ఆంధ్రప్రదేశ్‌

అటకెక్కిన ‘దేశం’ రాష్ట్ర కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 12: మహానాడు ముగిసి మూడు నెలలవుతున్నా ఇప్పటివరకూ పార్టీ రాష్ట్ర కమిటీలు ప్రకటించని వైనంపై తెలుగుదేశం వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రతి సమన్వయ కమిటీ సమావేశంలోనూ తానిక పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తానన్న అధినేత చంద్రబాబునాయుడు హామీ అమలుకావడం లేదని సీనియర్లు చెబుతున్నారు. ఎన్నికలకు 18 నెలలే సమయం ఉన్నప్పటికీ, బాబు ఇంకా ప్రభుత్వంపైనే దృష్టి సారిస్తుండటంతో పార్టీ బలహీనమవుతోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. రోజూ గంటల తరబడి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, వాటి ఫలితాలు కూడా రావడం లేదని దానివల్ల బాబు కృషి వృథా అవుతోందని చెబుతున్నారు. రోజూ నాలుగైదు గంటలు మాత్రమే ప్రభుత్వానికి కేటాయించి, అధికారులకు బాధ్యతలు అప్పగించి మిగిలిన సమయం పార్టీ నేతలతో గడపాలన్న సూచన చాలాకాలం నుంచి వినిపిస్తోంది. అన్ని నిర్ణయాలు బాబు ఒక్కరే తీసుకోవడంతో పార్టీ పనులు ఆలస్యమవుతున్నాయని, ఇప్పటికైనా వికేంద్రీకరణ అవసరమన్న అభిప్రాయం సీనియర్లలో వ్యక్తమవుతోంది. ‘కాంగ్రెస్‌లో కూడా సోనియాదే అంతిమ నిర్ణయమయినప్పటికీ అన్ని పనులూ ఆమె చేయరు. అవి చూడటానికి రాష్ట్ర ఇన్చార్జులుంటారు. వాళ్లే అన్ని నిర్ణయాలు తీసుకుని, చివరలో దానిని మేడమ్, అహ్మద్‌పటేల్‌కు చెబుతారు. అందుకు ఆమె వారికి పూర్తి అధికారం ఇస్తారు. కానీ ఇక్కడ అది జరగడం లేదు. సార్ రోజులో ముప్పావు భాగం అధికారులు, గవర్నమెంటు పనిమీద ఉంటారు. ఏమైనా మాట్లాడదామనుకుంటే చూద్దాం. వర్కవుట్ చేద్దామనే చెబుతారు తప్ప వాటిపై సత్వర నిర్ణయాలుండవు. అటు జగన్ వేగంగా వెళుతున్నాడు. ఇప్పుడు పూర్తిగా పార్టీకి సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. రోజూ కొంతమంది ఎమ్మెల్యేలను, జర్నలిస్టులను పిలిపించుకుని వాళ్లతో మాట్లాడితే బోలెడంత ఫీడ్‌బ్యాక్ దొరుకుతుంద’ని కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. బాబు పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారనడానికి రాష్ట్ర కమిటీలే నిదర్శనమని సీనియర్లు చెబుతున్నారు. మహానాడు మేలో ముగిసినా ఇప్పటివరకూ రాష్ట్ర కమిటీలు వేసే తీరిక లేకుండా పోయిందని, దానిపై సమయం కేటాయించకపోవడంతో ప్రతి క్యాబినెట్ భేటీకి ముందు జరిగే పార్టీ సమన్వయ కమిటీలో జిల్లా ఇన్చార్జులు పాల్గొనలేకపోతున్నారని వివరించారు. అధికారంలో ఉండి కూడా ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్ర కమిటీలు ఏర్పాటుచేసుకోకపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరోజులో పూర్తయ్యే దానికి ఇన్ని నెలలు నాన్చడంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. సమన్వయ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కమిటీ నాయకులే జిల్లా స్థాయికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. చాలా జిల్లాల్లో ఇప్పటివరకూ పూర్తిస్థాయి కమిటీలను కూడా వేసుకోలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. కాగా, బాబుతో ఏకాంతంగా భేటీ కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లు చాలాకాలం నుంచీ ఎదురుచూస్తున్నా ఇప్పటివరకూ వారి కోరిక నెరవేరడం లేదు. బాబు ఎక్కువసేపు అధికారులతోనే గడుపుతున్నారని, దానికితోడు అమరావతికి సంబంధించి వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రతినిధులు, వారికి తోడవుతున్నందున సమయం అంతా హరించుకుపతోందని వాపోతున్నారు. ‘చివరకు సార్ లోపలికి వెళ్లేముందో, వచ్చే సమయంలో ధర్మదర్శనంతోనే సరిపోతోంది తప్ప మా కష్టాలు చెప్పుకునేందుకు మాత్రం వీలుపడటం లేదు. అటు చినబాబు కూడా ఈమధ్యన బాగా బిజీగా ఉంటున్నారు. మంత్రులకే బాబుగారు దర్శనం ఇవ్వకపోతే ఇక మా సంగతేమిటి? పోనీ గతంలో మాదిరి సీఎం పేషీ అధికారులైనా చొరవ తీసుకుంటున్నారా అంటే అదీ లేద’ని ఓ సీనియర్ ఎమ్మెల్యే చెప్పారు. వైఎస్ ఉన్నప్పుడు పార్టీ-ప్రభుత్వ వ్యవహారాలు చూసేందుకు కెవిపి ఉండేవారని, తమ పార్టీలో అన్నీ బాబుగారే చూసుకుంటున్నందున, ఆయన తప్ప మరెవరిని కలిసినా ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓ ఎమ్మెల్సీ అన్నారు. వైఎస్ రాత్రి 8 తర్వాత దేని గురించీ ఆలోచించే వారు కాదని, అన్నీ కెవిపినే చూసుకునేవారని, ఆ రకంగా ఆయనను వైఎస్ అంతగా నమ్మేవారని గుర్తు చేశారు. కానీ బాబు రాత్రి వరకూ పనిచేస్తున్నా అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటారని, ఆయనపై ఒత్తిడి తగ్గించేందుకు ఒక వ్యవస్థ, లేదా వ్యక్తులను ఏర్పాటుచేసుకుంటే తమకూ సులభంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.