ఆంధ్రప్రదేశ్‌

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున యూనివర్సిటీ, మే 3: రానున్న రోజుల్లో రాష్ట్ర విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వీలుగా అనేక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన వ్యాయామవిద్య రాష్టస్థ్రాయి శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యావ్యవస్థను, సంస్థలను మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నామని, వందశాతం అక్షరాస్యత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, దీనిలో భాగంగా సుమారు 5వేల కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలలోను వౌలిక వసతులు కల్పించనున్నామని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నామన్నారు.
దీనితోపాటు అధ్యాపకుల నియామకాలను త్వరితగతిన పూర్తి చేయనున్నామని, 2014 డిఎస్సీ పరీక్షలో అర్హత సాధించిన వారికి జూన్ మొదటివారంలో నియామక ధ్రువీకరణ పత్రాలను అందచేయనున్నామని, గతంలో కొంతమంది కోర్టుకు వెళ్లటం వల్ల ఈ నియామకాలకు అడ్డంకులు ఏర్పడ్డాయని వాటిని అధిగమించి త్వరలోనే అర్హులైన వారికి నియామకాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. విద్యతోపాటు క్రీడలను మరింత ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్మామని, దీనిలో భాగంగానే వ్యాయమవిద్యపై నాగార్జున వర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులకు శిక్షణ తరగతులు నిర్వహించ తలపెట్టామని ఆయన తెలిపారు.
నీట్‌పై రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నామని, ఒకవేళ కోర్టు తీర్పు అనుకూలంగా రాని పక్షంలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోడానికి వీలుగా త్వరలోనే ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. క్రీడలకు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందించేలా త్వరలో వైజాగ్‌లో సుమారు వెయ్యి ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

వ్యాయామవిద్య శిక్షణ తరగతుల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు

పుష్పగిరి మఠం వివాదంపై
విచారణకు ఆదేశించిన హైకోర్టు
విచారణాధికారిగా
శ్రీకాళహస్తి ఇఒ భ్రమరాంబ
తిరుమల, మే 3: తిరుమలలో ఉన్న పుష్పగిరి మఠం నిర్వహణా వ్యవహారాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలతో రాజుకున్న వివాదంపై ఎట్టకేలకు హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు శ్రీకాళహస్తి ఇఒ భ్రమరాంబను విచారాణాధికారిగా నియమిస్తూ మే 2న ఉత్తర్వులు జారీచేసింది. తిరుమల్లోని పుష్పగిరి మఠం నిర్వహణా బాధ్యతలు, నిధులు దుర్వినియోగంపై మఠం పూర్వ నిర్వాహకుడు ప్రస్తుత నిర్వాహకుడు పరస్పరం ఇటీవల పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఫిర్యాదుల్లో మఠాధిపతి, మఠం నిర్వాహకులతోపాటు మరి కొందరి పేర్లు జతచేసి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఈక్రమంలో మఠం వివాదంపై దేవాదాయశాఖ రాష్ట్ర హైకోర్టుకు విన్నవించుకోగా స్పందించిన హైకోర్టు దీనిపై విచారణకు ఆదేశించింది. మరో నాలుగు వారాల్లో విచారణ పూర్తిచేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని శ్రీకాళహస్తి ఆలయ ఇఒ భ్రమరాంబను హైకోర్టు ఆదేశించింది. కాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో ఈనెల 10న పుష్పగిరి మఠం ఆవరణలో ఫిర్యాదులు, ప్రతివాదులను విచారణాధికారి విచారించాలని పేర్కొంది. ఇదిలావుండగా తిరుమల పర్యటనలో ఉన్న పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామి మాట్లాడుతూ సందర్భం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తానని అన్నారు.
కోస్తాకు వర్ష సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 3: కోస్తాంధ్రలో రానున్న 24 గంటల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురియవచ్చని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం మంగళవారం రాత్రి తెలిపింది. మరాట్వాడా నుంచి కర్నాటక మీదుగా తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి ఉన్నప్పటికీ దాని ప్రభావం కోస్తాపై ఉండదని, తొలకరి జల్లుల్లో భాగంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.
కడప - విజయవాడ
విమాన సర్వీసులు ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 3: కడప నుంచి విజయవాడకు టర్బోమెగా ఎయిర్‌లైన్స్ ఆధ్వర్యంలో ట్రూజెట్ విమానం సర్వీసులు మంగళవారం ప్రారంభమయ్యాయి. గన్నవరం నుంచి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), తానా అధ్యక్షుడు కోమటి రమేష్ విమానంలో కడపకు చేరుకున్నారు.
అనంతరం కడప నుంచి గన్నవరానికి మంత్రి గంటా శ్రీనివాసరావు విమాన సర్వీసును ప్రారంభించారు. ట్రూజెట్ విమానం వారంలో మూడురోజులు (మంగళ, బుధ, గురువారాల్లో) కడప-విజయవాడ మధ్య సర్వీసులు నిర్వహిస్తుంది. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కడప నుంచి విజయవాడకు రూ.999లు టికెట్ ధర నిర్ణయించారు.
తగ్గని ఎండలు
ఆంధ్రభూమి బ్యూరో
కడప/కర్నూలు/అనంతపురం, మే 3: రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ ఎండలు మాత్రం తీవ్రంగానే ఉన్నాయి. కడపలో మంగళవారం 43.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. అనంతపురం జిల్లాలో మంగళవారం సగటు ఉష్ణోగ్రత 41.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా జిల్లా కేంద్రంలో 42.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. జిల్లాలోని శింగనమల మండలంలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకోవడంతో ప్రజలకు వేడి నుంచి ఒకింత ఉపశమనం కలిగింది. జిల్లాలో సగటున 41.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా కర్నూలు, నంద్యాలలో 42, ఆదోనిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వడదెబ్బకు ఐదుగురు మృతి
అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో మంగళవారం వడదెబ్బకు ఐదుగురు మృతిచెందారు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరుకు చెందిన కోరి పార్వతమ్మ (60), అనంతపురం జిల్లా అగళి మండలం హెచ్‌డి హళ్లికి చెందిన శివన్న (53), బెళుగుప్ప మండలం నరసాపురానికి చెందిన నాగలక్ష్మి (55), కడప జిల్లా సుండుపల్లె మండలం ముడుంపాడు గ్రామానికి చెందిన గణేష్ (63), ఖాజీపేట మండలం పత్తూరుకు చెందిన బాబు ప్రతాప్ (67) వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు.