ఆంధ్రప్రదేశ్‌

బాబు-మోదీ మళ్లీ భారుూ భారుూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 23: ప్రధాని నరేంద్రమోదీ-ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మధ్య బంధం బలపడుతోందా? చంద్రబాబునాయుడు కూడా తన పాత ధోరణి మార్చుకుని మోదీతో సఖ్యతగా ఉంటున్నారా? మోదీ కూడా బాబుపై గత వైఖరిని మార్చుకుని ఆయనతో కలసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? గత కొద్దిరోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఈ వాదన నిజమేననిపించక మానదు. మోదీ-బాబు మధ్య బంధం మరింత బలపడుతోంది. దానికి రాష్టప్రతి ఎన్నిక మరింత దోహదపడింది. రాష్టప్రతి అభ్యర్థిగా రామనాధ్ కోవింద్ ఎంపిక విషయాన్ని కూడా ప్రధాని తొలుత బాబుకే ఫోన్ చేసి చెప్పడం గమనార్హం. దానికితోడు ఆయనను బలపరిచేందుకు ఎన్డీఏ భాగస్వామ్యపక్ష నేతలు చాలామంది ఉన్నప్పటికీ, వారిని పక్కకుపెట్టి తన తర్వాత పేరు ప్రతిపాదించేందుకు మోదీ.. టిడిపి అధినేత బాబునే ఎన్నుకున్నారు. ఇటీవల అమిత్‌షా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయనతో కలసి గన్నవరం వరకూ ప్రయాణించిన బాబుకు.. రాష్టప్రతి ఎన్నిక ఏకగ్రీవం చేసే బాధ్యత తీసుకోవాలని, అందులో భాగంగా ఎక్కువమంది ఎంపీలున్న తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మద్దతు కూడగట్టే బాధ్యతను తీసుకోవాలని అమిత్‌షా సూచించారు. తాజాగా రెండురోజుల క్రితం స్వయంగా మోదీనే బాబుకు ఫోన్ చేసి, మమతా బెనర్జీతో చర్చించి ఆమెను ఒప్పించే బాధ్యత తీసుకోవాలని అభ్యర్థించగా, బాబు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. టిడిపి-బిజెపి సంబంధాలు వివిధ స్థాయిలో భిన్నంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో వెంకయ్యనాయుడు, మంత్రి కామినేని, రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు వంటి నేతలు తెలుగుదేశం పార్టీ-ప్రభుత్వంతో వ్యక్తిగత సంబంధాలు కొనసాగిస్తున్నారు. వీరంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారే. అటు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధ్రీశ్వరి, కావూరి సాంబశివరావు, సురేష్‌రెడ్డి వంటి నేతలు టిడిపి పార్టీ-ప్రభుత్వ విధానాలను బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు ఇటీవలే విశాఖ భూములపై గళం విప్పినప్పటికీ, ఆయన ఏ సమయంలో ఎటు ఉంటారో ఎవరికీ అర్థంకాని పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయిలో మాత్రం టిడిపి-బిజెపి శ్రేణుల మధ్య దూరం ఉంది. ఆ విషయాన్ని సోము-కన్నా పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో ఇంత గందరగోళం ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో మోదీ సర్కారుతో ఇటీవలి కాలం వరకూ సంబంధాలు మరీ దగ్గర కాకుండా, మరీ దూరం కాకుండా కొనసాగుతున్నాయి. అయితే, కేంద్రమంత్రి సుజనా చౌదరి మాత్రం ఢిల్లీ లోని బిజెపి అగ్రనేతలు, రాష్ట్ర పార్టీ ఇన్చార్జిలతో ‘అత్యంత సన్నిహిత సంబంధాలు’ నెరుపుతున్నారు. అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, సిద్ధార్థనాథ్‌సింగ్, ప్రకాష్ జవదేకర్, ప్రభు వంటి ప్రముఖులను ‘మెప్పించ’డంలో సుజనాచౌదరి నిర్వహిస్తున్న లాబీయింగ్ టిడిపికి అనుకూలంగా మారింది. అందుకే రాష్ట్ర స్థాయిలో బిజెపికి చెందిన ఒక వర్గం బాబుపై ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా, వాటిని సీరియస్‌గా పట్టించుకోవటం లేదంటున్నారు. ఈ క్రమంలో వచ్చిన రాష్టప్రతి ఎన్నిక మోదీ-బాబు బంధం బలపడేలా చేశాయి. బాబుకు దేశంలోని వివిధ పార్టీ నేతలతో ఉన్న పరిచయాలను దృష్టిలో ఉంచుకున్న మోదీ, రాష్టప్రతి ఎన్నికలో బాబు ఇమేజ్‌ను వినియోగించుకుంటున్నారు. అటు బాబు కూడా బిజెపి పట్ల వ్యూహం మార్చుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మోదీతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఎన్ని కేంద్రపథకాలు అమలుచేసినా ఎప్పుడూ మోదీ ఫొటో ఉంచిన దాఖలాలు లేవు. ఇదే విషయాన్ని బిజెపికి చెందిన ఓ వర్గం తరచూ తమ పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసేది. ఈ క్రమంలో ఇటీవల ప్రారంభించిన గృహనిర్మాణ పథక శంకుస్థాపన కార్యక్రమంలో తొలిసారిగా మోదీ ఫొటో కూడా ఉంచడం బట్టి, బాబు ప్రధానికి మరింత దగ్గరవుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

చిత్రాలు..మోదీ * బాబు