రాష్ట్రీయం

అభివృద్ధికి కలిసిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 30: రాజకీయ స్పృహతోనే వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పలువురు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తాను చేస్తున్న కృషికి మీ అందరి మద్దతు అవసరమన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే సత్తాఉందన్న నమ్మకంతోనే విపక్ష పార్టీలకు చెందిన నాయకులు తమవెంట వస్తున్నారన్నారు. భవిష్యత్‌లో అన్ని రాజకీయపార్టీల ఖాళీ కావడం ఖాయమని బాబు జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ లేనిపోని అభాండాలు వేస్తున్నారని విమర్శించారు. అధికారం చేపట్టిన రెండేళ్లలో సాధించిన అభివృద్ధిని చూసి పలువురు పార్టీవైపు ఆకర్షితులవుతున్నారన్నారు. కుటిల రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తే అభివృద్ధి నిరోధకులుగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. ఒక పక్క రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ఢిల్లీ వెళ్లి రాజకీయాలు చేస్తున్న విపక్ష నేత తీరును ప్రజలు ఏవగించుకుంటున్నారన్నారు. భీమునిపట్నం నియోజకవర్గం నుంచి గెలుపొందిన పలువురు ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, అడవివరం సహకార బ్యాంకు అధ్యక్షుడు తదితరులు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన పట్టణాల్లో సిసి కెమేరాలు
రాష్ట్రంలోని అన్ని ప్రధాననగరాలు, పట్టణాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖ పర్యటనలో భాగంగా నగర పోలీసు కమిషనరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణతో పాటు నేరపరిశోధనలో సిసి కెమెరాలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఈ విధానం ఏర్పాటు చేయడం ద్వారా మంచిఫలితాలు సాధించవచ్చన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి నూతనంగా నిర్మించిన కమిషనర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం విశాఖ నగర పోలీసు విభాగానికి సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఆయన వెంట హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా మంత్రులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, డిజిపి జెవి రాముడు తదితరులు ఉన్నారు.

నీరు-ప్రగతి కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో పాలన భేష్: రోశయ్య
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 30: రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలన పోటాపోటీగా జరుగుతోందని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీపడి అభివృద్ధి సాధిస్తున్నారని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రశంసించారు. అభివృద్ధి విషయంలో అందరూ అభినందించే విధంగా ఈ రాష్ట్రాల్లో పాలన సాగుతోందన్నారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎపిఐఐసి మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం స్వగృహానికి విచ్చేసిన ఆయన కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రోశయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శివరామసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రోశయ్యకు ఘన స్వాగతం లభించింది. శివరామసుబ్రహ్మణ్యం అపార్టుమెంటు సముదాయంలో ఏర్పాటుచేసిన ఇంకుడుగుంత కార్యక్రమంలో రోశయ్య పాల్గొన్నారు. నగర మేయర్ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు రోశయ్యకు స్వాగతం పలికారు.

ఏఓబిలో భారీ కూంబింగ్
సీలేరు, ఏప్రిల్ 30: ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ చేపట్టారు. వారం రోజుల నుంచి ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో బిఎస్‌ఎఫ్, గ్రేహౌండ్స్ తదితర పోలీసు బలగాలు వందల సంఖ్యలో మోహరించి మావోల ఆచూకీ కోసం అడవిని జల్లెడ పడుతున్నాయి. ఇటీవల కాలంలో మావోయిస్టులు పోలీసు ఇన్‌ఫార్మర్ల పేరిట గిరిజనులను హతమారుస్తున్న నేపధ్యంలో గాలింపుచర్యలు ముమ్మరం చేశాయి. మావోయిస్టులు కొద్దిరోజుల పాటు స్తబ్దతగా ఉండి ఆనక పోలీసుల కళ్లుగప్పి విధ్వంసాలకు పాల్పడడం తెలిసిందే. అటువంటి పరిణామాలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తుగానే ఎఓబిలో క్షుణ్ణంగా సోదా చేస్తున్నారు.

కార్మిక శ్రేయస్సుకు
పథకాలు అమలు: సిఎం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 30: కార్మికులు శ్రమ దోపిడీ నుంచి విముక్తి పొంది, హక్కులు సాధించుకున్న రోజు మేడే’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మేడే వేడుక మాత్రమే కాదని, కార్మిక చైతన్యాన్ని గుర్తు చేసుకునే సందర్భమని అభివర్ణించారు. నవ్యాంధ్ర నిర్మాణంలో కార్మికులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శ్రమజీవుల కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో 8 లక్షల మంది డ్రైవర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని తమ ప్రభుత్వం అనలు చేస్తోందని, అంతే కాకుండా ఆ కుటుంబంలో చదువుకునే ఇద్దరు పిల్లలకు రూ. 1200 వంతున ఉపకార వేతనం మంజూరు చేస్తోందని అన్నారు.

డిటిసికి 14రోజుల రిమాండ్
కొనసాగుతున్న ఎసిబి సోదాలు..కుప్పలు తెప్పలుగా అక్రమ ఆస్తులు

ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఏప్రిల్ 30: కాకినాడ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదిమూలం మోహన్ అవినీతి మూలాలను అవినీతి నిరోధక శాఖాధికారులు వెలికితీస్తున్నారు. ఆదాయానికి మించి కనీ వినీ ఎరుగని రీతిలో వెలుగుచూసిన అక్రమాస్తులపై మూడవ రోజైన శనివారం కూడా ఆయా ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ సోదాలు ఇంకా కొనసాగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్న మోహన్‌ను ఈనెల 28న అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విజయవాడ ఎసిబి కోర్టులో నిందితుడిని హాజరుపరచగా 14రోజుల పాటు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో కృష్ణా జిల్లా చల్లపల్లి జైలుకు తరలించినట్టు ఎసిబి అధికారులు చెప్పారు. మోహన్ అరెస్ట్ తర్వాత మూడవ రోజు కూడా ఎసిబి సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ యూనిట్ అధికారుల సోదాలు కొనసాగాయ. కాకినాడ సహా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, బళ్ళారి ప్రాంతాల్లో డిటిసి అక్రమాస్తులపై సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో తవ్వేకొద్దీ అక్రమార్జన వెలుగుచూస్తోంది. పలు కీలక డాక్యుమెంట్లు, బంధుమిత్రుల పేరున విలువైన ఆస్తులు వెలుగుచూస్తున్నాయి. లభ్యమైన ఆస్తుల విలువ సుమారు వెయ్యి కోట్ల వరకు ఉండవచ్చని తెలియడంతో రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఈ అవినీతి వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఓవైపు అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతుండగా, ఇంకోవైపు ఇటువంటి అవినీతి తిమింగలాల చరిత్ర బయట పడేసరికి సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. డిటిసి అక్రమాస్తుల వ్యవహారం రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్తి రేకెత్తిస్తోంది. సాధారణంగా ఓ ప్రభుత్వాధికారిపై అవినీతి నిరోధక శాఖ దాడి చేసినపుడు ఒకటి రెండు రోజుల్లో సోదాలకు ఫుల్‌స్టాప్ పడుతుంది. డిటిసి మోహన్ విషయంలో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు వెలుగుచూస్తుండటంతో వాటి మూలాలను వెలికితీసే పనిలో అధికారులున్నారు. ఏకకాలంలో 9 చోట్ల ఎసిబి దాడులు చేసింది. ఆయా ప్రాంతాల్లో దొరికిన ఆస్తుల వివరాలను ఇంకా ఒక చోటకు చేర్చి, అధికారికంగా అక్రమాస్తుల వివరాలను బహిరంగ పరచకపోయినా, ఎసిబి అధికారులు న్యాయస్థానానికి ఓ నివేదిక ద్వారా వివరించాల్సి ఉంది.