ఆంధ్రప్రదేశ్‌

అలా చేసి ఉండాల్సింది కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 22: రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి అవమానకర రీతిలో తొలగించడాన్ని ఆ సామాజికవర్గానికి చెందిన ఐఏఎస్, ఐపిఎస్, మాజీ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరకు రాష్ట్ర గవర్నర్ కూడా కృష్ణారావును ఆ విధంగా తొలగించాల్సింది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. అటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆయనకు ప్రభుత్వంలోని ఆ వర్గం అధికారులు, రాజకీయ పార్టీల మద్దతు పెరిగింది. ఐవైఆర్ నిర్వహించిన మీడియా సమావేశం వెనుక తెలంగాణ సీఎంఓ కార్యాలయం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయతే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోస్టింగులను ఫేస్‌బుక్‌లో షేర్ చేసి, లైక్ చేసిన ఆయన తీరును మాత్రం ఎవరూ సమర్థించకపోయినప్పటికీ, పిలిచి ఆయనతో రాజీనామా తీసుకుని ఉంటే హుందాగా ఉండేదని, కనీసం వ్యక్తిగతంగా పిలిచి వివరణ అడిగిన తర్వాత తొలగించి ఉన్నా బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా చేయకపోవడం వల్ల టిడిపి బ్రాహ్మణులకు వ్యతిరేకమన్న ప్రతిపక్షాల విమర్శలకు ఊతమిచ్చినట్టయిందని చెబుతున్నారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన వేణుగోపాల్‌ను అడ్వకేట్ జనరల్ నుంచి తొలగించి, ఆయన స్థానంలో కమ్మ వర్గానికి చెందిన దమ్మాలపాటి శ్రీనివాస్‌కు ఉత్తర్వు రాకముందే, వేణుగోపాల్ నేమ్‌బోర్డును తొలగించేసిన వైనాన్ని ఈ సందర్భంగా పలువురు అధికారులు గుర్తు చేస్తున్నారు. కాగా మిమ్మల్ని ఆ విధంగా తొలగించాల్సింది కాదు, కనీసం రాజీనామా చేయమని సంకేతాలు ఇచ్చినా బాగుండేది. ఏదేమైనా ఇది దురదృష్టకర పరిణామం. మీరేమీ విచారించవద్దు. అన్నింటికీ భగవంతున్నాడు. అయినా మీరు ఆ బురదలో కాలుపెట్టాల్సింది కాదు. కాలుపెట్టడమే మీ తప్పని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. కృష్ణారావు తొలగింపు విధానాన్ని వ్యతిరేకిస్తున్న ఆ సామాజికవర్గానికి చెందిన అధికారులు ఆయన సోషల్ మీడియా చర్యలను మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడం మంచిది కాదని, అలాంటి స్వేచ్ఛ కోరుకుని ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదాల వల్ల కార్పొరేషన్ ఏర్పాటుచేసి చంద్రబాబు పొందిన లబ్ధి వృథా అయిందని వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్పొరేషన్ చేసిన బాబు, వివరణ తీసుకుని చైర్మన్ పదవి నుంచి కృష్ణారావును తొలగించి ఉంటే ఎవరూ వ్యతిరేకించేవారు కాదంటున్నారు. ఇదంతా ప్రతిపక్షాలకు అవకాశంగా మారిందని విశే్లషిస్తున్నారు. ఇదిలాఉండగా, మరో రెండు మూడురోజుల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్-ఐవైఆర్ భేటీ ఉండనున్నట్లు తెలిసింది. ఈ మేరకు పవన్-కృష్ణారావు బుధవారం ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు సమాచారం. అదేవిధంగా మందకృష్ణమాదిగ-ఐవైఆర్ భేటీ కానున్నారు. కృష్ణారావును తొలగించిన వైనాన్ని మందకృష్ణ ఈపాటికే ఖండించిన విషయం తెలిసిందే. ఇక కాపు నేత ముద్రగడ పాదయాత్రకు ముందే హైదరాబాద్ వచ్చి కలుస్తానని కృష్ణారావుకు ఫోన్ చేసినట్టు తెలిసింది.
త్వరలో బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ
ఇదిలాఉండగా, త్వరలో విజయవాడ వేదికగా 50 వేల మందితో బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ వెల్లడించారు. ఆదివారం గుంటూరులో బ్రాహ్మణ సంఘాలు, ప్రముఖులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. తమ ఉద్యమానికి పవన్ కల్యాణ్, ముద్రగడ, మందకృష్ణమాదిగ, ఆర్.కృష్ణయ్య మద్దతు తీసుకుంటామని వివరించారు.