ఆంధ్రప్రదేశ్‌

ఇమేజికి డ్యామేజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 20: కాంగ్రెస్ హయాంలో శాంతిభద్రతలు లేవని ఆరోపణలు గుప్పించిన తమ పార్టీ హయాంలో కూడా అదే జరుగుతుండటంపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో హోంశాఖ విఫలమయిందన్న భావన జనంలో మొదలయిందని, ఇది బలంగా నాటుకుపోతే మళ్లీ అధికారంలోకి రావడం కష్టమన్న ఆందోళన పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.
అదుపుతప్పుతున్న శాంతిభద్రతలు పార్టీ ఇమేజ్, ముఖ్యమంత్రి-పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయన్న నేతలు అభిప్రాయపడుతున్నారు. సొంత పార్టీ నేతలే బరితెగింపు చర్యలకు దిగుతున్న వైనాన్ని నియంత్రించలేకపోతున్నామని, ఇది పార్టీపై పెను ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేలను నియంత్రించడంలో పోలీసు విభాగం వైఫల్యం చెందిందని, ఈ విషయంలో డిజిపి సమర్థవంతంగా వ్యవహరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
‘కొత్త డిజిపి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగాయి. అవన్నీ పార్టీకి చెడ్డపేరు తెచ్చినవే. అయినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. బాబుగారు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో ఒక్క ఘటన కూడా జరగలేదు. పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చారు. ఇప్పుడు కూడా పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చినా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మా పార్టీ ఎమ్మెల్యేనే కావచ్చు. ఒక ఎస్‌ఐపై దాదాగిరి చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? మా ఎమ్మెల్యేపై అప్పుడే కేసు పెడితే ఇంత అప్రతిష్ఠ వచ్చేది కాదు కదా? మొన్న చీరాలలో ప్రజల ముందే జరిగిన గుండాయిజం వల్ల వచ్చే చెడ్డపేరు పార్టీకి, బాబుగారికే కదా?’ అని ఓ సీనియర్ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
తాజాగా తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఎస్‌ఐ, రైటర్లను నిర్బంధించిన వ్యవహారంలో పోలీసు అధికారుల సంఘం తిరగబడటంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘వాళ్లకు, వాళ్ల పిల్లలకు మేం రక్షణ కల్పించాలి గానీ మాకు రక్షణ లేకుండా పోతోంది. మాకే రక్షణ లేకపోతే ఇక ప్రజలకు ఎలా రక్షణ ఎలా కల్పించగలం? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసి పోలీసులలో మనోస్థైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవలి కాలంలో ఇలాంటి దాడులు పెరుగుతున్నాయ’ని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు గంగాధర్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, డిజిపి స్థాయి అధికారుల పనితీరు ఏవిధంగా ఉందో స్పష్టమవుతోంది.
ఇటీవల విజయవాడలో సీనియర్ ఐపిఎస్ బాలసుబ్రహ్మణ్యం, ఆయన గన్‌మెన్‌పై పార్టీ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్‌మీరా చేసిన దాడి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చిందని గుర్తు చేస్తున్నారు. అప్పుడే వారిపై కేసులు నమోదు చేసి ఉంటే పార్టీ ప్రతిష్ఠ పెరిగి ఉండేదంటున్నారు.
ఇప్పుడు పార్టీ ప్రజాప్రతినిధులే బరితెగించి వ్యవహరిస్తున్న వైనం విద్యాధికులు, మహిళలు, యువకుల్లో పార్టీపై వ్యతిరేక భావన పెరిగేందుకు కారణమవుతోందని పార్టీ సీనియర్లు విశే్లషిస్తున్నారు. కాల్‌మనీ నుంచి తాజాగా విజయవాడ డాక్టర్ల దందా కేసుల వరకూ ముందు కఠినంగా వ్యవహరించడం, తర్వాత పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి చేసి వాటిని బలహీనపరచడంతో జనంలో పార్టీపై ఉన్న గౌరవం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే గొట్టిపాటి-ఎమ్మెల్సీ కరణం వర్గీయుల మధ్య జరిగిన దాడిలో, కరణం వర్గానికి చెందిన ఇద్దరు మృతి చెందిన వైనం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణను బజారుపాలుచేసిందన్న ఆవేదన పార్టీవాదుల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కరణం బలరాం వేసిన ప్రశ్నలకు తమ నాయకత్వం వద్ద జవాబు లేదని, ఫిరాయింపులను ప్రోత్సహించే సందర్భంలో స్థానిక పరిస్థితులు చూసుకోకుండా, రాజకీయ స్వార్థమే చూసుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
విశాఖలో జరిగిన హవాలా కేసులో పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు, ఉత్తరాంధ్రలోని కాపు సామాజికవర్గానికి చెందిన పలువురు నేతల దన్ను నిందితుడికి ఉందన్న ప్రచారం కూడా పార్టీ పరువు తీశాయంటున్నారు. తాజాగా హైదరాబాద్ ఎక్సైజ్ కమిషనర్‌కు ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి ఫోను చేసి, లిక్కర్ నిందితులను విడిచిపెట్టమని కోరిన వైనం మీడియాలో రావడం పార్టీని అప్రతిష్ఠపాలుచేసిందంటున్నారు. మహానాడుకు ముందు జరుగుతున్న ఈ ఘటనలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని, బాబు కఠినంగా వ్యవహరించకపోతే మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని స్పష్టం చేస్తున్నారు.