రాష్ట్రీయం

చిక్కుల్లో చంద్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8:తామొకటి తలిస్తే కేంద్రం మరొకటి తలవడంతో ఇద్దరు చంద్రులు రాజకీయంగా చిక్కుల్లో పడనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి 119 స్థానాలున్న తెలంగాణలో 150, 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌లో 228 అసెంబ్లీ స్థానాలు అవుతాయని తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపి సీఎం చంద్రబాబునాయుడు భావించారు. ఆ మేరకు రెండు అసెంబ్లీల్లోనూ తీర్మానాలు చేసి, కేంద్రానికి పంపించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ మేరకు తమ మధ్య ఉన్న విభేదాలు పక్కకుపెట్టి, ఆ అంశంలో మాత్రం ఒక్కటయి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ద్వారా భారీ లాబీయింగ్ చేశారు. వెంకయ్యనాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేంద్రహోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్ వద్దకు వెళ్లి, నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వెంకయ్య నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయని, దాని పై బిల్లు పెడతామని, అయితే బిల్లు ఎప్పుడు పెడతామో చెప్పలేమని వెంకయ్య స్పష్టం చేశారు. వెంకయ్య హామీ ఇచ్చిన కొద్దిరోజులకే కేంద్రమంత్రి హరిభాయ్‌చౌదరి కూడా తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెంచే యోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. తాజాగా ప్రధాన ఎన్నికల కమిషన్ కూడా 2019లో కూడా ఇవే నియోజకవర్గాలు కొనసాగుతాయని సమాచారహక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు జవాబుగా స్పష్టం చేసింది. దీనితో ఇక తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల వరకూ కొత్త నియోజకవర్గాలు ఉండవని తేలిపోయిం ది. ఇది ఇద్దరు సిఎంలకు చిక్కు లు తెచ్చేలా కనిపిస్తోంది. కొత్త నియోజకవర్గాలు పెరుగుతాయన్న భరోసాతో తెలంగాణ, ఏపిలో రెండు అధికార పార్టీలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నాయి. కొత్త నియోజకవర్గాలు వస్తాయి కాబట్టి, మీ ఉనికికి వచ్చిన సమస్యలేదని అటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఇటు సొంత పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలకు నచ్చచెప్పాయి.
ఇప్పుడు ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వ స్పష్టీకరణతో కొత్తగా చేరిన విపక్ష ఎమ్మెల్యేలకు, సొంత పార్టీ నేతలకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఏమి సమాధానం చెబుతారో, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారోనన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. ఏపిలో టిడిపి నాయకత్వం ఇప్పటివరకూ 17 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోగా, తెలంగాణలో 13మంది టిడిపి, ముగ్గురు వైసీపీ, ఇద్దరు బీఎస్పీ, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంది. వీరందరికీ వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గాల్లో తిరిగి టికెట్లు ఇస్తామని రెండు పార్టీల నాయకత్వాలు హామీ ఇచ్చాయి. అదే నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిన సొంత పార్టీ అభ్యర్ధులకు, కొత్తగా పెరిగే సీట్ల నుంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు పునర్విభజన లేకపోవడం, పక్క నియోజకవర్గాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే సిట్టింగులుగా ఉండటంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారి రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలో ఎప్పటినుంచో పార్టీలో కొనసాగుతున్న వారికి, కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకూ నియోజకవర్గస్థాయిలో యుద్ధం తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
ఏపి విషయానికొస్తే... అద్దంకిలో టిడిపి నుంచి కరణం వెంకటేష్ పోటీ చేయగా, ఆయనపై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు టిడిపిలో చేరారు. జమ్మలమడుగులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టిడిపి అభ్యర్ధిగా పోటీచేయగా, ఆయనపై పోటీచేసి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రస్తుతం టిడిపిలో చేరారు. నంద్యాలలో శిల్పా మోహన్‌రెడ్డి టిడిపి నుంచి పోటీ చేయగా, ఆయనపై వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచిన భూమా నాగిరెడ్డి కొద్ది నెలల క్రితమే సైకిలెక్కారు. కర్నూలు నుంచి టిడిపి అభ్యర్ధిగా టిజి వెంకటేష్ పోటీ చేయగా, ఆయనపై వైసీపీ అభ్యర్ధి ఎస్వీ మోహన్‌రెడ్డి గెలిచారు. తాజాగా ఎస్వీ మోహన్‌రెడ్డి టిడిపి తీర్ధం తీసుకున్నారు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిన వారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి స్థానాలు లేకపోవడం, పక్క నియోజకవర్గాల్లో ఇప్పటికే టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలుండటంతో వారి రాజకీయ భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే, టికెట్లో, మరొకటో ఆశించి తమ పార్టీలోకి రావడం లేదని టిడిపి నేతలు చెబుతున్నారు. ‘వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యకర్తలు చూసి వస్తున్నారు. జగన్ ధాటికి ఉండలేక మా పార్టీలో చేరుతున్నారు.ప్రజల కోరిక, ఒత్తిళ్ల మేరకు వాళ్లు నిర్ణయం తీసుకుంటున్నారు. మా పార్టీలో ఓడిన ఎమ్మెల్యేలకు సముచిత స్థానం కల్పిస్తాం. వారికేమీ అభద్రతాభావం లేదు. అవన్నీ మీడియా సృష్టి మాత్రమే. టికెట్ల ఎంపికకు కొన్ని ప్రామాణికాలుంటాయి. వాటిని ఎన్నికలప్పుడు పాటిస్తాం. వాటి గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేద’ని టిడిపి జాతీయ కార్యాలయ సమన్వయకర్త, ఎమ్మెల్సీ జనార్దన్‌రావు వ్యాఖ్యానించారు.

మార్తి సుబ్రహ్మణ్యం