ఆంధ్రప్రదేశ్‌

రగులుతున్న దేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు అటు తిరిగి కులం రంగు అంటుకుంది. కేంద్రమంత్రి సుజనా చౌదరి, టిజి వెంకటేష్‌ను ఎంపిక చేయటం ఇంటా, బయట ఇతర కులాలకు అసంతృప్తిగా మారింది. పార్టీకి పునాదిరాళ్లయిన బీసీలను టిడిపి మోసం చేసిందని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే అయిన ఆర్. కృష్ణయ్య తిరుగుబాటు చేస్తే, దళిత నేత పుష్పరాజ్‌ను పార్టీ వాడుకుని వదిలేసిందని మాలమహానాడు బహిరంగంగా విరుచుకుపడింది. పుష్పరాజ్ సైతం తనను నమ్మించి మోసం చేశారని వాపోయారు. కాపులకు పార్టీ మొండి చేయి చూపిందని కాపునాడు నేతలు కనె్నర్ర చేస్తున్నారు. దీంతో రాజ్యసభ ఎన్నిక సంగతేమో గానీ, సంప్రదాయ మద్దతుదారులయిన బలహీనవర్గాలు టిడిపికి దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో టిడిపి నాయకత్వం బీసీలకు అన్యాయం చేసిందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విరుచుకుపడ్డారు. ఎంపిక తీరు చూస్తే టిడిపికి బీసీల ఓట్లు తప్ప, వారి ఉన్నతి పట్టదన్న వాస్తవం బట్టబయలయిందని ఆరోపించారు. నాయకత్వం బీసీలను నమ్మించి మోసం చేసిందని, ఎంపి అయ్యే అర్హత బీసీల్లో ఒక్కరికీ లేదా? అని నిలదీశారు. ‘మహానాడులో చెప్పిన ముచ్చట్లు ఏమయ్యాయి? బీసీలే పార్టీకి పునాదిరాళ్లని చెప్పారు కదా? అది మాటలకేనా? చేతల్లో ఎందుకు చూపించలేదు? అంటే బీసీలు కరివేపాకులా? మీకు బీసీలు అధికారంలోకి రావడానికి అవసరం ఉంది గానీ, వారికి రాజ్యాధికారంలో వాటా ఇచ్చేందుకు పనికిరారా’ అని ప్రశ్నించారు.
‘ఒక్క సీటు కూడా బీసీకి ఇవ్వనందుకు బీసీ మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలి. దానికి వారిదే బాధ్యత. బీసీ పార్టీ అని చెప్పి, ఓసీలకు, డబ్బున్న వాళ్లకు సీట్లు ఇస్తుంటే బీసీ మంత్రులు కళ్లుమూసుకుని ఉండటం దారుణం. ఇలాగే మీ పద్ధతి కొనసాగితే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు. ఏపిలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసే నాయకుడెవరూ లేరనుకోవద్దు. అందరినీ సమీకరించి సమరం సాగిస్తాం’ అని కృష్ణయ్య ఆంధ్రభూమితో మాట్లాడుతూ హెచ్చరించారు. టిడిపి దళితులు, బీసీలను నమ్మించి మోసం చేసిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ ఆరోపించారు. పార్టీకి ఎప్పటినుంచో సేవ చేస్తున్న పుష్పరాజ్ కంటే, రెండేళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన టిజి వెంకటేష్ సీనియరా? పార్టీకి ఆయన చేసిన సేవ ఏమిటని ప్రశ్నించారు. బహిరంగవేలంలో సీటు ఇచ్చారని ఆరోపించారు. టిడిపిలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగదన్న వాస్తవం నిజమయిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దళితులను బాబు ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు.
మరోవైపు సీనియర్ నేత పుష్పరాజ్ సైతం..నాయకత్వం తనను నమ్మించి మోసం చేసిందని, ఇప్పుడున్న పార్టీకి, ఎన్టీఆర్ నాటి పార్టీకి చాలా తేడా ఉందని, ఇప్పుడు డబ్బున్న వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని, పార్టీ నిర్ణయంతో దళితులు అవమానంతో రగిలిపోతున్నారని స్వయంగా మీడియా వద్దనే వ్యాఖ్యానించారు.
ఇక కాపులకు సైతం టిడిపి నాయకత్వం మొండిచేయి చూపిందని కాపునాడు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన సీటును చూపించి ఈసారి తమకు మొండిచేయి చూపించారని కాపునాడు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాయలసీమ నుంచి బలిజలకు అవకాశం ఇవ్వాలని తాము చాలాకాలం నుంచి కోరుతున్నామని, అయినా రాయలసీమలో పెద్దగా బలం లేని వైశ్య వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.