ఆంధ్రప్రదేశ్‌

సర్దుబాట్లతో సరిపెడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, సెప్టెంబర్ 20: ఆ గ్రామాలకు గజిట్ నోటిఫికేషన్ లేదు. తమను ఏ గ్రామానికి చెందినవారుగా పరిగణిస్తున్నారో అక్కడి ప్రజలకే తెలియదు. అన్నింటికీ మించి అసలు ఓటరు జాబితాలోనే వారికి చోటు లేదు. బహుళార్థ సాధక ప్రాజెక్టు ‘పులిచింతల’ నిర్వాసితులు సమస్యల సుడిగుండంలో విలవిల్లాడుతున్నారు. ఓవైపు పునరావాస చర్యలు పూర్తికాక, మరోవైపు జీవనభృతికి నోచుకోక అవస్థలు పడుతున్నారు. ప్రాజెక్టు పరిధిలో గుంటూరు జిల్లాలో 11 ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా కాలనీలు ఏర్పాటు చేసింది. అయితే సంబంధిత గ్రామాలకు గ్రామకంఠం ప్రకటించలేదు. పునరావాస కాలనీలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించే నోటిఫికేషన్ ఇంతవరకు వెలువడలేదు. దీంతో ఏ గ్రామం పరిధిలోకి నిర్వాసితులు వస్తారనేది స్పష్టంగా తేలలేదు. ముంపు గ్రామాలైన బోధనం, కేతవరం, చిట్యాల, చిట్యాల తండా, కోళ్లూరు, పులిచింతల, గొల్లపేట, గోపాలపురం, తదితర గ్రామాల ప్రజలకు కొండమోడు, చౌటపాపాయపాలెం, వేమవరం, రాజుపాలెం, రెడ్డిగూడెం, యేలేశ్వరపాలెం, పెదపాలెం, చెరువుకొంపాలెం, కరాలపాడు, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో పునరావాస కాలనీలను ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నిర్మించారు. ఈ కాలనీలకు మంచినీరు, విద్యుత్ సరఫరాతో పాటు రోడ్డు సదుపాయం ఇంకా పూర్తికాలేదు. ముంపు గ్రామాల పరిధిలో 6వేల మందికి పైగా ఓటరు ఐడి, ఆధార్, రేషన్ కార్డులు పొందే వీల్లేకుండా పోయింది. కొత్త కాలనీలుగా ప్రత్యామ్నాయ గ్రామాల్లో నిర్మించిన వాటిని గజిట్ నోటిఫికేషన్‌లో చేర్చకపోవటమే ఇందుక్కారణం. పునరావాస గ్రామాలు సైతం వివిధ మండలాల్లో ఉన్నాయి. దీంతో సర్ట్ఫికెట్ల కోసం ఏ కార్యాలయానికి వెళ్లినా తమ పరిధిలోది కాదంటూ అధికారులు తిప్పిపంపుతున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం పునరావాస ప్రాంతంలో కానీ, భూములు కోల్పోయిన మండలంలో కానీ నిర్వాసితులు కోరుకున్నచోట రేషన్‌కార్డులు, ఓటరు ఐడి మంజూరు చేస్తామని చెపుతున్నా అందుకు నిబంధనలు అడ్డంకిగా మారాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పంచాయతీల ఆమోదం, నోటిఫికేషన్ లేకుండా ఏ గ్రామ పరిధిలోని వారనేది ఎలా పరిగణనలోకి తీసుకుంటారనే ప్రశ్నలకు అధికారులు సమాధానాలు దాటవేస్తున్నారు. ఇప్పటికీ హద్దులు నిర్ణయించకపోగా, సంబంధిత గ్రామాలకు గ్రామకంఠాలు కూడా నిర్దేశించలేదని చెపుతున్నారు. ఇదిలావుండగా భూసేకరణ సమయంలో తమవద్ద రిజిస్ట్రేషన్ భూములు సేకరించిన ప్రభుత్వం పునరావాస ప్రాంతాల్లో పట్టాలు పంపిణీ చేసిందని, దీనివల్ల పూర్తి హక్కులు ఉండవని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం 18 ఏళ్లు నిండిన వారికి జీవన భృతి, స్టూడెంట్ ప్యాకేజీ కింద పని కల్పించాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీలకు 350, ఇతరులకు 250 పనిదినాలను కల్పించేందుకు ప్రభుత్వం సమ్మతించింది. అయితే ఇది వ్యవసాయ కూలీలకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో నిర్వాసిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యూనిట్-1 పరిధిలో నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీలు పూర్తయ్యాయి. అయితే యూనిట్-2 పరిధిలో బోధనం, గోపాలపురం, కామేపల్లి, యమ్మాజీగూడెం గ్రామాలకు చెందిన 600 ఎకరాల అసైన్డు భూములకు సంబంధించిన నష్టపరిహారం ఇంకా తేలలేదు.

పోలవరంపై శే్వతపత్రం విడుదల చేయాలి:బొత్స

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 20: పోలవరం ప్రాజెక్టుపై శే్వతపత్రం విడుదల చేయాలని వైఎస్‌ఆర్‌సిపి నేత బొత్స సత్యనారాయణ ఎపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు అంచనాలు పెంచడం, కాంట్రాక్టర్లతో కుమ్మక్కవడం ద్వారా భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నందున సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం నాడిక్కడ ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ ప్రాజెక్టును, జాతీయ కుంభకోణంగా మార్చారని ఆరోపించారు. గత మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టుకు ఖర్చుచేసింది ఎంత, ఏ మేరకు పనులు జరిగాయి, అనే అంశాలపై తక్షణం శే్వతపత్రం విడుదల చేయాలని బొత్స డిమాండ్ చేశారు. మూడేళ్లయినా పనులు ముందుకు కదలడంలేదని, ఇందుకు కాంట్రాక్టర్లే కారణమని సిఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రాజెక్టు ఆలస్యానికి కారణం కాంట్రాక్టర్లా, మీ ధన దాహమా..? అని సిఎంను బొత్స ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టింది నిజం కాదా అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌పై గంతలోనే ఫిర్యాదులు వచ్చినా సిఎం ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నాడు వైఎస్‌ఆర్ రూ.4 వేలు కోట్లు ఖర్చు పెడితే ధన యజ్ఞం అన్నారు, ఇప్పుడు మీరు చేస్తున్న వేల కోట్లు ఖర్చును ఏమనాలని నిలదీశారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును జాతీయ కుంభకోణంగా మార్చారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక మిగిలిపోయిన 20 శాతం కాలువ పనుల కోసమే 2 లిఫ్టులు పెట్టి వాటికే రూ.4,500 కోట్లు ఖర్చు చూపించి ఎన్ని కోట్లు వెనకేసుకున్నారని అడిగారు. తాజాగా కాంట్రాక్టర్లపై నెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చంద్రబాబు డ్రామాలాడుతున్నారని బొత్స ధ్వజమెత్తారు. ప్రభుత్వంలోని పెద్దలకు పోలవరం కాంట్రాక్టర్లకు మధ్య నడిచిన ఆర్థిక లావాదేవీలు, అవినీతిపై సిబిఐ చేత సమగ్ర విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ అంకెల గారడీ చేస్తోందని అన్నారు. ముడుపులు పంచుకోవడంలో వచ్చిన తేడాల వల్లే ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరిగిందని బొత్స ఆరోపణలు గుప్పిచారు.

మట్టిపనులు నత్తనడక

ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 20: పోలవరం పవర్ హౌస్ మట్టి పనులు నత్త నడకన సాగుతున్నాయి.దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామం వద్ద జరుగుతోన్న ఈ పోలవరం పవర్ హౌస్ పనులు వాస్తవానికి టెండరు నిబంధనల ప్రకారం గత మార్చి నాటికే పూర్తి కావాల్సి వుంది. ఇప్పటి వరకు కేవలం 70 శాతం మట్టి పనులు మాత్రమే జరిగాయి. మిగిలిన 30 శాతం మట్టి పనుల్లో పూర్తిగా కొండను తొలగించాల్సి వుంది. పూర్తిగా రాయి తగలడంతో పనులు అసలు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. రెండో సారి పొడిగించి నిర్ధేశించిన లక్ష్యాల మేరకు కూడా పనులు పూర్తి కాలేదు. నిర్ధేశించిన లక్ష్యానికి దూరంగా జరుగుతున్న ఈ పనులపై గత సోమవారం సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబుఅసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు జరుగుతోన్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి పనులను పోలవరం హెడ్ వర్క్సులో భాగంగా ట్రాన్స్‌స్ట్రాయ్ ఆధ్వర్యంలో కేపిటల్ హౌసింగ్, మరో రెండు సంస్థలు నిర్వహిస్తున్నాయి. టెక్నికల్ బిడ్ అనంతరం ప్రైస్ బిడ్ ఖరారయ్యేలోపైనా మట్టి పనులు పూర్తవుతాయో లేదో తెలియని అయోమయ పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. పోలవరం పవర్ హౌస్ పనులు చేపట్టేందుకు అర్హతకు సంబంధించి గ్లోబల్ టెండర్లు పిలిచారు. ఇప్పటికే ప్రీ క్వాలిఫైడ్ టెక్నికల్ బిడ్ పూర్తయింది. ఈ టెండర్లకు మొత్తం ఎనిమిది సంస్థలు పాల్గొనగా మూడు సంస్థలు అర్హత సాధించాయి. నవయుగ, మెగా, టాటా ప్రాజెక్టు సంస్థలు ఎంపికయ్యాయి. పనులకు అర్హత కోసం వేసిన టెండర్లలో ఎంపికైన ఈ మూడు సంస్థలకు సంబంధించి ఆయా సంస్థల పనుల గతానుభవం, సాంకేతికత, ఆర్థిక పరపతి తదితర అంశాలను నిపుణుల కమిటీ పరిశీలించి అర్హతలను నిర్ధారించే ప్రక్రియ పూర్తి చేసింది. ఈ నేపధ్యంలో అక్టోబర్ 16వ తేదీన ప్రైస్ బిడ్‌కు గ్లోబల్ టెండర్లు పిలవనున్నారు. నవంబర్ నెలాఖరుకల్లా ఏజెన్సీని ఖరారు చేసి పనులను అప్పగించనున్నారు. ప్రీ క్వాలిఫైడ్ టెండర్లలో అర్హత సాధించిన నవయుగ, మెగా సంస్థలకు సివిల్, కాంక్రీటు పనుల్లోనే అపారమైన అనుభవం వుంది. అయితే సాంకేతిక అర్హత కలిగిన ఇతర సంస్థలతో జతకట్టి జాయింట్ వెంచర్‌గా పనులు చేపడతారు. అయితే అర్హత పొందిన ఈ మూడు సంస్థల్లో టాటా ప్రాజెక్టుకు మాత్రం సాంకేతిక అనుభవం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నవయుగ సంస్థ ఆల్‌స్ట్రామ్ ఎలక్ట్రిక్ సంస్థతోనూ, మెగా సంస్థ బిహెచ్‌ఇఎల్ సంస్థతో జాయింట్ వెంచర్‌గా ఒప్పందం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పనులన్నీ 60 నెలల్లో పూర్తయ్యే విధంగా టెండర్లను నిర్ధేశించారు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రూ. ఐదు వేల కోట్ల నిధులతో పూర్తి చేయనున్నారు. ప్రైస్‌బిడ్ టెండర్లలో తక్కువకు కోట్ చేసిన సంస్థకు పనులు దక్కుతాయి. మొత్తం 12 యూనిట్లు నిర్మిస్తారు. ఒక యూనిట్‌ను 40 నెలల్లో పూర్తి చేయాల్సి వుంది. మొదటి యూనిట్ పూర్తయిన తర్వాత రెండేసి నెలకొక యూనిట్ చొప్పున 60 నెలల్లో 12 యూనిట్ల పవర్‌హౌస్ నిర్మాణం పూర్తి చేయాల్సి వుంది. ఈ పనుల్లో సివిల్ పనులు, స్విచ్ యార్డు, పవర్‌హౌస్, ఎప్రోచ్ ఛానల్, విద్యుత్ ఉత్పత్తి తర్వాత విడుదలయ్యే నీటిని మళ్లీ నదిలోకి విడిచి పెట్టే టెయిల్ రేట్ ఛానల్, టర్బైన్లు, జనరేటర్లు నిర్మించాల్సి వుంది. దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామాన్ని ఖాళీ చేయించి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ పవర్‌హౌస్ మట్టి పనులు పూర్తి కాలేదు. పవర్‌హౌస్ నిర్మాణ పనులకు ప్రధానంగా కొండను తొలగించాల్సి వుంది. 303 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కొక్కటి 80 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 12 పవర్ యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఇక్కడ హైడల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తారు. టెండర్ల ప్రక్రియ నవంబర్ నెలాఖరుకు పూర్తయితే డిసెంబర్‌తో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సివిల్ పునాది పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. పవర్ బ్లాకు, ఎప్రోచ్ చానల్, టైల్ రేస్ చానల్ మట్టి పనులు మందగమనంలో వున్నాయి. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరు తీసుకుని విద్యుత్ ఉత్పత్తి తర్వాత గోదావరి నదిలోకి (కాటన్ బ్యారేజి వైపునకు) నీరు విడిచి పెట్టడం జరుగుతుంది. స్పిల్‌వే నుంచి కాకుండా విద్యుత్ కేంద్రం నుంచి కూడా నిరంతరమూ నీరు కాటన్ బ్యారేజికి చేరుతుంది. టెండర్ ప్రక్రియ ఏప్రిల్ నెలలో పూర్తి చేసి మే నెలలో నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినప్పటికీ మట్టి పని 70 శాతంలోనే వుండటంతో ఆలస్యమైంది. ఏదేమైనప్పటికీ ఈ విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే నవ్యాంధ్రాకు అతి తక్కువ ధరకు విద్యుత్ లభ్యం కావడంతో పాటు ఈ ప్రాజెక్టు తలమానికంగా నిలుస్తుందని ఎపి జెన్కో ఇఇ కొలగాని వివిఎస్ మూర్తి అన్నారు.

సింగరేణి కార్మికులకు వరాలే వరాలు!

* దసరా అడ్వాన్స్ రూ. 25వేలు
* దీపావళి బోనస్ రూ. 57వేలు!
కొత్తగూడెం, సెప్టెంబర్ 20: సింగరేణి కార్మికులకు నెలరోజుల వ్యవధిలో కాసుల వర్షం కురియనుంది. సింగరేణి దసరాకు ఇచ్చే అడ్వాన్స్ 18 వేల రూపాయల నుండి 25 వేల రూపాయలకు పెంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించడంతో యాజమాన్యం చర్యలు చేపట్టింది. దీపావళి బోనస్‌ను రూ. 57వేలు చెల్లించేందుకు కోల్ ఇండియా యాజమాన్యం నిర్ణయించడంతో దసరా అడ్వాన్స్, దీపావళి బోనస్ కోసం సింగరేణి యాజమాన్యానికి రూ. 456 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఈ నెల 22న దసరా అడ్వాన్స్‌ను సింగరేణి కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని కాలరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ అధికారులను ఆదేశించారు. దీపావళి బోనస్‌గా అక్టోబర్ రెండో వారంలో రూ. 57వేల రూపాయలను కార్మికుల ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రకటించారు. దీపావళి బోనస్ చెల్లింపు వల్ల సింగరేణి సంస్థకు రూ. 336 కోట్ల రూపాయలు వ్యయం అవుతుండగా, దసరా అడ్వాన్స్ చెల్లింపు వల్ల రూ. 120 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. నెలరోజుల వ్యవధిలో సింగరేణి కార్మికులు ఒక్కొక్కరికి 82వేల రూపాయల చొప్పున ప్రయోజనం చేకూరనుంది. కార్మికులు సంస్థ ఇచ్చే డబ్బును పొదుపు చేసుకోవాలని సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో కోరింది. కార్మికులకు శ్రీ్ధర్ దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఏసిబి వలలో
విద్యుత్ ఏఇ, లైన్‌మేన్
రుద్రవరం, సెప్టెంబర్ 20 : వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతుల నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఇ, లైన్‌మేన్ ఏసిబి అధికారులకు పట్టుబడిన సంఘటన బుధవారం కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో చోటుచేసుకుంది. ఏసిబి డీఎస్పీ జయరామరాజు తెలిపిన వివరాలు.. రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన రైతులు పి.శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వై.శ్రీనివాసులు నుంచి విద్యుత్ శాఖ ఏఇ వెంకటకృష్ణయ్య, లైన్‌మేన్ మద్దిలేటి తమ కార్యాలయంలో రూ. 1.95 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసిబి సిఐలు ఖాదర్‌బాషా, తేజేశ్వర్‌రావు, సిబ్బంది దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి నుంచి రూ. 1.95 లక్షల నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. వారిని జిల్లా ఏసిబి కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు.
భారీగా ఎర్రచందనం స్వాధీనం
ఉదయగిరి, సెప్టెంబర్ 20: నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు మండలాల్లో బుధవారం పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. 99 ఎర్రచందనం దుంగలు, 4,140 రూపాయలు, మూడు వాహనాలు, ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లు, ముగ్గురు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు జిల్లా ఓఎస్‌డి, కావలి డిఎస్పీ సూచనల మేరకు ఉదయగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది, మూడు మండలాల ఎస్సైలు బుధవారం తెల్లవారుజామున 1,130 కిలోల బరువైన ఎర్రచందనం దుంగలను, స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని స్థానిక కోర్టుకు హాజరుపరిచారు.

‘మిషన్ సౌత్’తో దూసుకుపోతాం

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, సెప్టెంబర్ 20: దక్షిణ భారత్‌లో భారతీయ జనతా పార్టీకి అనుకూల పరిస్థితుల దృష్ట్యా ‘మిషన్ సౌత్’ పేరుతో ఎన్నికల్లో దూసుకుపోతామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు స్పష్టం చేశారు. అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు వీలుగా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. బుధవారం ఆయన ఇక్కడ పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. దేశంలో 132 పార్లమెంట్ స్థానాలలో పార్టీని పటిష్ఠం చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. వాటిలో దక్షిణ భారత్‌లోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతోపాటు బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయని వివరించారు.
ఉత్తరాంధ్రలో బిజెపి మరింత బలోపేతమయ్యేలా చర్యలు తీసుకుంటామని, 2019 ఎన్నికల్లో మిత్రపక్షమైన టిడిపితో పొత్తు అనేది ఎన్నికల సమయంలో తేల్చుకుంటామని, ఇపుడు పార్టీ పటిష్ఠానికి చర్యలు తీసుకుంటున్నామని మురళీధరరావు పేర్కొర్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నారు. ప్రధాని మోదీని బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చే అన్ని పార్టీల నాయకులను కలుపుకొనిపోతామని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గ్రామస్థాయిలో ప్రచారం చేయనున్నట్టు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో బూత్ కమిటీలను పటిష్ఠం చేసి పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావుతదితరులు పాల్గొన్నారు.

అనంత రైల్వేస్టేషన్‌లో తుపాకీ మిస్‌ఫైర్

అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 20:తుపాకీ మిస్‌ఫైర్ అయి ఇద్దరు ఆర్పీఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం తెల్లవారుజామున అనంతపురం నగరంలోని రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. రైల్వే సిఐ తబ్రేజ్ తెలిపిన వివరాలు.. కర్నాటకలోని హుబ్లీ నుంచి మైసూరు వెళ్లే హంపి ఎక్స్‌ప్రెస్ రైలులో మంగళవారం రాత్రి గుంతకల్లు రైల్వే రక్షణ విభాగానికి చెందిన హెడ్‌కానిస్టేబుళ్లు రామచంద్రప్ప, షేక్ మహమ్మద్ రఫి రైల్వే ప్రయాణికుల రక్షణ విధుల్లో ఉన్నారన్నారు. వీరిద్దరూ గుంతకల్లు నుంచి అనంతపురం వరకూ వీరు విధుల్లో ఉంటారన్నారు. హంపి ఎక్స్‌ప్రెస్ అనంతపురం రైల్వేస్టేషన్‌కు చేరుకుందన్నారు. దీంతో ఆ ఇద్దరూ రైలు దిగుతుండగా ఓ ప్రయాణికుడు ఫుట్‌పాత్ నుంచి దూసుకొచ్చి రైలు ఎక్కే ప్రయత్నంలో రామచంద్రప్ప దగ్గర ఉన్న తుపాకీ కింద పడి మిస్‌ఫైర్ అయిందన్నారు.

తలసరి ఆదాయంలో
కృష్ణా ఫస్ట్..
శ్రీకాకుళం లాస్ట్!
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో తలసరి ఆదాయానికి సంబంధించి కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా, శ్రీకాకుళం చివరి స్థానంలో నిలిచింది. విజయవాడలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో జిల్లాలు, మండలాలు, నియోజకవర్గాల వారీగా తలసరి ఆదాయ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్ర తలసరి ఆదాయం 1,22,376 రూపాయలు కాగా, కృష్ణా జిల్లా తలసరి ఆదాయం 1,61,097 రూపాయలు, పశ్చిమ గోదావరి రెండో స్థానంలో (1,52,153), విశాఖపట్నం మూడో స్థానంలో (1,42,621), నెల్లూరు నాలుగో స్థానంలో (1,37,159), ప్రకాశం ఐదో స్థానంలో (1,22,939), గుంటూరు ఆరో స్థానంలో (1,21,145), కడప ఏడో స్థానంలో (1,19,244), చిత్తూరు ఎనిమిదో స్థానంలో (1,18,249), తూర్పుగోదావరి తొమ్మిదో స్థానంలో (1,09,141), కర్నూలు పదో స్థానంలో (99,116) నిలిచింది. అనంతపురం 11వ స్థానంలో (97,912), విజయనగరం 12వ స్థానంలో (94,772), శ్రీకాకుళం 13వ స్థానంలో ( 94,118) నిలిచాయి. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని మించి ఐదు జిల్లాలు ముందుండటం గమనార్హం. మండలాల వారీగా తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే మొదటి 10 స్థానాలను అచ్యుతాపురం, పెద్దాపురం, లింగాల, నందివాడ, తడ, గాజువాక, నాగాయలంక, ఎడ్లపాడు, చీమకుర్తి, రేణిగుంట మండలాలు దక్కించుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ నియోజక వర్గాల వారీగా తలసరి ఆదాయంలో మొదటి 10 స్థానాలను గాజువాక, కాకినాడ, విశాఖ (దక్షిణం), గుంటూరు (పశ్చిమం), యలమంచిలి, విశాఖ (ఉత్తరం), విజయవాడ (పశ్చిమ), గుంటూరు (తూర్పు), రాజమండి (నగరం), కైకలూరు కైవసం చేసుకున్నాయి.

తొలి విడతలో లక్ష కేబుల్ టీవీ కనెక్షన్లు

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
అమరావతి, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో మనం నిర్దేశించుకున్న 5 గ్రిడ్లలో గ్యాస్, పవర్ గ్రిడ్లను ఇప్పటికే పూర్తిచేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఫైబర్ గ్రిడ్‌లో భాగంగా లక్ష కేబుల్ టీవీ కనెక్షన్లను మొదటి విడతలో ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేశామని, అలాగే రోడ్ గ్రిడ్‌ను పూర్తిచేయడానికి రహదారులు - భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఎన్‌హెచ్‌ఎఐ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. విజయవాడలో రెండ్రోజులు జరుగుతున్న కలెక్టర్ల సదస్సు తొలిరోజు బుధవారం ఆయన ప్రసంగించారు.
సేవల రంగంలో విస్తృత అవకాశాలు
ఎంఎస్‌ఎంఈ యూనిట్లు విస్తృతంగా నెలకొల్పేలా కలెక్టర్లు ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాలకు మించి సేవల రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. సేవా రంగాన్ని ప్రోత్సహిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి కల్పించవచ్చని, అత్యధిక ఆదాయం సమకూరుతుందని అన్నారు. పనికిరాని చట్టాలను రద్దుచేసి, పనికిరాని శాఖలను మూసివేయాల్సిన తరుణం ఇదేనన్నారు. ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా కొన్ని కొత్త శాఖలను నెలకొల్పాల్సిన ఆవశ్యకత వుందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు. ఈ సదస్సులో 2015-16 మండల డొమెస్టిక్ ప్రొడక్ట్ట్, నియోజకవర్గ డొమెస్టిక్ ప్రొడక్ట్స్, 2017-18 తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, మంత్రి మండలి కరదీపిక పుస్తకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పౌర సేవలన్నిటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేలా ‘ప్రజలే ముందు’ (పీపుల్ ఫస్ట్) మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. సమావేశంలో ముందుగా సిసిఎల్‌ఎ అనిల్‌చంద్ర పునేఠా స్వాగతోపన్యాసం చేశారు. రాష్ట్రంలో ఉత్పాదకత పెంపునకు, పారదర్శక పాలనకు ఉత్తమ అభ్యాసాలను అనుసరిస్తున్నామని, రియల్ టైమ్ గవర్నెన్స్, ఇ-ప్రగతి, ప్రజలే ముందు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ వివరించారు.
భూఅక్రమాలకు తావులేకుండా చేస్తాం: కెఈ
గత సదస్సుకు, ఈ సదస్సుకు మధ్య రాష్ట్రంలో రెండు ముఖ్యమైన పరిణామాలు జరిగాయని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి ఘన విజయం చేకూర్చారని, ఇది ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు. సాంకేతికతను వినియోగించుకోవడంలో ప్రభుత్వం ముందుందని, ‘మీ భూమి’ పోర్టల్‌ను తెలుగులోనే నిర్వహించి ప్రజలకు అందుబాటులో వుంచామన్నారు. రెవెన్యూ శాఖ ప్రజల కోసం నిర్వహిస్తున్న పోర్టళ్లు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని కెఈ అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్నిరకాల ధృవీకరణ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నామని, 735 డేటా సెంటర్లను నెలకొల్పామని తెలిపారు. చుక్కల భూమి క్రమబద్ధీకరణ వల్ల లక్షా 84 వేల 389 మంది లబ్ధి పొందారని, పేదల ఆధీనంలో ఉన్న 100 గజాల వరకు స్థలాన్ని క్రమబద్ధీకరించామని చెప్పారు. భూముల క్రమబద్ధీకరణ నేపథ్యంలో రేగిన వివాదాలపై విశాఖలో సిట్ ఏర్పాటు చేశామని చెప్పారు. వేగవంతంగా దర్యాప్తు పూర్తవుతోందని, రాష్ట్రంలో ఎక్కడా భూఅక్రమాలకు తావులేకుండా చేయాలనేదే ముఖ్యమంత్రి సంకల్పమన్నారు. పూర్తి పారదర్శకతతో ఆన్‌లైన్‌లో పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని వివరించారు.
సిఎం కృషితోనే జిఎస్‌డిపిలో పురోగతి: యనమల
మూడేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, నిరంతర శ్రమ వల్ల జిఎస్‌డిపిలో పురోగతి సాధించామని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఇప్పుడు పోటీ దశలో ఉన్నామని, ఇంకా మనం ఎంతో సాధించాల్సి వుందని చెప్పారు. వృద్ధిపరంగా రాష్ట్రం మంచి ఫలితాలు సాధించిందన్నారు.