ఆంధ్రప్రదేశ్‌

కాపులకు రిజర్వేషన్లు ఇస్తే కదనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 20: కాపులను బీసీల్లో చేరిస్తే సహించేది లేదని, తమ ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయాన్నయినా ప్రతిఘటించి తీరతామని బీసీ సంఘాల ప్రతినిధులు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు స్పష్టం చేశారు. మీరు కూడా వౌనం వీడి ముఖ్యమంత్రిపై ఒత్తిడి చేసి, తమతో కలసి రాకపోతే జాతి మిమ్మల్ని దూరంగా ఉంచుతుందని హెచ్చరించారు. కాపులు తమ రిజర్వేషన్ల కోసం బహిరంగంగానే పనిచేస్తుంటే బీసీ జాతి ప్రతినిధులుగా చట్టసభల్లో ఉన్న మీరెందుకు భయపడి వౌనంగా ఉంటున్నారని నిలదీశారు. ముఖ్యమంత్రిపై ఒత్తిడి చేసి ఆ ప్రయత్నాలను నిలువరించాలని కోరుతూ పాండిచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్‌బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర ఉపాథ్యక్షుడు వెంకట సత్యనారాయణ, కుడిపూడి సూర్యనారాయణతో కూడిన ప్రతినిధుల బృందం సోమవారం అసెంబ్లీలో బీసీ మంత్రులు, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసింది. ఉప ముఖ్యమంత్రి కె.ఇ కృష్ణమూర్తి, మంత్రులు పీతాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం ను కలిసి, బీసీ జాబితాలో కాపులను చేరిస్తే రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. బీసీలు మొదటి నుంచీ పార్టీకి దన్నుగా ఉన్నారన్న విషయం మర్చిపోకూడదన్నారు. అయితే, బాబు మేనిఫెస్టోలో కాపులకు బీసీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారని, కాపులకు రాజకీయ రిజర్వేషన్లు ఉండవని సీఎం స్పష్టం చేశారని మంత్రులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయతే ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన తర్వాత దేనికీ మినహాయింపులుండవని, అది అన్నింటికీ వర్తిస్తుందని కోర్టు ఇచ్చిన తీర్పును బీసీ నేతలు ఉటంకించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కాపు రిజర్వేషన్లను ఎదుర్కోలేకపోతే జాతి నష్టపోతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పీతాని మిమ్మల్ని సీఎం దగ్గరకు తీసుకువెళతామని, చెప్పగా తాము మరోసారి సమావేశమై చెబుతామన్నారు. ‘ఈనెల 30న కాకినాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకావాలని కోరాం. ఆ తర్వాత విశాఖలో ఒక సమావేశం నిర్వహించి, చివరన విజయవాడలో లక్షలాదిమందితో భారీ బహిరంగసభ నిర్వహించనున్నాం. పార్టీలకు అతీతంగా కృష్ణయ్య నాయకత్వంలో పనిచేసి, కాపులకు రిజర్వేషన్లు అడ్డుకోవాలని తీర్మానించామ’ని బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట సత్యనారాయణ ఆంధ్రభూమికి వెల్లడించారు.