ఆంధ్రప్రదేశ్‌

మావోయిస్టు పార్టీలో సైద్ధాంతిక పోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 16: మావోయిస్టు పార్టీలో సైద్ధాంతిక పోరు సాగుతోంది. గత కొనే్నళ్లుగా అగ్రవర్ణ ఆధిపత్యం, దళితవాదంపై పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా రష్యాలో కమ్యూనిజం పతనానంతరం చైనా అనుసరిస్తున్న ధోరణులపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది. దీనిపై మావోయిస్టు పార్టీ ‘చైనా ఒక నూతన సోషల్- సామ్రాజ్యవాదశక్తి- అది ప్రపంచ పెట్టుబడిదారీ- సామ్రాజ్య వ్యవస్థలో అంతర్భాగం’ అనే డాక్యుమెంట్‌ను కూడా విడుదల చేసింది. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ఈ సైద్ధాంతిక చర్చలపై ఆంధ్రభూమికి కీలక సమాచారం అందింది. ఏపి క్యాడర్‌లో తాజాగా రగులుతున్న వివాదంపై కథనం ఇది. పార్టీలో అగ్రకుల ఆధిపత్యం వేళ్లూనుకుని ఉందనే ఆరోపణలతో పీపుల్స్ వార్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన కేజీ సత్యమూర్తి(ఎస్‌ఎం) పార్టీని వీడిన సంగతి విదితమే. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే సారధ్యం వహిస్తున్నారు. పార్టీ స్థాపించన నాటి నుంచి అగ్రకులాల పెత్తనమే కొనసాగుతోందనే వాదనను ఎస్‌ఎం ముందుకు తీసుకువచ్చారు. పార్టీ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్యతో విభేదించారు. అప్పటి నుంచి దళితవాదం ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే విప్లవకారులకు కులాలను ఆపాదించటం ఎంతవరకు సమంజసమని మరోవర్గం తీవ్రంగా ఖండిస్తూ ఉద్యమ పంథాలో వర్గపోరు ప్రధానాంశంగా ఉద్యమిస్తోంది. తాజాగా మరో కొత్త వివాదం తెరపైకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గత ఏడాది అక్టోబర్ 24వ తేదీన ఆంధ్ర- ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏఒబీ)లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో పార్టీలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న 34 మందితో పాటు, అక్కిరాజు హరగోపాల్ తనయుడు మున్నా కూడా మృతిచెందాడు. మున్నా స్మతి చిహ్నంగా స్థూపం ఏర్పాటు చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా స్థల సేకరణకు ప్రకాశం జిల్లా ఆలకూరపాడు పరిసర ప్రాంతాల్లో ప్రయత్నాలు జరుగుతుండగా ఇదే గ్రామం నుంచి గతంలో పార్టీలో పనిచేసిన దత్తాత్రేయ, జయకుమార్ పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. వీరిని పరిగణనలోకి తీసుకోకుండా మున్నా స్థూపాన్ని మాత్రమే నిర్మించడాన్ని పలువురు ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రస్తుతం స్థూప నిర్మాణం పూర్తయి ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. సాధారణంగా పార్టీలో రాష్ట్ర స్థాయి క్యాడర్‌లో పనిచేసి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారికే స్థూపాలు నిర్మిస్తారని చెప్తున్నారు. అదీ అమరవీరుల బంధుమిత్రుల కమిటీ (ఏఎంబిఎస్)తో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అయితే ఆలకూరపాడు స్థూపం విషయంలో ఎవరినీ సంప్రతించకుండా నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దీన్ని ఏఎంబీఎస్ కూడా ఆక్షేపిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. దళిత, నిమ్నకులాలకు చెందిన ఎంతోమంది ఇప్పటి వరకు పార్టీకి సేవలందించి అమరులయ్యారని, వారికి లేని ప్రాధాన్యత మున్నాకు ఎలా ఇస్తారనే ప్రశ్నలు వినవస్తున్నాయి. సంఘటన జరిగిన ఏఒబీలోనే మూకుమ్మడిగా మృతిచెందిన 34 మంది పేరిట స్థూప నిర్మాణం జరిగితే ఇటు ఆంధ్ర, అటు ఒడిశా రాష్ట్రాల్లో క్యాడర్‌లో ఉత్తేజాన్ని నింపినట్లవుతుందనే ప్రతిపాదనలు లేకపోలేదు. కాగా ఆలకూరపాడు స్థూపం వ్యవహారాన్ని పార్టీ భావ జాలాన్ని సమర్థిస్తూ, కొన్ని ప్రజాసంఘాలలో పనిచేస్తున్న హిందూ మతోన్మాద వ్యతిరేక వర్గం తీవ్రంగా ఖండిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా ప్లాటూన్ కమాండర్‌గా అతి చిన్న వయస్సులో ఉద్యమంలో అశువులు బాసిన మున్నా పేరిట స్థూపాన్ని నిర్మిస్తే వివాదం చేయటం తగదని పార్టీ అగ్ర నేతల నుంచి సంకేతాలు అందుతున్నట్లు తెలియవచ్చింది.

చిత్రం.. ఆలకూరపాడులో రూపుదిద్దుకున్న మున్నా స్మారక స్థూపం