ఆంధ్రప్రదేశ్‌

మెగా సీడ్‌పార్కు కోసం ప్రత్యేక సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: రాష్ట్రంలో మెగాసీడ్‌పార్కు ఏర్పాటును మరింత వేగవంతం చేసేందుకు వీలుగా ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మెగాసీడ్ పార్కు ఏర్పాటుపై సమీక్షను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను ఆర్థిక శాఖతో సంప్రదించి సిద్ధం చేయాలన్నారు. సాంకేతిక సలహా కమిటీకి ఇంటర్నేషనల్ సీడ్ యూనియన్ పార్టనర్‌గా, ఏన్జీ రంగా వర్సిటీ, వైఎస్సార్ హార్టికల్చర్ వర్సిటీ, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ విభాగం, ఎన్జీవోలు, రైతు ప్రతినిధులను సభ్యులుగా నియమించాలన్నారు. కంపెనీ చట్టం కింద రిజిస్టర్ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా ఉంటుందన్నారు. పెట్టుబడుల్లో రాష్ట్ర వాటా 51 శాతం ఉంటుందన్నారు. ఏన్జీరంగా వర్సిటీకి ఇచ్చిన 627 ఎకరాల్లో పరిపాలనా భవనాలు, పరిశోధన భవన నిర్మాణాలకు పోగా, మిగిలిన భూమిని వివిధ విత్తన సంస్థలకు పరిశోధనలకు వీలుగా స్థలాన్ని కేటాయించాలని సూచించారు. మెగా సీడ్ పార్కులో త్వరిగతిన పరిపాలనా భవనాలు,ప్రపంచ స్థాయి విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అయోవా వర్సిటీ సహకారం తీసుకోవాలన్నారు. పార్క్ సీఈఒగా ఐఎఎస్ స్థాయి అధికారిని నియమించే అంశంపై చర్చించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఈశ్వరిపై అనర్హత వేటు వేయండి అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీకి వైకాపా ఫిర్యాదు

విజయవాడ, డిసెంబర్ 13: వైకాపా తరపున గెలిచి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీకి ఆ పార్టీ బుధవారం ఫిర్యాదు చేసింది. వైకాపా ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్త్ఫా పార్టీ తరఫున పిటిషన్ అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా తరపున గెలిచి ఫిరాయించిన ఈశ్వరిపై అనర్హత వేటు వేయాలని, పోలవరం ప్రాజెక్టు నుంచి రాజధాని నిర్మాణం వరకూ అవినీతీకి పాల్పడుతూ, దోచుకున్న సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. 23 మందిపై అనర్హత పిటిషన్లు ఇచ్చామని, స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యసభలో ఒక ఎంపీ వేరే పార్టీ ర్యాలీలో పాల్గొంటేనే చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఇక్కడ సీఎం స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకుంటున్నా, చర్యలు లేవని ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొలిక్కిరాని సుబాబుల్ కొనుగోలు ధర

విజయవాడ, డిసెంబర్ 13: సుబాబుల్ కొనుగోలు ధర ఖరారు చేసేందుకు మంత్రుల బృందం సమావేశమైనప్పటికీ, అది కొలిక్కిరాలేదు. వెలగపూడి సచివాలయంలో సుబాబుల్ కొనుగోలు ధర ఖరారు చేసేందుకు రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఆదినారాయణ రెడ్డి, పేపర్ మిల్లుల ప్రతినిధులు బుధవారం సమావేశమయ్యారు. 2014 నాటి ధర ప్రకారం టన్నును 4400 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని పేపరు మిల్లు యాజమాన్యాల ప్రతినిధులను మంత్రులు కోరారు. అన్ని జిల్లాల్లో ఒకే ధరకు కొనుగోలు చేయాలన్నారు. అందుకు పేపరు మిల్లుల ప్రతినిధులు అంగీకరించలేదు. టన్నుకు 3000 రూపాయలతో పాటు 700 రూపాయలను కటింగ్, రవాణా చార్జీల కింద చెల్లించేందుకు ముందుకు వచ్చారు. కొనుగోలు ధర తగ్గించడాన్ని మంత్రులు అంగీకరించలేదు. ధర పెంచాల్సిందేనని స్పష్టం చేశారు.

‘సహకార’ సమస్యలు తీర్చండి మంత్రికి ఉద్యోగ సంఘాల వినతి

విజయవాడ, డిసెంబర్ 13: రాష్టవ్య్రాప్తంగా సహకార శాఖ సిబ్బంది ఉద్యోగుల కొరత, పని ఒత్తిడి, ఆపైన ఎన్నో రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు టివి ఫణి పేర్రాజు, ప్రధాన కార్యదర్శి భావనారుషి, ఇతర కార్యవర్గ సభ్యులు బుధవారం సచివాలయంలో రాష్ట్ర సహకార శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డిని కల్సి వివరించారు. జూనియర్ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో 50 శాతం అంటే 221 పోస్టులు ఎంతోకాలంగా ఖాళీగా ఉన్నాయని, అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్థాయిలో కూడా 127 పోస్టులు ఖాళీగా ఉన్నందున పదోన్నతుల ద్వారా తక్షణం వీటిని భర్తీ చేయాలన్నారు. ప్రధానంగా ఈ శాఖలో 60 శాతంపైబడి ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని, గ్రామాల్లో బయోమెట్రిక్ మిషన్ తరహాలో ఇతర కార్యాలయాల్లో అనుమతించడం లేదన్నారు. పైగా ఒకవేళ ఎక్కడైనా అనుమతించినా ఉదయం టూర్‌కు వెళ్లేముందు ఆ కార్యాలయాలు తెరవటం లేదన్నారు. అందుకే ఈ సాఫ్ట్‌వేర్‌లో టూర్ ఆప్షన్‌కి అనుమతివ్వాలని క్షేత్రస్థాయి సిబ్బంది తెలిపారు. గతంలో సంబంధిత సహకార సంఘాల నుంచి ప్రయాణ భత్యాలు తీసుకోటానికి అనుమతించేవారని అయితే 8 ఏళ్ల క్రితం ఈ విధానాన్ని తొలగించారు కానీ బడ్జెట్ కేటాయింపులు ఇవ్వలేదన్నారు. దానివల్ల తమ జీతాల నుంచి ఖర్చు చేయాల్సి వస్తున్నదన్నారు. టీఏ నిమిత్తం ప్రత్యేక బడ్జెట్‌ను ఇవ్వాలన్నారు. సొసైటీల ద్వారా గతంలో రూ.400 కోట్లు ఇచ్చే రుణాలు ప్రస్తుతం ఆరు వేల కోట్లకు చేరాయన్నారు. వీటి వ్యవహారాల నిమిత్తం శాఖాపరమైన ఆడిటర్లు ఆడిట్, అలాగే తరచు తనిఖీలు సెక్షన్ 51విచారణను నిర్వహించాల్సి ఉంటే తాజాగా ధాన్యం కొనుగోలు పర్యవేక్షణ అప్పగించడంతో తీవ్రమైన పనిఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. అందుకే వీటి పరిష్కారం నిమిత్తం త్వరలో సంఘ నేతలు ఉన్నతాధికారులతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఫణి పేర్రాజు కోరారు.
వైజాగ్ బే మారథాన్‌కు ఘనంగా ఏర్పాట్లు

విజయవాడ, డిసెంబర్ 13: విశాఖపట్నం సముద్రతీరాన ఈ నెల 23న ‘వైజాగ్ బే మారథాన్’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి ప్రైమ్ లైఫ్ స్పోర్ట్స్, దీప్ ట్రస్ట్ సంస్థలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆర్కే బీచ్ వద్ద సాయం సంధ్య సమయంలో జరుగనున్న మారథాన్‌లో పాల్గొనడానికి విశాఖ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రారంభించిన వెబ్‌సైట్ ద్వారా మంచి స్పందన వచ్చిందని తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు మారథాన్‌లో పాల్గొనడానికి తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు), 10కె, 5కె శ్రేణుల్లో ఈ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణే ప్రధానాంశంగా ఈ మారథాన్ నిర్వహిస్తున్నారు. విశాఖ ప్రజలు ఇటువంటి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ ఒక ఉద్యమంగా తీసుకెళ్తున్నారని రేస్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ మురళి నన్నపనేని వెల్లడించారు.
స్కీమ్ వర్కర్ల సమస్యలపై
జనవరి 17న దేశవ్యాప్త సమ్మె

విజయవాడ, డిసెంబర్ 13: స్కీమ్ వర్కర్ల సమస్యలపై జనవరి 17వ తేదీన దేశవ్యాప్త సమ్మెను నిర్వహించనున్నట్లు ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు తెలిపారు. దాసరి భవన్‌లో బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జార్ఖండ్ రాజధాని రాంచిలో ఈ నెల 9వ తేదీ నుంచి 11 వరకు ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా చేసిన నిర్ణయాలు, ఆమోదించిన తీర్మానాలను ఆయన వెల్లడించారు. స్కీమ్ వర్కర్లందరినీ కార్మికులుగా గుర్తించి కనీస వేతనంగా నెలకు రూ.18 వేలు చెల్లించాలనే డిమాండ్‌తో దేశవ్యాప్త సమ్మె చేయాలని సమావేశం నిర్ణయించిందన్నారు.
‘ఎయిడెడ్’జీతాల చెల్లింపు జీఓకు సవరణ

విజయవాడ, డిసెంబర్ 13: ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ప్రతి నెలా ఒకటో తేదీన జీతాల చెల్లింపునకు ఉద్దేశించిన జీఓ నెం.182కు సవరణ చేస్తూ జీఓ నెం.196ను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బుధవారం విడుదల చేశారు. డిసెంబర్ నెల జీతం జనవరి 2018 ఒకటో తేదీన చెల్లించేబడే విధంగా సవరణ జరిగింది.

ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించ లేదు
* మంత్రి పరిటాల సునీత

విజయవాడ, డిసెంబర్ 13: పరిటాల కుటుంబం ఫ్యాక్షనిజాన్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాము ప్రజల కోసం పని చేసే వ్యక్తులమన్నారు. జైలుకు వెళ్లివచ్చిన వారిని పక్కన పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడించడం సరికాదన్నారు. హంద్రీనీవా ద్వారా జిల్లాకు నీళ్లు రావడంతో రైతులు ఆనందంగా ఉంటే, జగన్ చూడలేకపోతున్నారన్నారు. జగన్‌కు, ఆయన కుటుంబానికి సీఎం కుర్చీ తప్ప మరో ధ్యాస లేదని విమర్శించారు. ఆయన పార్టీ జెండా మరిచిపోకూడదని పాదయాత్ర చేస్తున్నారన్నారు. పాదయాత్ర అంటే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తూ చేసేది కాదన్నారు. తమ నేత చంద్రబాబు, జగన్ నాన్న వైఎస్ నిర్విరామంగా చేసిందే పాదయాత్రన్నారు.

రక్షణ శాస్తవ్రేత్త టెస్సీ థామస్‌కు పిన్నమనేని పురస్కారం
* స్వచ్చ చల్లపల్లికి గ్రామప్రగతి అవార్డు * ఈ నెల 16వ విజయవాడలో ప్రదానం
విజయవాడ (బెంజిసర్కిల్), డిసెంబర్ 13: వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలకు ప్రతీఏటా ఇచ్చే డాక్టర్ పిన్నమనేని, సీతాదేవి ఫౌండేషన్ పురస్కారం ఈ ఏడాది టెన్సీ థామస్‌కు దక్కింది. అలాగే స్వచ్ఛ భారత్ ఉద్యమానికి స్ఫూర్తినింపుతున్న గ్రామప్రగతి పురస్కారం కృష్ణాజిల్లాలోని చల్లపల్లి గ్రామాన్ని వరించింది. ఈనెల 16వ తేదీన ఈ పురస్కారాలను అందించనున్నారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ మినీ ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అవార్డు వివరాలను ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావుప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో ప్రసిద్ధ వైద్యునిగా సేవలందించిన డాక్టర్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఆయన సహధర్మచారిణి సీతాదేవి పేరుపైన ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక, కళారంగాలలో విశిష్ఠ సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలను అందించి గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రక్షణశాఖకు చెందిన ప్రముఖ శాస్తవ్రేత్త టెస్సీ థామస్‌కు పురస్కారం అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఫౌండేషన్ తరుపున ఇచ్చే గ్రామప్రగతి పురస్కారాన్ని ఈ ఏడాది స్వచ్చ చల్లపల్లి ఉద్యమానికి గాను చల్లపల్లి గ్రామానికి అందిస్తున్నామన్నారు. ఉద్యమ ప్రతినిధులుగా డాక్టర్ డీఆర్కే ప్రసాద్, పద్మావతి దంపతులు పురస్కారాన్ని అందుకుంటారని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అడ్వాన్స్ సిస్టమ్స్ లాబొరేటరీ డైరెక్టర్‌గా పని చేస్తున్న టెస్సీ థామస్ భారత మిసైల్ వ్యవస్థకు అవసరమైన ఆధునిక మార్గదర్శక వ్యవస్థను రూపొందించారని తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానం కోసం మన దేశం అగ్రరాజ్యాలపై ఆధారపడే స్థితి నుంచి బయటకు తీసుకు వచ్చినట్లు తెలిపారు. గత 16 సంవత్సరాలుగా అమె సుమారు 25కు పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి బహుమతులను అందుకున్నట్లు తెలిపిన ఆయన అగ్నిపుత్రి, మిసైల్‌వుమన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదిన ఈ రెండు పురస్కారాలను విజయవాడలో నిర్వహించే ప్రత్యేక కార్యాక్రమంలో అందించనున్నట్లు నాగేశ్వరరావు వివరించారు.