ఆంధ్రప్రదేశ్‌

కిటకిటలాడిన ముద్రగడ నివాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఆగస్టు 20: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం ఆదివారం జనసంద్రంగా మారింది. చలో కిర్లంపూడి పిలుపుతో వివిధ జిల్లాల నుండి పెద్దసంఖ్యలో కాపు సామాజివర్గీయులు తరలివచ్చారు. పాదయాత్రకు అనుమతి వచ్చే వరకు రోజుకు రెండేసి నియోజకవర్గాల నుండి కాపుయువత తరలిరావాలని ఇప్పటికే జెఎసి పిలుపునిచ్చింది. కిర్లంపూడికి వివిధ ప్రాంతాల నుండి నాయకులు ఒకేరోజున కాకుండా వేర్వేరుగా వచ్చేలా ప్రణాళిక అమలుచేస్తున్నారు. గత మూడు రోజుల నుండి ఉభయగోదావరి జిల్లాల నుండి కాపు నాయకులు కిర్లంపూడి వస్తుండగా వారికి ముద్రగడ ఉద్యమపథ నిర్దేశన చేస్తున్నారు. కాపుల ఉద్యమసెగకు ప్రభుత్వం దిగ రాక తప్పదని, ఇందుకు అందరూ రెండు నెలలు కష్టపడాలని ముద్రగడ పిలుపునిచ్చారు. మహిళలు ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆదివారం జిల్లాలోని పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, నిడదవోలు నియోజకవర్గాలతోపాటు నెల్లూరు, విశాఖ జిల్లాల నుండి భారీ సంఖ్యలో కాపు నాయకులు వచ్చి ముద్రగడకు సంఘీభావం తెలిపారు. కిర్లంపూడి మండలంలోని సింహాద్రిపురం కాపులు ఎడ్లబండ్లపై ముద్రగడకు మద్దతుగా నినాదాలు చేసుకుంటూ కిర్లంపూడి తరలివచ్చారు. రాజుపాలెం గ్రామానికి చెందిన మహిళలు, ధర్మవరం గ్రామానికి చెందిన సుమారు 400 మంది కాపుయువత ముద్రగడ శిబిరంలో పాల్గొన్నారు.
కాగా పాదయాత్రను ఆదివారం కూడా పోలీసులు అడ్డుకోవడంతో ముద్రగడ కాపు జెఎసి నేతలతో కలిసి తన ఇంటి ముందు బైఠాయించారు. ఈసందర్భంగా తనకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన వారినుద్దేశించి ముద్రగడ ప్రసంగించారు. కాపులను మోసంచేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రపన్నుతున్నారని ఈసందర్భంగా ఆయన అనుమానం వ్యక్తంచేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించకుంటే ముఖ్యమంత్రి పరిస్థితి అధోగతేనని ఆయన హెచ్చరించారు. కాపులకు రిజర్వేషను ఇచ్చే విషయంలో అన్ని వర్గాలు, అన్ని మతాలు సానుకూలంగా స్పందిస్తున్నాయని, ప్రభుత్వమే మీనమేషాలు లెక్కిస్తూ కాలాయాపన చేస్తూ వచ్చే ఎన్నికల వరకు సాగదీసే ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాపుయువతలో చదువుకున్న వారు ఎక్కువగా ఉన్నారని, వారందరికీ భూములున్నాయనే తప్పుడు లెక్కలను ప్రభుత్వం తయారుచేస్తున్నట్టు తనకు వార్తలందుతున్నాయన్నారు. రాష్ట్రంలో కాపుల సంఖ్యను కూడా కుదించి 30, 40 లక్షల కంటే ఎక్కువమంది లేరని, ముఖ్యమంత్రి సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నట్టు చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు కావస్తోందని అయినా రిజర్వేషన్ల ఊసులేదన్నారు. మంజునాథ్ కమిషన్ నివేదిక ఏడు నెలల్లో తెప్పించుకుని కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని గత ఏడాది ఫిబ్రవరిలో మంత్రులు హామీ ఇచ్చి కూడా సంవత్సరం పూర్తవుతుందన్నారు. ఈ విషయాలపై కాపు యువతను చైతన్యపరచాలన్నారు. కాపు ఉద్యమ సెగ ప్రభుత్వానికి తగలాలని ఆయన పిలుపునిచ్చారు. నరసాపురం నియోజకవర్గానికి చెందిన తమ్మిశెట్టి బాబ్జి, కోటిపల్లి సురేష్, కొండపల్లి అచ్యుతరామయ్య, రావి శ్రీనివాసు, డాక్టర్ సత్యవతి, ఆరేటి రాణి, కాపు జెఎసి నాయకులు ఆకుల రామకృష్ణ తదితరులు ప్రసంగించారు.

చిత్రం..తన ఇంటికి తరలివచ్చిన కాపు నేతలకు అభివాదం చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ