ఆంధ్రప్రదేశ్‌

రగులుతున్న ‘కోటా’కుంపటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 22: సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గరపడే కొద్దీ రిజర్వేషన్ల కుంపటి రాజుకుంటోంది. వివిధ కులాల రిజర్వేషన్ల జాబితాల్లో మార్పులు చేర్పులు చేస్తామని, మరికొన్ని కులాలను బిసిలుగా గుర్తిస్తామని 2014 ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు హామీలిచ్చారు. నేడు హామీల అమలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కత్తిమీద సాముగా తయారయ్యింది. చంద్రబాబు ఆయా వర్గాలకు రిజర్వేషన్లకు సంబంధించి హామీనిచ్చి నాలుగేళ్లవుతోంది. ఇంతవరకు ఏ కులానికీ హామీ నెరవేరకపోవడం ఆయా కులాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కారణమయ్యింది. బిసిలుగా గుర్తించాలన్న డిమాండ్‌తో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతున్న విషయం విదితమే. మరోవైపు బిసి కులాలు ఎన్నికల హామీలను అమలుచేయలేదంటూ ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వాస్తవానికి 2014 ఎన్నికల సమయంలో టిడిపి మ్యానిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా కాపులను బేషరతుగా బిసిలుగా గుర్తిస్తామని హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వంలో కదలిక లేకపోవడం కాపులకు ఆగ్రహం కలిగించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టారు. అనతి కాలానికే తూర్పు గోదావరి జిల్లా తునిలో ముద్రగడ ఆధ్వర్యంలో చేపట్టిన కాపుల ఐక్యగర్జన హింసాత్మకంగా మారింది. అప్పట్లో రత్నాచల్ రైలు దగ్ధం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం కాపు జెఎసి ఆధ్వర్యంలో రిజర్వేషన్ల కోసం వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంజునాథ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం కాపులకు
సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సందర్భాల్లో ప్రకటించారు. డిసెంబర్ మొదటి వారంలో కాపులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నదని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాపు నేత, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇటీవల స్పష్టంచేశారు. వీరి ప్రకటనలిలా ఉంటే డిసెంబరు 6వ తేదీలోగా కాపులను బిసిలుగా గుర్తించని పక్షంలో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. 6వ తేదీ తర్వాత కాపు జెఎసి తీసుకునే నిర్ణయంతో భవిష్యత్ పోరాటం ఆధార పడివుంటుందని స్పష్టంచేశారు. ఈ విషయం ఆయా వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది. కులాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు మాత్రమే కమిషన్ ఏర్పాటైందని, కాపులను బిసిలుగా గుర్తించడం కమిషన్ పనికాదని జస్టిస్ మంజునాథ గతంలో స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదిక రాగానే కాపులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చెబుతుండటం నమ్మశక్యంగా లేదని కాపు జెఎసి భావిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీనే అమలుచేయమని అడుగుతున్నామని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని ముద్రగడ అల్టిమేటంలో పేర్కొన్నారు.
కాపుల విషయం ఇలా వుంటే బిసి కులాలు సైతం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రజకులను బిసి-ఎ నుండి ఎస్టీలుగా గుర్తిస్తామని, గాండ్లను బిసి-బి నుండి ఎస్సీలుగాను, సగరలను బిసి-డి నుండి బిసి-ఎగాను, కురుములను బిసి-బి నుండి ఎస్సీలుగా, వాల్మీకిలను ఎస్టీలుగా, పద్మశాలీలను బిసి-బి నుండి బిసి-ఎగా, పూసల కులాన్ని బిసి-డి నుండి బిసి-ఎగా గుర్తిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని అమలుచేయాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.