ఆంధ్రప్రదేశ్‌

జాతీయ, రాష్ట్ర రహదార్లపై మద్యం దుకాణాలు బంద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి 500 మీటర్ల పరిధిలోని మద్యం దుకాణాల తొలగింపునకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రధాన రహదారుల వెంబడి సర్వీస్ రోడ్లను కూడా పరిగణనలోకి తీసుకుని అక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో వైన్‌షాపులు గాని, బార్ అండ్ రెస్టారెంట్లు గాని ఉండకూడదంటూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొన్ని నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మంజూరైన లైసెన్సుల గడువు తీరనందున ఎలాంటి పరిస్థితుల్లోనూ జూలై ఒకటో తేదీ నుంచి కచ్చితంగా అమలు చేస్తామంటూ సుప్రీంకోర్టుకు విన్నవించుకుంది. రెండేళ్ల కాలపరిమితితో రాష్ట్రంలోని 4380 వైన్ షాపులకు కొత్త లైసెన్స్‌ల జారీ ప్రక్రియ దాదాపుగా పూర్తికావచ్చింది. దీనికి 500 మీటర్లు, ఆపై దూరంలోనే కేటాయించేలా నోటిఫికేషన్ జారీకావటం, వేల సంఖ్యలో దరఖాస్తులు రావటం, డ్రా విధానంలో కేటాయింపులు జరపటం కూడా పూర్తయింది. అయితే అతి చిన్న గదిలో ఏర్పాటయ్యే వైన్ షాపును 500 మీటర్ల పరిధి దాటి ఎక్కడైనా, అవసరమైతే రేకుల షెడ్‌లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అనేక నియమ నిబంధనలతో కూడిన బార్ అండ్ రెస్టారెంట్లకు అలా సాధ్యం కాదు. రాష్ట్రంలో 746 బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటే దాదాపు ఇవన్నీ కూడా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రధాన రహదారుల వెంబడే ఉన్నాయి. వీటికీ ప్రతి ఏటా లైసెన్స్‌లు రెన్యువల్ మాత్రమే కావటంతో దశాబ్దాలుగా ఒకేచోట సొంత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 60 శాతం బార్ అండ్ రెస్టారెంట్లను తక్షణం తొలగించాల్సి ఉంది. కొత్త నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాల్లో, విద్యా, వైద్య సంస్థలు, ప్రార్థనా మందిరాలకు 100 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయరాదు. 100 మీటర్లకు మించిన దూరంలో ఏర్పాటు చేయాలనుకున్నా చుట్టుపక్కల నివాసితుల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వాణిజ్య ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అద్దెల భారం అటుంచి కనీసం 200 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం. విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో లైసెన్స్ ఫీజు రూపేణా ప్రభుత్వానికి ఏటా ఒక్కో బార్ నుంచి రూ.50 లక్షల చొప్పున నేరుగా రాబడి వస్తుంది. విజయవాడలో బెంజి సర్కిల్ నుంచి నగరపాలక సంస్థ పరిధి ఆటోనగర్ చివరి వరకు బందరు జాతీయ రహదారికి 500 మీటర్లలోపు రెండువైపులా దాదాపు 15 బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. అలాగే గుంటూరులో నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి అమరావతి రోడ్డులో గోరంట్ల వరకు 15కు పైగా బార్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే గుంటూరులోని ఈ రోడ్డును రాష్ట్ర రహదారిగా ప్రకటించింది. ఇలా ప్రతి నగరం, ప్రతి పట్టణంలో అత్యధిక బార్లను తొలగించాల్సి రావటంతో మద్యం సిండికేట్లు ఏకమై తమ దుకాణాల కొనసాగింపు కోసం పలువురు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇందులో భాగంగానే పట్టణ ప్రాంతాల్లోని రాష్ట్ర రహదారులను పట్టణ, స్థానిక రహదారులుగా పరిగణించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఆర్ అండ్ బి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డిపార్ట్‌మెంట్లు న్యాయశాఖతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. దీనివల్ల కూడా ఎక్సైజ్ నూతన పాలసీ నోటిఫికేషన్ జారీలో జాప్యం జరుగుతోంది. మరోవైపు మద్యం సిండికేట్లు తమకనుకూలంగా నోటిఫికేషన్ జారీ చేయించుకోటానికి ఎడతెగని రీతిలో పైరవీలు సాగిస్తున్నాయి. ఇదిలావుంటే కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీలు, మున్సిపాల్టీల్లో 30వేల జనాభాకు ఒక బార్ చొప్పున కొత్తగా మరో 85 బార్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలో ఒక్క మద్యం వ్యాపారం పైనే ప్రభుత్వానికి సాలీనా 16వేల కోట్ల రూపాయల మేర ఆదాయం లభిస్తోంది. లైసెన్స్ ఫీజుల పైనే 3వేల కోట్లు రాబడి వస్తోంది.ఇదిలావుంటే అటు వైన్ షాపులు ఇటు బార్ అండ్ రెస్టారెంట్లు రెండూ కూడా నియమ నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నాయనేది అక్షర సత్యం. పర్మిట్ రూమ్ కోసం సాలీనా రూ. 5లక్షలు చెల్లించాల్సి ఉంటే 90 శాతం వైన్‌షాపులు అవి లేకుండానే విశాలమైన షెడ్లలో నడుస్తున్నాయి. ఇక బార్లలో ఒకే ఒక విశాలమైన హాలు, అందులో ఏసిలు లేదా కూలర్లు, 50 చ.అడుగుల విస్తీర్ణంలో కిచెన్ రూమ్, పురుషులు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఉండాలి. అయితే అత్యధిక బార్లలో కిచెన్ రూమ్‌లు, వేర్వేరుగా మరుగుదొడ్లు ఏమాత్రం కనిపించవు. కొన్నింటిలో ఒకే లైసెన్స్‌తో నాలుగైదు కౌంటర్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. ఎక్సైజ్, పోలీస్ శాఖలు నెలవారీ మామూళ్ల మత్తులో నిబంధనలేవీ పట్టించుకోటం లేదనే ఆరోపణలున్నాయి.