ఆంధ్రప్రదేశ్‌

పునే‘్ఠ’రెత్తిస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 19: రెవిన్యూ శాఖలో చేపడుతున్న సంస్కరణలు క్షేత్రస్థాయికి చేర్చేందుకు పరిపాలనాదక్షుడిగా పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారి, సీసీఎల్‌ఏ అనిల్‌చంద్ర పునేఠా.. జిల్లా కలెక్టర్లను పరుగులు పెట్టిస్తున్నారు. ఆయన సారథ్యంలో ప్రతి మూడు నెలలకోసారి జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సులో, ఫలితాలపై సమీక్షిస్తున్న క్రమంలో రెవిన్యూశాఖపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు క్షేత్రస్థాయికి చేరగలుగుతున్నాయి. నేటి నుంచి రెండురోజుల పాటు జరగనున్న కలెక్టర్ల సదస్సుకు రెవిన్యూ శాఖ సన్నద్ధమవుతోంది. గ్రామం నుంచి నగర స్థాయి వరకూ ఉన్న వివిధ భూ పంచాయితీలకు సంబంధించి దశాబ్దాల నుంచి కొనసాగుతున్న వివాదాలకు పునేఠా ఇటీవలే వెబ్‌ల్యాండ్ వ్యవస్థతో తెరదించారు. మొత్తం 15 శాఖలతో రెవిన్యూ రికార్డులను డిజిటలైజేషన్ చేసిన అనుసంధాన ప్రక్రియ అధికారుల తలనొప్పులు తగ్గించడంతోపాటు, ప్రజలు సర్కారు శాఖల చుట్టూ తిరిగే శ్రమ తప్పింది. రెవిన్యూ శాఖ ప్రవేశపెట్టిన ‘మీ భూమి’ వెబ్‌సైట్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. సర్వే నెంబర్లపై ఉన్న న్యాయవివాదాలు, కేసులకు సంబంధించిన 32 వేల కేసుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టేలా పునేఠా నెలలపాటు పడిన కష్టం ఫలించింది. జిల్లా కలెక్టర్లను ఆ మేరకు ఆయన పరుగులు పెట్టించారు. ఇంటర్‌నెట్ వెసులుబాటు ఉన్న ప్రతిచోట, అక్కడికక్కడే భూమికి సంబంధించిన టైటిల్‌డీల్‌ను తీసుకునే సంస్కరణ క్షేత్రస్థాయికి చేరింది. 3 వేల మంది లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో ఈ టైటిల్‌డీల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, కేంద్రప్రభుత్వాన్ని కూడా విస్మయపరిచింది. పునేఠా ప్రవేశపెట్టిన నేషనల్ ఈ-గవర్నరెన్స్‌కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. దాని అధ్యయనానికి ఇతర రాష్ట్రాల అధికారులూ వస్తున్నారు. ప్రతి కలెక్టర్ల సదస్సుకూ తానే అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో, రెవిన్యూకు చెందిన అంశాలే ప్రస్తావనకు వచ్చి, మీడియాలో పతాకశీర్షికలకెక్కడంతో రంగంలోకి దిగిన పునేఠా క్షేత్రస్థాయి సమస్యల మూలాలపై అధ్యయనం చేసి, సంస్కరణలు ప్రారంభించి సీఎం మెప్పుపొందారు.
బాబు మాట బేఖాతర్
కాగా, బుధవారం నుంచి రెండురోజుల పాటు విజయవాడలో జరగనున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన పల్లెనిద్ర అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై వస్తున్న విమర్శలపై స్వయంగా సీఎం స్పందించే అవకాశం లేకపోలేదంటున్నారు. కలెక్టర్ నుంచి కార్యదర్శులు, విభాగాధిపతుల వరకూ తప్పనిసరిగా నెలలో ఒకరోజు నుంచి మూడురోజల పాటు, క్షేత్రస్థాయిలో పల్లెనిద్ర చేయాలని గతంలో చంద్రబాబు ఆదేశాలిచ్చారు. వారి అనుభవాలను వెల్లడిస్తూ ఐటి శాఖను వెబ్‌సైట్ రూపొందించాలని ఆదేశించి నెలరోజులవుతున్నా దిక్కులేదు. అయినా చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్న, కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం వంటి ఇద్దరు ముగ్గురు కలెక్టర్లు తప్ప, మిగిలిన కలెక్టర్లు హెచ్‌ఓడీలు ఇప్పటివరకూ పల్లె నిద్ర చేసిన దాఖలాలు లేవు. ప్రధానంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారిలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ప్రజలతో మమేకమవుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. సీఎంఓలో కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉండటంతో, ప్రజాసమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొంటున్నారు. జిల్లా స్థాయిలోనే పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో తూర్పు గోదావరి కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెనుకబడి ఉండగా..శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ముందున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలనే పాటించే పరిస్థితి లేకపోతే ఇక మిగిలిన కింది స్థాయి అధికారుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ‘ప్రజల వద్దకే అధికారులు వెళ్లాలన్నదే సీఎం ఉద్దేశం. అందుకోసం ఆయన రోజూ గంటలపాటు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కోరోజు రాత్రి 11 గంటల వరకూ సమీక్షిస్తారు. కానీ దానిని పాటించకపోతే ఆయన కష్టం ఎవరికోసం’ అని ఓ ఉన్నతాధికారి ప్రశ్నించారు.
ఆర్థిక పరిస్థితి క్లిష్టం!
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని స్వయంగా ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. మరోవైపు పలు కీలక విభాగాలకు ఎన్ని లక్ష్యాలు నిర్దేశిస్తున్నా, రాబడితో పాటు కేంద్రం నుంచి రావలసిన నిధులు కూడా నిలిచిపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఆర్‌బిఎం కింద అర్ధ ఏడాదికి 16 వేల కోట్ల రుణం తీసుకున్నారు. వర్క్స్ కాంట్రాక్టుపై 12 శాతానికి జీఎస్టీ పెంచడంతో రాష్ట్రంపై 600 నుంచి రు.700 కోట్ల భారం పడుతోంది. ఏపిఐఐసి, రైతుసాధికారిక సంస్ధ, మహిళా సాధికారిక సంస్థ, ఇరిగేషన్, పవర్‌ఫైనాన్స్‌లకు నిధుల్లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కింద 14 వేల కోట్లు రావలసి ఉందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. రెవిన్యూ లోటును కూడా ఇంకా కేంద్రం భర్తీ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితిలో అటు సంక్షేమ కార్యక్రమాలు, ఇతర అవసరాలకు నిధులు సర్దుబాటు చేయాల్సి ఉంది.