ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో కాంగ్రెస్‌ను వెలిగిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 11: కోలుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్‌కు కొత్త సారథి రాహుల్‌గాంధీ వెలుగుతీసుకువస్తారా? ఆయన సారథ్యం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనీస గౌరవ స్థానం సంపాదించుకునేందుకు అక్కరకొస్తుందా? వలసబాట పడుతున్న సీనియర్లకు ఆయన నియామకం బ్రేకులు వేస్తాయా?.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న నేపథ్యంలో జరుగుతున్న చర్చ ఇది! విభజనతో రాజకీయంగా పూడ్చుకోలేనంత నష్టం చవిచూసిన రాష్ట్ర కాంగ్రెస్‌కు, కొత్త సారథి రాహుల్ ప్రాణవాయువు అందిస్తారా అన్న ఆశావహ చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ధరావతు కూడా కోల్పోయి, అగ్రనేతలంతా దారుణంగా దెబ్బతిన్నారు. తర్వాత సీనియర్లలో మెజారిటీ శాతం వైసీపీ, మరికొంతమంది టీడీపీలో చేరిపోగా, ఇంకొందరు నేతలు టీడీపీ-వైసీపీ వైపు పక్కచూపులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రులుగా పనిచేసిన వారిలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, చింతా మోహన్ వంటి వారు మాత్రమే చురుకుగా పనిచేస్తుండగా, మిగిలిన వారు ఉండీ లేనట్లు పనిచేస్తున్నారు. కేంద్రమంత్రిగా పనిచేసిన చిరంజీవి అయితే ఎక్కడా కనిపించడం లేదు. విభజన నుంచీ ఇప్పటివరకూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అతి కష్టంమీద, సొంత వనరులతో పార్టీ బండి లాగిస్తున్నారు. హోదాపై నిర్వహించిన ఉత్తరాలు, సంతకాల సేకరణ ఘోర వైఫల్యం చెందినప్పటికీ, నిరాశ చెందకుండా సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు చేయూతతో ఢిల్లీలో భారీ కార్యక్రమమే చేపట్టి ఉనికి చాటుకుంది. కేవీపీ చొరవతో హోదాపై ప్రైవేటు బిల్లు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రనిధులపై కాంగ్రెస్ ఇంకా జనంలో సజీవంగా నిలిచింది. ప్రధానంగా హోదాపై ప్రైవేటు మెంబర్ బిల్లు వ్యవహారం టీడీపీ, బీజేపీని రాజకీయంగా ఆత్మరక్షణలో నెట్టింది. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా రాజ్యసభలో ఉన్న కొద్దిమంది సభ్యులతో కాంగ్రెస్ గళం విప్పి, రాష్ట్రం కోసం పోరాడుతున్నామన్న సంకేతాలు పంపిస్తోంది. ఈ విషయంలో కేవీపీ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ఆందోళన కార్యక్రమాలన్నీ విజయవాడ వేదికగానే జరుగుతున్నాయి. రాజధాని నగరంలో విలేకరుల సమావేశాలు, ధర్నాలు, వివిధ వర్గాల ఆందోళనలకు మద్దతు వంటి కార్యక్రమాలతో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మశ్రీ రాజధాని నగరంలో ఒంటరిపోరాటం చేస్తూ, పీసీసీ కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ అధ్యక్షుడయినప్పటికీ రఘువీరానే కొనసాగించవచ్చంటున్నారు. ఆ స్ధానానికి పెద్దగా పోటీ కూడా కనిపించడం లేదు. కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన కొందరికి అధ్యక్ష పదవిపై ఆశ ఉన్నప్పటికీ, సొంత వనరులు ఖర్చు పెట్టుకునేందుకు ఆసక్తి ప్రదర్శించడం లేదు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి కొండ్రు మురళి వంటి అతి కొద్దిమంది మాత్రమే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితిలో ఆర్ధికవనరులు వెచ్చించడమే ప్రధానమైనందున, అధ్యక్ష పదవిపై ఆసక్తి ప్రదర్శిస్తోన్న కొద్దిమంది నేతలు, ఆ అంశంలో మాత్రం విముఖత ప్రదర్శిస్తున్నందున, రఘువీరారెడ్డినే కొనసాగించే అవకాశాలున్నాయని సీనియర్లు విశే్లషిస్తున్నారు. కాగా, రాష్ట్రానికి చెందిన కేవీపీ రామచంద్రరావు, సుబ్బరామిరెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పల్లంరాజు, చింతామోహన్, శైలజానాధ్, జెడి శీలం, పనబాక లక్ష్మి, గిడుగు రుద్రరాజు, నాదెండ్ల మనోహర్ వంటి వారిలో కేవీపీ, కోట్లలో ఒకరికి సీడబ్ల్యుసీ, మరో ఇద్దరికి ఏఐసిసిలో చోటు లభిస్తుందన్న చర్చ జరుగుతోంది. ఇదిలాఉండగా, రాష్ట్రంలో మసకబారిన పార్టీని వెలిగించాలంటే కొత్త సారథి రాహుల్ చాలా కష్టపడాల్సి ఉంది. ముఖ్యంగా హోదా, ప్యాకేజీ వంటి ప్రధాన అంశాలపై పార్లమెంటులో పోరాటవ ద్వారా మాత్రమే కాంగ్రెస్‌ను మళ్లీ గాడిలోకి పెట్టవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పార్టీ చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు రాహుల్ తరచూ హాజరవడంతోపాటు, వైసీపీ ఖాతాలో చేరిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటు బ్యాంకుపై మళ్లీ దృష్టి సారిస్తేనే రాష్ట్రంలో పార్టీ కొంతవరకైనా గౌరవ స్థానానికి చేరుకుంటుందని సీనియర్లు విశే్లషిస్తున్నారు.