ఆంధ్రప్రదేశ్‌

అవినీతి అంతం..నా పంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: ‘అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతిని సమూలంగా నిర్మూలించాలనేది నా లక్ష్యం. అవినీతి ఆరోపణలు వచ్చిన వారిపై వేగంగా, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటా’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. 80 శాతం సంతృప్తి తీసుకురావాలంటే అవినీతి ఏ రూపంలో ఉన్నా అరికట్టాల్సిందేనని ఆయన శుక్రవారం సాయంత్రం శాఖాధిపతుల సమావేశంలో ఆదేశించారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి తాము ఏర్పాటు చేసిన ‘పరిష్కార వేదిక’కు పది లక్షలకు పైగా కాల్స్ వచ్చాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ తమ సేవలను ఆన్‌లైన్ చేస్తే ఫిర్యాదులు తగ్గడంతో పాటు అవినీతి అంతమవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి శాఖలో కచ్చితంగా ‘ఇ-ప్రగతి’ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. వివిధ శాఖలపై మీడియాలో వచ్చే వ్యతిరేక కథనాలను పరిశీలించి, స్పందించడం అధికారులు తమ నిరంతర బాధ్యతగా గుర్తెరగాలని సూచించారు. వాస్తవాలను మీడియా ముందుంచాల్సిన అవసరం ఉందన్నారు. మీసేవ ద్వారా అందిస్తున్న సేవలతోపాటు అన్ని రకాల ప్రభుత్వ శాఖల సేవలకు ఒకే విధమైన సేవా ప్రమాణాలను తీసుకురావాలని నిర్దేశించారు.
పాలనలో జవాబుదారీతనం పెంచేందుకు తనతో సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కిందిస్థాయి వరకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంలో పనివేళల నమోదు తప్పనిసరి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే వివిధ సందర్భాల్లో తానిచ్చిన హామీలకు సంబంధించి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని, వాటి ప్రగతిని ఇక నుంచి సమీక్షిస్తానని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సంపూర్ణంగా వచ్చేందుకు పనులు సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. కేంద్రం నుంచి నరేగా నిధులు మరింతగా రాబట్టేలా పనులు పెద్దఎత్తున చేపట్టాలని, ఇందుకు అధికారుల స్థాయిలో కృషి జరగాలని అన్నారు. ‘రాష్ట్రంలో కొన్ని శాఖలు నిధులు ఖర్చు పెట్టకుండా ఉంటే, మరికొన్ని శాఖలు నిధుల సద్వినియోగంపై శ్రద్ధ పెట్టడం లేదు, ఈ తీరులో మార్పు రావాలి’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సిఎఎస్‌పీ కింద ఉన్న 150 పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రం వాటాగా కనీసం 4.39 శాతం నిధులు రాబట్టేలా అధికారులు ప్రయత్నించాలని లక్ష్యాన్ని అధికారుల ముందుంచారు. ఇప్పటివరకు ఈ పథకాల కింద రూ.5,329.80 కోట్ల మొత్తాన్ని కేంద్రం నుంచి అందాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. వచ్చే త్రైమాసికంలో అధికారులు మెరుగైన ఫలితాలు చూపించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
అగ్రిగోల్డ్ బాధితులకు సహకరించాలి
కాగా అగ్రిగోల్డ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా రూ.6,381 కోట్ల అవినీతి జరిగిందని, మొత్తం 30 లక్షల మందికి పైగా బాధితులు ఉన్నారని, రాష్ట్రంలో రూ.3,900 కోట్ల వరకు అవినీతికి అగ్రిగోల్డ్ సంస్థ పాల్పడిందని సిఐడి అడిషనల్ డిఐజి ద్వారకా తిరుమలరావు సమావేశంలో వివరించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశాన్ని హైకోర్టుకు తెలిపామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ఎవరు ముందుకొచ్చినా సహకరిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో మొదటి నుంచి కఠినంగానే వ్యవహరించామని, బాధితులకు న్యాయం చేసేందుకు ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖలు చొరవ చూపించాలని అన్నారు.
ఆదర్శనీయుడు మోక్షగుండం
మోక్షగుండం విశే్వశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గుర్తుచేశారు. మోక్షగుండం స్ఫూర్తితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నదుల అనుసంధానం చేపట్టామని చెప్పారు. ఆంగ్ల పాలకులు విశే్వశ్వరయ్య కార్యదీక్షను గుర్తించి సింధు రాష్ట్రంలోని అతి పెద్ద బ్యారేజ్ నిర్మాణానికి ప్రత్యేక ఇంజనీర్‌గా నియమించారని, దాన్ని నాలుగేళ్లలోనే పూర్తిచేసి ప్రతిభ చాటారని అన్నారు.