కృష్ణ

ధరలేక మామిడి రైతు కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, మే 29: ధరలేక మామిడి రైతులు కుదేలయ్యారు. ప్రకృతి కనె్నర్ర, పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మామిడి రైతు ఈయేడాది నిలువునా మునిగిపోయాడు. ఎన్నో ఆశలతో సాగు చేసిన మామిడి పంట ఈయేడాది రైతును నట్టేట ముంచింది. ప్రకృతి కనె్నర్ర కారణంగా అసలే ఈయేడాది మంగు తెగులు సోకి కాయ నిల్వ సామర్థ్యం కోల్పోగా దానికి తోడుగా మార్కెట్‌లో ధర లేకపోవటంతో రైతుకు తీరని నష్టం వాటిల్లింది. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి కంటికి రెప్పలా కాచుకున్నప్పటికీ ఫలితంగా చివరికి నష్టం మిగిలిందని రైతు లబోదిబోమంటున్నాడు. పూత దశ నుండి కాయ చేతికొచ్చే వరకూ వేలాది రూపాయల వ్యయంతో పురుగుమందులు పిచికారి చేసి, మందులు వేసి, నీటి తడులు పెట్టినప్పటికీ వాతావరణంలో మార్పుల కారణంగా మంగు తెగులు సోకి కాయ నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఐనప్పటికీ రైతులు కాయ కోసి మార్కెట్‌కు తెస్తే మార్కెట్‌లో ఢిల్లీ సేఠ్‌లు ధరలు నిర్ణయించి రైతులను నిలువు దోపిడీ చేస్తుండటంతో రైతులు కనీసం కిరాయి ఖర్చులు కూడా రావడలేదని తోట నుండి కోసుకొచ్చిన కాయలను విజయవాడ మార్కెట్ వరకూ తీసుకెళ్లకుండానే రోడ్ల వెంట పారబోస్తున్నారు. చివరకు అవి పశువులకు మేతగా మారాయి. మైలవరం-చండ్రగూడెం మధ్య జాతీయ రహదారి పక్కన దారిపొడవునా మామిడి కాయలు గుట్టల గుట్టలుగా పారబోసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన మామిడి కాయలను చివరికి రోడ్లపాలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పండించిన మామిడి పంటకు ప్రభుత్వం తగిన గిట్టుబాటు ధర కల్పించపోవటం వల్లే ఈపరిస్థితి దాపురించిందని రైతులు పేర్కొంటున్నారు. విజయవాడ మామిడి మార్కెట్‌లోని వ్యాపారుల ఆగడాలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని, మామిడికి గిట్టు బాటు ధరను నిర్ణయించి రైతులనుండి కొనుగోలు చేయించలేకపోతోందని రైతులు చెబుతున్నారు. ప్రకృతి కనె్నర్ర చేసినా కనీసం పాలకులు కూడా దయచూపక పోవడంతో తమకు ఈ దుస్థితి దాపురించిందని వారు వాపోతున్నారు. ఈకారణంగా నమ్ముకున్న మామిడి తమను నట్టేట ముంచిందని ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ కృష్ణాలో దాదాపు లక్ష ఎకరాలలో మామిడి పంటను రైతులు సాగు చేశారు. మామిడి సాగులో వస్తున్న ఒడిదుడుకులను తట్టుకోలేక అనేక ప్రాంతాలలో తోటలను నిలువునా నరికివేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈయేడాది మామిడి నష్టాల బాట పట్టటంతో ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజులలో మామిడి మరింత ప్రియం కాగలదని ప్రజలు పేర్కొంటున్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.

ముడ అధికారుల బెదిరింపులకు నిరసనగా
పల్లితుమ్మలపాలెం గ్రామస్థుల ధర్నా
మచిలీపట్నం(కోనేరుసెంటర్), మే 29: ముడ అధికారుల బెదిరింపులకు నిరసనగా మండల పరిధిలోని పల్లితుమ్మలపాలెం గ్రామస్థులు సోమవారం గ్రామంలో ధర్నా చేశారు. ఆఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపనకు భూముల సమీకరణలో భాగంగా మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడ) అధికారులు గ్రామాల్లోకి వచ్చి రైతులను బెదిరింపులకు గురిచేస్తుండటం పట్ల ఆఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం గ్రామంలోకి వచ్చిన ముడ అధికారులు పోర్టుకు భూములు ఇవ్వకుంటే రేషన్ కట్ చేస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలేవీ వర్తింప చేయమని బెదిరించారని సిఐటియు నాయకుడు చౌటపల్లి రవి అన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలే తప్ప బెదిరింపులతో కాదన్నారు. బలవంతపు భూసమీకరణను సమిష్టిగా అడ్డుకుంటామని వైఎస్‌ఆర్ సిపి నాయకులు లంకే వెంకటేశ్వరరావు, మోకా భాస్కరరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

విగ్రహాల ఏర్పాటుపై కౌన్సిల్‌లో వాదోపవాదాలు
జగ్గయ్యపేట, మే 29: పట్టణంలోని సామినేని విశ్వనాథం మున్సిపల్ కాంప్లెక్స్ ముందు విగ్రహాల ఏర్పాటు అంశంపై చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, ఫ్లోర్ లీడర్ యలమంచిలి రాఘవ, కౌన్సిలర్ ఇంటూరి చిన్నా మధ్య రసవత్తర చర్చ జరిగింది. సోమవారం చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశంలో కౌన్సిలర్ ఇంటూరి చిన్న అజండా అనంతరం చర్చలో సామినేని విశ్వనాథం విగ్రహం ఏర్పాటు, అదే ప్రదేశంలో మరికొన్ని విగ్రహాల ఏర్పాటుకు వచ్చిన అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు పట్టణానికి ఎంతో సేవ చేసిన సామినేని విశ్వనాథం విగ్రహం ఏర్పాటుకు మెజార్టీ కౌన్సిల్ అంగీకారం తెలుపుతోందని... కాని దీన్ని రాజకీయం చేయాలని ముక్త్యారాజ విగ్రహం ఏర్పాటు చేయాలని, అబ్దుల్ కలాం, అంబేద్కర్ తదితర విగ్రహాలు ఏర్పాటు చేయాలంటూ అర్జీలను ఇవ్వటం వెనక రాజకీయ దురుద్దేశ్యం ఉందన్నారు. నాగార్జునసాగర్ నిర్మాణంలో విశేష కృషి చేసిన రాజాగారి విగ్రహం ఏర్పాటు ఎలాంటి అభ్యంతరం లేదని అనువైన ప్రదేశంలో దాన్ని ఏర్పాటు చేద్దామని మహానీయుల విగ్రహాల ఏర్పాటు అంశాన్ని రాజకీయం చేయవద్దంటూ సూచించారు. ఈ విషయంపై ఫ్లోర్ లీడర్ యలమంచిలి రాఘవరావు మాట్లాడుతూ రాజాగారి విగ్రహం ఏర్పాటు చేయాలని తాము ప్రతిపాదించామని ఇతర సంఘాలు అర్జీలు ఇచ్చే అంశంలో పార్టీకి సంబంధం లేదని అన్నారు. ఈ విషయంపై కౌన్సిలర్ ఇంటూరి చిన్నా, రాఘవ మధ్య చలోక్తులతో కూడిన సంభాషణ సాగింది. సమావేశంలో 22 అంశాలకు సంబంధించి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో కమిషనర్ అప్పారావు, కౌన్సిలర్ సభ్యులు ఎంవి చలం తదితరులు పాల్గొన్నారు.