ఆంధ్రప్రదేశ్‌

గంటా వల్లే గందరగోళం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 23: మూడురోజుల పాటు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసిన ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాల వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇద్దరు ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మూడురోజుల నుంచి ఉపాధ్యాయులు కీలకమైన డిమాండ్లతో రోడ్డెక్కిన వైనం ప్రభుత్వానికి చెమటలు పట్టించింది. దానిపై చంద్రబాబునాయుడు గత మూడురోజుల నుంచీ సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయుల డిమాండ్లపై చర్చించి, వాటి వివరాలను ఎప్పటికప్పుడు విలేఖరుల సమావేశం నిర్వహించి వెల్లడించాలని చంద్రబాబునాయుడు మూడురోజులుగా గంటాకు ఇచ్చిన ఆదేశాలను ఆయన పట్టించుకోకపోవడం వల్ల, ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన ఉపాధ్యాయ సంఘాలు చలో సచివాలయానికి పిలుపు ఇవ్వాల్సి వచ్చింది. దానితో అప్రమత్తమైన బాబు చివరిసారిగా గంటాను హెచ్చరించడంతో అప్పుడు ఆయన స్పందించి, గురువారం రాత్రి పదిన్నర నుంచి అందుబాటులో ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలను చర్చలకు పిలిపించాల్సి వచ్చిందని అధికార వర్గాలు చెప్పాయి. అదేదో ముందుగానే స్పందించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదంటున్నారు. మూడురోజుల నుంచి ఆ అంశం వివాదంగా మారి, మీడియాలో చర్చనీయాంశమయినప్పటికీ అటు మంత్రి గానీ, ఇటు కార్యదర్శి-కమిషనర్ గానీ ఎవరూ స్పందించకపోవడం ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురైంది. చివరకు ఒక దశలో ఇదే అంశంపై నిర్వహించిన సమావేశానికి, సీఎంఓ అధికారులు కూడా అందుబాటులో లేకుండా పోవడంపై బాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికి బదిలీ మార్గదర్శకాలను ఆరుసార్లు మార్చిన వైనం పరిశీలిస్తే సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మంత్రి, ఉన్నతాధికారులు ఎంత వేగంగా స్పందిస్తున్నారో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బదిలీ షెడ్యూల్ లోపాలను సవరించాలని విశాఖలో ఉపాధ్యాయ సంఘాలు గంటా ఇంటిముందు ధర్నా నిర్వహించిన తర్వాతనే, ఆయన కదిలిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రతిభ ఆధారంగా మార్కులు, వెబ్‌కౌన్సిల్, రేషనలైజేషన్ వద్దని సంఘాలు చేస్తున్న రెండు ప్రధాన డిమాండ్లపై అప్పుడే చర్చించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదంటున్నారు. చివరకు సమస్య ముదురుపాకాన పడి, టీచర్ల సంఘాలు జిల్లాల్లో డిఈఓ కార్యాలయాల ముట్టడి నిర్వహించి, చలో సచివాలయం నిర్వహించేందుకు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన బాబు, తన తిరుపతి పర్యటనకు ముందు ఎయిర్‌పోర్టుకు వెళుతూ మంత్రి గంటా శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడి, దీనిపై దృష్టి సారించాలని ఆదేశించారు. మూడురోజుల నుంచి జరుగుతున్న ఆందోళనను మంత్రి, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రభుత్వం ఆందోళనకు గురికావలసి వచ్చిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. విద్యాశాఖలో మంత్రి-ఉన్నతాధికారుల మధ్య బేధాభిప్రాయాలుండటమే టీచర్ల సమస్య మూడురోజుల పాటు నానడానికి అసలు కారణమని అధికార వర్గాలు విశే్లషిస్తున్నాయి. ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, కోరిన డిమాండ్లు నెరవేరుస్తున్నప్పటికీ.. సకాలంలో వారి సమస్యలపై స్పందించని కారణంగా, ప్రభుత్వం చేసిన మేలంతా బూడిదలో పోసిన పన్నీరవుతోందన్న ఆవేదన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మంత్రులకు, అధికారులకు ప్రభుత్వానికి మైలేజీ తీసుకురావాలన్న ఆలోచన లేకపోవడమే సమస్యలకు కారణమవుతోందని విశే్లషిస్తున్నారు.