పశ్చిమగోదావరి

కొత్త మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హౌసింగ్‌లో ఇక తనిఖీల పర్వం: జిల్లా వ్యాప్తంగా పలువురికి ప్రయోజనం

ఏలూరు, డిసెంబర్ 6 : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత ప్రభుత్వ హయాంలో మంజూరై నిర్మాణాలు పూర్తికాని ఇళ్లకు సంబంధించిన అర్జీలు వందలు, వేలు పెండింగ్‌లోనే కొనసాగుతున్నాయి. కొద్దికాలం క్రితం వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కొన్ని విధానాలను రూపొందించి మార్గదర్శకాలు కూడా విడుదల చేసినా దాని వల్ల అధిక శాతం మందికి ప్రయోజనాలు చేకూరడం లేదని గుర్తించింది. ఇదే అంశాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి వీటికి వినతుల మీద వినతులు వెల్లువెత్తుతూనే వున్నాయి. తాజాగా ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిస్థాయిలో పరిష్కరించాలని నిర్ణయించింది. మొత్తంగా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా అసంపూర్తిగా వున్న నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్లేందుకు నిర్ణయించింది. దీనికోసం తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనితో ఇన్నాళ్లు మొండి గోడలతో సొంత ఇంటి కలను కొనసాగించుకుంటున్న లబ్ధిదారులకు ఎట్టకేలకు పరిష్కారం లభించినట్లైంది. ముందస్తు మంజూరు లేకుండా నిర్మాణం చేసిన గృహాలను గుర్తించడం ఎలా అన్న అంశాన్ని పరిశీలించిన ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 2014 జూన్ నుంచి మంజూరు లేకుండా నిర్మాణం చేసిన గృహాలు పూర్తయినవి, శ్లాబులు వేసినవి, రూఫ్ దశ, లింటెల్ లేక బేస్‌మెంట్ స్థాయి వద్ద వున్న విభాగాలను గుర్తించారు. వీటిలో నిర్మాణాలు మొదలుకానివి, పునాధి స్థాయిలో వున్న గృహాలను అనుమతించరు. అర్జీదారు సంబంధిత గ్రామ పంచాయితీ, మున్సిపాల్టీలో నివసించేవారై వుండాలి. వీరికి తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, స్థలము వుండాలి. అర్జీదారు ప్రతిపాదిత లబ్ధిదారుని కుటుంబం సొంతంగా పక్కా ఇల్లు కలిగి వుండకూడదు. లేదా ప్రభుత్వ గృహ నిర్మాణ పధకాల నుంచి ఇంతకుముందు పక్కా గృహం లబ్ధి పొంది వుండకూడదు. అర్జీదారు ప్రతిపాదిత లబ్ధిదారు గృహం నిర్మించిన స్థలానికి రిజిష్టర్డ్ దస్తావేజు, పట్టా, పొజిషన్ సర్ట్ఫికేట్ కలిగి వుండాలి. ప్రస్తుతం మంజూరు కోరుతున్న ఇంటిపై గతంలో ఇతరుల పేరున ప్రభుత్వ గృహ పధకం కింద చెల్లింపులు చేసి వుండకూడదు. ప్రస్తుతం మంజూరు కోరుతున్న ఇంటిపై గృహ రుణ పధకం కింద బ్యాంకులు లేదా ప్రభుత్వ సహాయం పొందిన స్వచ్ఛంద సంస్థల నుంచి ఆర్ధిక సహాయం పొంది వుండకూడదు. వీటితోపాటు తనిఖీలో అనుసరించాల్సిన విధానాలను కూడా దీనిలో పొందుపర్చారు. ప్రొఫార్మా-1లో పూర్తి చేసిన అర్జీని గ్రామస్థాయిలో పంచాయితీ కార్యదర్శికి, మున్సిపాల్టీలో బిల్ కలెక్టర్‌కు అందజేయాల్సి వుంటుంది. అర్జీతోపాటు భార్య, భర్త ఆధార్‌కార్డులు (అర్జీని భార్య పేరున మాత్రమే) దాఖలు చేయాల్సి వుంటుంది. ఈ జాబితాలను సరిపోల్చి గతంలో లబ్ధిపొందని వారి జాబితాను ఖరారు చేయాల్సి వుంటుంది. ఆ తరువాత మల్టీ డిసిప్లీనరీ టీమ్ ఆధ్వర్యంలో గ్రామం, వార్డు వారీగా పర్యటన షెడ్యూలు తయారు చేసి ముందుగా సమాచారం పంపాల్సి వుంటుంది. ఈ బృందం షెడ్యూలు ప్రకారం ఆయా ప్రాంతాల్లో ప్రతీ ఇల్లు తనిఖీ చేసి ఇచ్చిన మార్గదర్శకాల మేరకు అర్హతను నిర్ధారించాల్సి వుంటుంది. కనీసం 50 శాతం గృహాలను సంబందిత హౌసింగ్ ఉప కార్య నిర్వాహక ఇంజనీరు తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. నిర్మాణం పూరె్తైనా, శ్లాబు వేసిన అన్ని గృహాలను సంబంధిత ఆర్డీవో, హౌసింగ్ కార్యనిర్వాహక ఇంజనీరులు వ్యక్తిగతంగా తనిఖీ చేసి అర్హత కలిగిన గృహాలను 2014 జూన్ తరువాత నిర్మించినవని ధృవీకరించాల్సి వుంటుంది. అర్హత కలిగిన గృహాలుగా ధృవీకరించిన వాటిలో సమస్యాత్మక గ్రామాల్లో వున్న 5 శాతం గృహాలను హౌసింగ్ పధక సంచాలకులు తనిఖీ చేయాల్సి వుంటుంది. గృహాల తనిఖీ సమయంలో జంటగృహాలకు ద్వారాలు రెండూ రోడ్డువైపు కాకుంటే వాస్తు ప్రకారం ఒకే వైపు వుండాలి. జంట గృహానికి మధ్య గోడకు ద్వారం ఉండకూడదు. ప్రతీ ఇంటికీ కనీసం ప్లింత్ ఏరియా 200 చదరపు అడుగులకు తగ్గకూడదు. జంట గృహానికి 400 చదరపు అడుగులకు తగ్గకూడదు. ఒకటి కంటే ఎక్కువ అంతస్తులు వున్న ఇంటిని సిఫార్సు చేయరాదు. ఎసి షీట్, జి+ షీట్ కప్పు వేసిన ఇంటిని సిఫార్సు చేయకూడదు. పాత కప్పును తొలగించి కొత్త శ్లాబును వేసిన ఇంటిని సిఫార్సు చేయకూడదు. అనర్హులను తొలగించేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ప్రతీ గృహాన్ని తనిఖీ చేసిన అనంతరం మల్టీ డిసిప్లీనరీ టీమ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి అర్హత వున్న గృహాలను ఆమోదిస్తూ తీర్మానం చేయాల్సి వుంటుంది. అర్హమైన గృహాల జాబితాను, గ్రామ సభ తీర్మానాలను నిర్ధేశిత సమయం లోగా హౌసింగ్ పధక సంచాలకులకు పంపాల్సి వుంటుంది. మొత్తం మీద ఈ తాజా మార్గదర్శకాలతో ఇన్ని రోజులుగా అయోమయంలో చిక్కుకున్న హౌసింగ్ లబ్ధిదారుల సమస్యకు ఒక పరిష్కారం లభించినట్లేనని భావించవచ్చు.
భాషతో ముడిపడిన జాతి, సంస్కృతి
నరసాపురం, డిసెంబర్ 6: భావితరాలకు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక వైఎన్ కళాశాల పిజి సెమినార్ హాలులో నిర్వహించిన తెలుగు వెలుగు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన సభ ఉప సభాపతి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ భాష అంటే భావ వ్యక్తీకరణ మాత్రమే కాదన్నారు. భాషలో జాతి, సంస్కృతి ముడిపడి ఉన్నాయన్నారు. తేనెలూరే తెలుగు భాషను బ్రతికుంచుకునే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పక్కనున్న కర్నాటక సంగీతంలో త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి, సోమసుందరం వంటి మహనీయులు తెలుగులో కీర్తనలు ఆలపిస్తున్నారని కొనియాడారు. అయితే తెలుగువారు మాత్రం మమీ, డాడీ సంస్కృతిని కొనసాగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని విడనాడాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే తెలుగు భాష అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. కళాశాల తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ అరిపిరాల నారాయణరావు రూపొందించిన తెలుగు వెలుగు పుస్తకం భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాల సాయి జ్యోతి ప్రజ్వలన చేశారు. మహామహోపాధ్యాయ, రాష్టప్రతి అవార్డు గ్రహీత విశ్వనాధ గోపాలకృష్ణశాస్ర్తీకి తెలుగు వెలుగు పుస్తకం తొలి ప్రతిని అందించారు. మల్కిపురం కళాశాల రిటైర్డు ప్రిన్సిపాల్ శ్రీరామారావు గ్రంధ సమీక్ష చేశారు. అనంతరం శాసనసభ ఉపసభాపతి బుద్ధప్రసాద్, తెలుగు వెలుగు గ్రంథ రచయిత డాక్టర్ అరిపిరాల నారాయణరావు దంపతులను కళాశాల యాజమాన్యం ఘంగా సత్కరించింది. కళాశాల కార్యదర్శి డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, డాక్టర్ నిమ్మల రామానాయుడు, వైస్ చైర్మన్ పొన్నాల నాగబాబు, కళాశాల ఉపాధ్యక్షుడు జివికె రామారావు, కోశాధికారి డాక్టర్ యర్రమిల్లి గోపాలకృష్ణమూర్తి, ప్రిన్సిపాల్ డాక్టర్ కుమార్, పిజి డైరెక్టర్ డాక్టర్ ఎన్.చింతారావు, డాక్టర్ డి.వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
17 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ద్వారకాతిరుమల, డిసెంబర్ 6: అక్రమంగా తరలివెడుతున్న రేషన్ బియ్యం లారీని బుధవారం ద్వారకాతిరుమల ఎస్సై ఐ వీర్రాజు అడ్డుకున్నారు. లారీలో లోడును స్వాధీనం చేసుకుని డ్రైవరు, క్లీనర్లను అరెస్టు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఉంగుటూరు మండలం చేబ్రోలు నుండి రేషను బియ్యం లోడు లారీ జంగారెడ్డిగూడెం వెడుతున్న సమాచారం అందడంతో ఎస్సై సిబ్బందితో కలిసి ద్వారకాతిరుమల సొసైటీ పెట్రోలు బంకు వద్ద కాపు కాశారు. ఉదయం అయిదున్నర గంటల సమయంలో లారీ వస్తుండడంతో పోలీసులు అడ్డుకుని లోడును పరిశీలించి రేషన్ బియ్యంగా గుర్తించి లారీని పోలీసుస్టేషనుకు తరలించారు. ఆ తరువాత కైకరానికి చెందిన లారీ డ్రైవరు శ్రీరంగం అంజిబాబు, క్లీనరు పోసిబాబును అరెస్టు చేసి విచారించగా లారీ చేబ్రోలుకు చెందిన కిరాణా వ్యాపారి మంతెన నాగేశ్వరరావుకు చెందినదిగా చెప్పారు. స్థానిక తహసీల్దారు సుజాతకు సుమారు 17 టన్నులున్న లోడును అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వీర్రాజు తెలిపారు.
లక్ష్యం మేరకు ‘పోలవరం’ పూర్తిచేస్తాం
ఎంపి మాగంటి బాబు
ఏలూరు, డిసెంబర్ 6 : ప్రజల జీవనాడిగా భావించే పోలవరం సాగునీటి ప్రాజెక్టును లక్ష్యం ప్రకారం పూర్తి చేస్తామని, ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ఎంపి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల పోలవరం ప్రాజెక్టు అంశంపై చోటుచేసుకున్న పరిణామాలపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ప్రాజెక్టును ఎంతో నిర్మాణాత్మకంగా, వైభవంగా పనులు జరుగుతున్నాయని ఖచ్చితంగా నూరుశాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి 2019 నాటికి బయటకు నీరు విడుదల చేయాలన్నదే తమ అంతిమ లక్ష్యమన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే ఎంతో ఖర్చు చేయడం జరిగిందని ఇటువంటి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా నిర్వాసితుల సహాయ పునరావాసాల కోసం 32 వేల కోట్లు ఖర్చు చేస్తుండగా ప్రాజెక్టు నిర్మాణానికి 12 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికే ఆర్ అండ్ ఆర్ క్రింద రాష్ట్ర ప్రభుత్వం 2800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇంత పెద్ద ఎత్తున నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్మాణంలో చిన్న చిన్న సాంకేతిక అంశాలపై అనుమానాలు ఉండవచ్చునని వాటిని కూడా సంబంధితాధికారులు నివృత్తి చేసి ముందుకు వెళుతున్నారన్నారు. ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించి పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. ఇప్పటికే ప్రాజెక్టునిర్మాణానికి ఎంతో ఖర్చు అయ్యిందని ఈ తరుణంలో ఏ అధారిటీ కూడా నిర్మాణం నిలుపుదల చేయాలని చెప్పదని ఈ సందర్భంగా మాగంటి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కల 60, 70 సంవత్సరాల నుండి అందరిలో వుందని అటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు సృష్టించినా 2018 చివరి నాటికి పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరివ్వడం ఖచ్చితమని ఆయన చెప్పారు. నిర్ధిష్ట సమయంలో కాఫర్ డ్యామ్, స్పిల్‌వే పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు మూలంగా కృష్ణా డెల్టాలో 15 వేల కోట్ల రూపాయలు ఆదాయం కలిగిందని ఆ ప్రాంత రైతులు చెప్పడంతోపాటు అవసరమైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విరాళాలు ఇస్తామని ముందుకు వస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ముఖ్యమంత్రి కూడా అనేక కోణాలతో ఆలోచన చేసి పోలవరం ప్రాజెక్టు లక్ష్యం ప్రకారం పూర్తి చేయాలన్నదే ధృఢ సంకల్పంగా పెట్టుకున్నారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సందర్శించేందుకు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలం నుండి వంద మంది చొప్పున ప్రజాప్రతినిధులను పంపుతున్నామని చెప్పారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేసేందుకు కుకునూరు, వేలేరుపాడు మండలాలను మన రాష్ట్రంలో విలీనం చేసారన్నారు. ఈ సందర్భంగా అక్కడ భూములను గతంలో లక్ష రూపాయలు రిజిస్ట్రేషన్ ధర ఉండగా ప్రస్తుతం 3.5 లక్షలకు పెంచడం జరిగిందని దీని మూలంగా పోలవరం ప్రాజెక్టు కోసం చేసే భూసేకరణలో ఎకరాకు పది లక్షల 90 వేల రూపాయలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. సమావేశంలో ఏలూరు ఎంపిపి మోరు హైమావతి, వైస్ ఎంపిపి లంకపల్లి మాణిక్యాలరావు, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు గుత్తా చంద్రశేఖర్, పలువురు కార్పొరేటర్లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.
అగ్రవర్ణాలు సహకరిస్తేనే కుల వివక్ష నిర్మూలన
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 6: ఈ దేశంలో కుల వివక్ష వింత రోగమని, ఒక సాంఘిక సమస్యని, అగ్రవర్ణాలు సహకరిస్తేనే కుల వివక్ష నిర్మూలన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కారెం శివాజీ అన్నారు. స్థానిక ప్రియదర్శిని కళాశాలలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శివాజీ మాట్లాడుతూ కుల వివక్షపై ఎస్సీ, ఎస్టీలు ఎన్ని పోరాటాలు చేసినా రూపుమాపేది కాదన్నారు. సామాజిక కోణంలో ఈ సమస్యను ఈ దేశంలోని అన్ని వర్గాలు ఆలోచించినపుడే సాధ్యమన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కూడా అన్ని కులాల వారు సహకరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు కూడా అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వ పథకాలు రావాలని కృషిచేస్తున్న వైనం గుర్తుచేశారు. దేశంలో దళితులు, గిరిజనుల ఆర్థిక, సామాజిక పరిపక్వత సాధించాలని ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. అందుకోసం కమిషన్ కూడా కృషిచేస్తోందని, దీనితో పాటు కుల వివక్ష, అంటరానితనంపై కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ దేశంలో ఏ కులాన్నయినా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో చేర్చాలంటే పార్లమెంటు తీర్మానం అవసరమని, ఇది పూర్తిగా కేంద్రం చేతుల్లోనే ఉంటుందన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషన్ విజ్ఞప్తి చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులకు రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాడుతున్నట్టు చెప్పారు. కొంతమంది మనువాద ఉద్యోగ వర్గాల వారు కోర్టులకు వెళ్ళి పదోన్నతుల్లో రిజర్వేన్లు రాకుండా అడ్డుతగులుతున్నారని విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీలు సామాజికంగా కొద్దొగొప్పో అభివృద్ధి చెందారని, ఇప్పుడు మనువాద ఉద్యోగ వర్గాల దుశ్చర్య వల్ల దళిత, గిరిజన ఉద్యోగులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం వంద కోట్ల రూపాయలతో నిర్మించేందుకు జీ.ఓ జారీ చేశారని చెప్పారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు త్వరలో ఏలూరులో 50 వేల మంది దళిత, గిరిజనులతో సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇప్పటి వరకు ఎనిమిది వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 75 శాతం సమస్యలు పరిష్కరించినట్టు తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారం కోర్టు వ్యాజ్యాలు, సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో విద్యావేత్త డాక్టర్ అలుగు ఆనందశేఖర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, వివిధ రంగాల నేతల పెనుమర్తి రామ్‌కుమార్, పంతగాని వెంకన్న, తహసీల్దార్ జివివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అంకితభావంతో విధులు నిర్వహించాలి
హోంగార్డ్స్ 55వ ఆవిర్భావ దినోత్సవంలో ఎస్పీ రవిప్రకాష్
ఏలూరు, డిసెంబర్ 6 : జిల్లాలోని హోంగార్డ్స్ అంకితభావంతో విధులు నిర్వర్తించి శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు అండగా వుండాలని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ అన్నారు. బుధవారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో హోంగార్డ్స్ 55వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్ నుంచి ఎస్పీ గౌరవవందనం స్వీకరించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ 1963వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన మన రాష్ట్రంలో హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ప్రారంభించబడిందని, నాటి నుంచి హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ప్రజలకు విశేష సేవలు అందిస్తోందని పోలీసు శాఖకు వెనె్నముక వలే నిలిచి విధి నిర్వహణలో సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. జిల్లా మొత్తంలో 851 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. హోంగార్డ్స్‌కు వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ఒక్కొక్క హోంగార్డు వేతనం నుంచి నెలకు 20 రూపాయలు వసూలు చేస్తామని, ఇందులో పది రూపాయలు కేంద్ర నిధికి, మరో పది రూపాయలు జిల్లా హోంగార్డ్స్ సంక్షేమ నిధికి జమ చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎఆర్ ఎస్పీ ఎం మహేష్‌కుమార్, ఎస్‌బి డీఎస్పీ పి భాస్కరరావు, ఎస్‌బి సీఐ ఎస్ కొండలరావు, ఏలూరు ఉమెన్ పోలీస్‌స్టేషన్ డి ఎస్‌పి పైడేశ్వరరావు, ఏలూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌సి, ఎస్‌టి డిఎస్‌పి విజయశేఖర్, నర్సాపురం డిఎస్‌పి ప్రభాకరబాబు, ఏలూరు సిసిఎస్ డిఎస్‌పి సత్యనారాయణ, డిసిఆర్‌బి సిఐ జివి కృష్ణారావు, పోలీసు అధికారుల సంఘ అధ్యక్షులు కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తొలుత హోంగార్డ్స్ ర్యాలీని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ప్రారంభించారు.
తక్కువధరలో ఉల్లిపేస్ట్, టమోటా పేస్ట్‌లు అందించేందుకు
4వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు సిద్ధంచేయాలి
క లెక్టర్ భాస్కర్
ఏలూరు, డిసెంబర్ 6: జిల్లాలో ఉల్లిపాయలు, టమోటా తదితర ఉత్పత్తుల ధరలు పెరిగితే దానికి ప్రత్యామ్నాయంగా ప్రజలకు తక్కువధరలో ఉల్లిపేస్ట్, టమోటా పేస్ట్‌లను అందుబాటులో ఉంచడానికి 4వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను వారానికి సరిపడా ముందుగానే సిద్ధం చేయాలని, దీనికి సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన ప్రాధాన్యతారంగాల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఉల్లిధర, టమోటా ధరలు విపరీతంగా పెరిగినందున పేదప్రజలు ఇబ్బందులు పడే పరిస్ధితులు తలెత్తాయని, ఈ పరిస్థితులను ముందుగానే గుర్తించి ఉద్యానవనశాఖాధికారులు ఉల్లి, టమోటా తదితర పేస్ట్‌లను సిద్ధం చేసుకోవాలన్నారు. పేస్ట్ రూపంలో వాటిని కోల్డ్‌స్టోరేజ్‌లో భద్రపర్చడానికి అనుకూలంగా ఉంటుందని, ఈమేరకు ఎన్ని కోల్ట్‌స్టోరేజ్‌లు ఏర్పాటుచేయాలో ముందుగానే ఆలోచన చేసుకోవాలన్నారు. జిల్లాలో ఉద్యానవనం, ఫిషరీస్ తదితర ఉత్పత్తులను ప్రతియేటా అభివృద్ధి చెందేలా అధికారులు నూతన విధానాలను చేపట్టి అమలుచేయాలన్నారు. ప్రతి రైతు ఎకరం లేదా కనీసం అరఎకరంలోనైనా ప్రకృతి వ్యవసాయం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యానవన పంటల రైతులకు అవసరమైన ప్లాస్టిక్ ట్రేలను పంపిణి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, స్టాకు ఉన్నప్పటికీ రైతులకు అందించటం లేదని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో పాలసేకరణకు సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు సొమ్ములను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఈ ఏడాది మల్బరీ ప్లాంటేషన్ 2వేల ఎకరాల్లో ఏర్పాటుచేయాలని లక్ష్యం కాగా ఇంతవరకు కేవలం 930 ఎకరాల్లో మాత్రమే చేయటం పట్ల కలెక్టరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మల్బరీ ప్లాంటేషన్‌ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు-2 ఎంహెచ్ షరీఫ్, సిపిఓ కె బాలకృష్ణ, వ్యవసాయశాఖ జెడి గౌసియా బేగం, ఉద్యానవనశాఖ ఎడి దుర్గేష్, మార్క్‌ఫెడ్ డిఎం నాగమల్లిక, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల, డిసెంబర్ 6: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని బుధవారం ఉభయ రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తరువాత ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రం కప్పి వేదాశీర్వచనం పలికారు. ఆలయ ఈవో త్రినాధరావు ఆయనకు శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో భీమడోలు కోర్టు మేజిస్ట్రేట్ దీప దైవకృప, తహసీల్దారు సుజాత తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ సేవలు ఎనలేనివి
మంత్రి జవహర్
కొవ్వూరు, డిసెంబర్ 6: దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎనలేని సేవలందించారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను బుధవారం మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటి యువత అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సందర్శించి, పాఠశాలలోని విద్యార్థులతో కలిసి సహఫంక్తి భోజనం చేశారు. విద్యార్థినులు బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొవ్వూరు ఎఎంసి ఛైర్మన్ వేగి చిన్న, ప్రిన్సిపాల్ మంజుల వేణి రాణి, వైస్-ప్రిన్సిపాల్ మహ్మద్ ఇబ్రహీం జానీ తదితరులు పాల్గొన్నారు.

తుపాను హెచ్చరికలతో అలజడి
ద్వారకాతిరుమల, డిసెంబర్ 6: ఓఖీ తుపాను హెచ్చరికలతో మెట్టప్రాంత రైతుల్లో అలజడి రేగింది. ఆఘమేఘాల మీద కొందరు రైతులు పంటను ఒబ్బిడి చేసుకుంటుంటే మరికొందరు పంటలు కోసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో మండలంలో 3,006 హెక్టార్లలో రైతులు వరిసాగు చేపట్టారు. అయితే ఇప్పటివరకు 2950 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంటను కోసే పనిలో రైతులున్నారు. అలాగే మండలంలో 200 హెక్టార్లలో అపరాలు సాగుచేస్తుండగా తుపాను పుణ్యమాని కోతలు పూర్తి చేశారు. ప్రస్తుతం అధిక శాతం రైతులు చేతికొచ్చిన పంటను ఒబ్బిడి చేసే పనిలో పడ్డారు. ఈ నెల ఏడు, ఎనిమిది తేదీల్లో తుపాను ప్రభావం ఉంటుందన్న అధికారుల హెచ్చరికలతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తున్నారు.