ఆంధ్రప్రదేశ్‌

ఈసారీ కృష్ణాజలాలు లేనట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, ఆగస్టు 12: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో రాయలసీమకు ఈసారి కృష్ణాజలాలు వచ్చే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. వర్షాకాలం వచ్చి ఇంతకాలమైనా శ్రీశైలం జలాశయంలోకి ఎగువ నుంచి వరద రావడం లేదు. ఆల్‌మట్టి డ్యామ్ నిండినా దిగువకు నీరు విడుదల చేయకపోవడంతో జలాశయానికి నీరు వచ్చే ఆశాలు సన్నగిల్లుతున్నాయి. దీంతోఏం చేయాలో తెలియక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఇదే సమయానికి వరద నీటితో కృష్ణానది పరవళ్లు తొక్కడంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం 850 అడుగులకు చేరగానే హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు నుంచి ఆరు పంపుల ద్వారా రాయలసీమ జిల్లాలకు నీరు విడుదల చేశారు. ఆగస్టు మొదటి వారం నుంచి మార్చి వరకు 37.5 టియంసిల నీరు ఎత్తిపోశారు. అయితే ఈసారి పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు పూర్తయినప్పటికీ భారీ వర్షాల జాడలేదు. దీంతో కృష్ణానది వరద నీరు రాక ఒట్టిపోయింది. ఫలితంగా నదీ పరివాహక ప్రాంతంతో పాటు ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. కర్నూలు జిల్లాలోని మల్యాల వద్ద నిర్మించిన హంద్రీనీవా మొదటి ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. ఎగువ నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో ఈ ఏడాది శ్రీశైలం జలాశయం నిండే పరిస్థితి కనిపించడంలేదు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 779 అడుగులకు చేరింది. భారీగా వరద వచ్చినా డ్యామ్ నిండాలంటే నీటి మట్టం 885 అడుగులకు చేరుకోవాలంటే 200 టియంసిల నీరు అవసరం. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 840 అడుగులకు చేరితే హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోయవచ్చు.
ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం ఆశించిన స్థాయిలో ఉంటేనే రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులకు నీటి లభ్యత ఉంటుంది. ఈ ఏడాది రాయలసీమ రైతాంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రాజెక్టుల కింద పంటల సాగు భవిష్యత్ వర్షాలపై ఆధారపడి ఉందని చెప్పవచ్చు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 812 అడుగులకు చేరితేనే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నాలుగు పంపుల ద్వారా కెసి కాలువ, ఆరు పంపుల ద్వారా హంద్రీనీవాకు నీటిని విడుదల చేసుకునే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ పాండురంగయ్య తెలిపారు. మల్యాల హంద్రీనీవా మొదటి ఎత్తిపోతల పథకం నుంచి ఈ ఏడాది 12 పంపుల ద్వారా నీటిని పంపిణీ చేసేందుకు రూ.1050 కోట్లతో అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్ వరకు 216 కిలోమీటర్ల దూరం కాలువను ఆధునీకరిస్తున్నారు. 11 నుంచి 20 మీటర్ల వెడల్పున ప్రధాన కాలువ ఆధునీకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని ప్రాజెక్టు అధికారి తెలిపారు. ఈ ఏడాది కృష్ణా యాజమాన్య బోర్డు టెలీమీటర్లను ప్రాజక్టుల వద్ద ఏర్పాటు చేసిందని, బోర్డు అనుమతి మేరకే నీటి విడుదలపై లెక్కింపుతో నీటి పంపకాలు ఉంటాయని ఈఈ తెలిపారు.
హంద్రీనీవా ప్రాజెక్టు 2012 నవంబర్ 18న ప్రారంభమైంది. అదే ఏడాది రెండు టియంసిల నీరు ఎత్తిపోశారు. 2013లో 9.9 టిఎంసిలు, 2014లో 17 టియంసిలు, 2015లో 7.9 టియంసిలు, 2016లో అత్యధికంగా 37.50 టియంసిల నీటిని రాయలసీమ జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు విడుదల చేశారు. ఒక్క టియంసి నీరు తరలించేందుకు ప్రభుత్వానికి రూ.14 కోట్ల ఖర్చు అవుతుంది. గత ఏడాదికి సంబంధించి రూ.480 కోట్ల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఆగస్టులో మాసంలోనైనా ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి శ్రీశైలం జలాశయానికి వరద రావాలని సీమ రైతులు, ప్రజలు కోరుకుంటున్నారు.

చిత్రం.. హంద్రీనీవా ప్రాజెక్టు వద్ద అడుగండిన నీరు