ఆంధ్రప్రదేశ్‌

నెలరోజుల్లో ఆసుపత్రుల బకాయిల చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 16: ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ బిల్లులకు సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను నెలరోజుల్లోగా చెల్లిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. భవిష్యత్తులో ఎన్‌టిఆర్ వైద్య ట్రస్టు ద్వారా మరిన్ని సేవలందించనున్నట్టు తెలిపారు. నిరుపేదల ఆరోగ్య ప్రమాణాలు పెంచటమే ఎన్‌టిఆర్ వైద్యట్రస్టు లక్ష్యమన్నారు. గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ ట్రస్టు ప్రధాన కార్యాలయాన్ని, ఔషధాలు, కాపీరైట్స్ ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్, ఏపి ఫార్మశీ కౌన్సిల్ కార్యాలయాలను మంత్రి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ట్రస్టు వైద్యసేవలకు సంబంధించిన ఆన్‌లైన్ సేవల తొలి ఎడిషన్ మాన్యువల్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ ఏడాది ఎన్టీఆర్ వైద్య ట్రస్టుకు ప్రభుత్వం రూ. 1000 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. నూతన కార్యాలయాల్లో ఆయా విభాగాల ద్వారా అందించే సేవలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యసేవలందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులలో వినూత్న కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, 104 సేవలు అందుతున్నాయని వివరించారు. ట్రస్టుద్వారా ప్రారంభించిన ఆన్‌లైన్ సేవలలో విరాళాల సేకరణకు ఉద్దేశించిన అంశం అభినందనీయమన్నారు. దాతలకు విరాళాలందించాలనే స్ఫూర్తి ఉన్నప్పటికీ విశ్వసనీయత కారణంగా వెనుకాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ వైద్య ట్రస్టుకు విరాళమిస్తే ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా తనవంతుగా ట్రస్టుకు లక్ష రూపాయల విరాళాన్ని మంత్రి ప్రకటించారు. పేదలను ఆదుకునేందుకు మరింతమంది ముందుకు రావాలని కోరారు. కడు నిరుపేదలైన రోగులకు కూడా ఈ ఆన్‌లైన్ ద్వారా నేరుగా విరాళాలందించే వీలు కల్పించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ బిల్లుల రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని, నెలరోజుల్లోగా బకాయిలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీచేశామన్నారు. ఏపి ఎస్‌ఎం ఐడిసి చైర్మన్ డాక్టర్ ఆర్ లక్ష్మీపతి, ఎన్‌టిఆర్ వైద్యట్రస్టు ముఖ్య కార్యనిర్వహణ అధికారి రవిశంకర్ అయ్యన్నార్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. గుంటూరులో ఏపి ఫార్మసీ కౌన్సిల్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి కామినేని