పత్రం ద్వారా కౌలు రైతులకు ఎటువంటి తనఖా లేకుండా పంట రుణాలు అందేలా చూడటం, సకాలంలో రుణాలు చెల్లిస్తే వడ్డీ రాయితీ కల్పించడం, పంట నష్టపరిహారం, పంట బీమా సదుపాయం, లక్ష రూపాయల లోపు పంట రుణానికి వడ్డీ మినహాయింపు ఇవ్వడం, లక్ష నుంచి 3లక్షల వరకు పావలా వడ్డీకే పంట రుణాలు, అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం వర్తింప చేయడం వంటి పలు ప్రయోజనాలు కలుగనున్నాయి. వీటిపై కౌలు రైతుల్లో అవగాహన కల్పించే ప్రచార చిత్రాన్ని సిఎం ఈ సందర్భంగా విడుదల చేశారు.
ఎంపిఈవోల నియామకాలకు ఆమోదం
ఉత్తర కోస్తా జిల్లాల్లో అదనంగా 221మంది ఎంపిఈవోలను నియమించుకునేందుకు సంబంధించిన ప్రతిపాదనలకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ జిల్లాల్లో ఉత్పాదకత మరీ తక్కువగా ఉండటంతో పెద్దఎత్తున పోస్టుల భర్తీపై దృష్టి పెట్టారు.
200 కస్టమ్ హైరింగ్ సెంటర్లు
వ్యవసాయ యాంత్రీకరణకు ఉద్దేశించిన 200 కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటు వేగంగా సాగుతున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇందులో 94సిహెచ్‌సిలు ఇప్పటికే ఖరారయ్యాయని, వీటన్నింటిని పిపిపి పద్ధతిలోనే చేపడుతున్నామని చెప్పారు. వ్యవసాయ యంత్ర పరికరాలు నిరుపయోగంగా పడి ఉండకుండా వాటిని జియో ట్యాగింగ్ చేసి, చుట్టుపక్కల ప్రాంతాల్లో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
‘అగ్రి స్మార్ట్’తో రైతన్నకు సేవలు
రైతుల వ్యవసాయ అవసరాల కోసం సేవలు అందించేందుకు ‘అగ్రి స్మార్టు’ సర్వీస్ సెంటర్లను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అగ్రిస్మార్ట్‌లో రైతులు, సాగుభూమి వివరాలతో పాటు, ఏ పంటను సాగు చేస్తున్నారు, నేల స్వభావం, నీటి వనరుల లభ్యత, ఎరువులు-విత్తనాల అవసరాలు, పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి సకల సమాచారం ఇందులో సంక్షిప్తమై ఉంటుంది. కావలసిన వాటిని ఈ సర్వీస్ ద్వారా డోర్ డెలివరీ చేస్తారు.
రెయిన్ గన్లకు యూనిక్ ఐడీ నెంబర్లు
రాష్ట్రంలోని 30వేల రెయిన్ గన్లకు జియో ట్యాగింగ్, యునిక్ ఐడీ నెంబర్ల కేటాయింపు పూర్తిచేశామని అధికారులు తెలిపారు. విత్తనాల పంపిణీకి సంబంధించి 11.22 లక్షల క్వింటాళ్ల లక్ష్యానికి గాను 9.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సేకరించినట్టు చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు గాను 16.85 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, 9.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధం చేశామని అన్నారు.
ఈ నెలాఖరు నాటికి 11లక్షల భూ ఆరోగ్య కార్డులు(సాయిల్ హెల్త్ కార్డులు) పంపిణీ పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. దీంతో ఇప్పటివరకు ఇచ్చిన వాటితో కలుపుకుని మొదటి ఫేజ్ కింద 26 లక్షల కార్డుల పంపిణీ అయినట్లవుతుంది. రెండో ఫేజ్ కింద 2017-18 సంవత్సరానికి మరో 28లక్షల భూ ఆరోగ్య కార్డులు అందించాలని సమీక్షలో నిర్ణయించారు.
ఉద్యానవనరంగంలో 30శాతం వృద్ధి లక్ష్యం
ఉద్యానవనాల సాగు విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు, ఉత్పత్తిలో 30 శాతం వృద్ధి సాధించాలని ఆ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నిర్దేశించారు. పండ్ల తోటల పెంపకంలో సూక్ష్మ సేద్యాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. తలసరి ఆదాయం తక్కువున్న ఐదు జిల్లాల్లో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో ఈ ఏడాది ఖరీఫ్‌కు గాను జివిఏలో 23.9శాతం వృద్ధి నమోదు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో డిమాండ్‌కు అనుగుణంగా ఏ రకం పంటలు సాగు చేయాలో ముందే రైతులకు మార్గదర్శనం చేయాలని సిఎం చెప్పారు. మిర్చి దిగుబడి అధికం కావడంతో ధర పతనం కావడాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పంటల సాగులో సమతూకం అవసరమన్నారు.

చిత్రం... వ్యవసాయశాఖపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు