ఆంధ్రప్రదేశ్‌

వెంకయ్య వెళితే నష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 17: భారత ఉప రాష్టప్రతి అభ్యర్థిగా బిజెపి సీనియర్ నేత, కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఎంపిక కావడంతో ఆయన స్వరాష్ట్రంలో ఆనందం వ్యక్తమవుతోంది. ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగిన వెంకయ్య ఇమేజ్, ఇప్పుడు మరింత పెరిగిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే మిత్రపక్షమైన టిడిపిలో మాత్రం ఆయన ఎంపిక నిరాశ నింపింది. అత్యున్నత ఉప రాష్టప్రతి పదవికి ఆయన పోటీకి దిగడం టిడిపి నాయకత్వాన్ని పైకి సంతోష పరిచినప్పటికీ, రాజకీయంగా మాత్రం తమకు నష్టమేనన్న భావన అంతర్గతంగా వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్‌ను నాటి గవర్నర్ రాంలాల్ పదవీచ్యుతుడిని చేసిన సమయంలో చంద్రబాబు ఆధ్వర్యాన నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. నాటి నుంచి నేటి వరకూ టిడిపిలో అంతర్గతంగా ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నా, వెంకయ్యనాయుడు మాత్రం చంద్రబాబునాయుడుకు వ్యక్తిగతంగా, రాజకీయంగా దన్నుగా నిలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో బిజెపి-టిడిపి మధ్య పొత్తు కుదుర్చడం నుంచి సీట్ల సర్దుబాట్లు, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సయోధ్య, తాజాగా కొనసాగుతున్న నియోజకవర్గ పునర్విభజన అంశం వరకూ వెంకయ్యనాయుడు టిడిపికి అండగా నిలిచిన విషయాన్ని టిడిపి సీనియర్లు గుర్తు చేస్తున్నారు. కేంద్రం నుంచి రావలసిన నిధులు, పలు మంత్రిత్వశాఖల్లో పెండింగ్ పనుల పరిష్కారం వరకూ వెంకయ్య చొరవ తీసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గించారని చెబుతున్నారు. రాష్ట్రంలో బిజెపిలోని ఒక వర్గం బాబుపై కేంద్రానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా, వాటి ప్రభావం కనిపించలేదంటే ఢిల్లీలో వెంకయ్య చక్రం తిప్పడమే దానికి కారణమని విశే్లషిస్తున్నారు. కేంద్రమంత్రులను రాష్ట్రానికి తీసుకురావడం, ఏదో ఒక ప్రాజెక్టు రాష్ట్రానికి ఇప్పించేందుకు కృషి చేయడం వల్ల.. ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను ఈమాత్రమైనా తిప్పికొట్టగలుగుతున్నామని విశే్లషిస్తున్నారు. చివరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం ముగిసినా హరిబాబునే కొనసాగిస్తూ, మరొకరిని నియమించకుండా చూసి, తమ పార్టీ నాయకత్వానికి తలనొప్పి లేకుండా చూడటంలో వెంకయ్య సాయం చేసిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వెంకయ్య ఉప రాష్టప్రతిగా వెళ్లడం రాజకీయంగా తమకు తీరని నష్టమేనని టిడిపి వర్గాలు అంగీకరిస్తున్నాయి. పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న వెంకయ్యను చూసి ఇప్పటి వరకూ తాము ధైర్యంగా ఉన్నామని, ఇకపై అలాంటి ధీమా ఉండే అవకాశాల్లేవని ఓ సీనియర్ మంత్రి చెప్పారు. ఇకపై సంస్థాగతంగా బిజెపి నాయకత్వంతో, ప్రభుత్వపరంగా ఇతర శాఖల మంత్రులు, చివరకు ప్రధాని మోదీ వద్దకూడా రాయబారం చేసే పెద్ద దిక్కు దూరమవుతుందన్న ఆందోళన టిడిపి నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తోంది. వెంకయ్య క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడంతో రాష్ట్ర బిజెపిలోని బాబు వ్యతిరేకవర్గానికి బలం పెరగడంతోపాటు, ఆ పార్టీకి కొత్త రాష్ట్రఅధ్యక్షుడిని నియమించినా ఆశ్చర్యపోవలసిన పనిలేదని టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు వెంకయ్యకు ఉప రాష్టప్రతి పదవి దక్కడంపై బిజెపిలో ఆయనను వ్యతిరేకించే వర్గంలో కూడా హర్షం వ్యక్తమవుతోంది. ఉపరాష్టప్రతి వంటి అత్యున్నత స్థాయి పదవికి తమ రాష్ట్రానికి చెందిన వెంకయ్య ఎంపియతే, ఆ కీర్తి అందరికీ దక్కుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ‘చాలామంది ఇది ఆయన ప్రాధాన్యం తగ్గించడమో, ప్రభుత్వం-పార్టీ నుంచి గౌరవప్రదంగా పక్కకు తప్పించడమో అన్న ప్రచారం చేస్తున్నారు. ఇది దురదృష్టకరం. నిజానికి ఆయన ప్రతిష్ఠ ఇంకా పెరిగింద’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. తాజా ఎంపిక నేపథ్యంలో రాష్ట్ర బిజెపి రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని, ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటివరకూ వెంకయ్య దిశానిర్దేశంలో నడిచిన బిజెపి, ఇక ఆయన ఉపరాష్టప్రతిగా వెళితే కొత్త రూపు సంతరించుకుంటుందని జోస్యం చెబుతున్నారు. ఇకపై రాష్ట్ర పార్టీ ఆయన కనుసన్నలలో నడిచే అవకాశం ఉండదని, ఆయన ప్రభావం తగ్గిపోయి, కాపు వర్గానికి ప్రాధాన్యం ఏర్పడుతుందని విశే్లషిస్తున్నారు. వాస్తవానికి సోమవారం మీడియాలో వచ్చిన వార్తలతోనే వెంకయ్యను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించి, గౌరవప్రదంగా ఉప రాష్టప్రతి పదవికి పంపిస్తున్నారన్న సంకేతాలు వెళ్లాయి. అయతే ఈ పరిణామాలను రాష్ట్రంలోని ఆయన వర్గం మాత్రం జీర్ణించుకోలేకపోతోంది.