ఆంధ్రప్రదేశ్‌

జన్మభూమిలో ‘పుష్కర’ స్ఫూర్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 3: ‘ ఐదో విడత జన్మభూమి - మా ఊరు తొలి రోజు విజయవంతమయ్యింది. ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం స్ఫూర్తిదాయకం. గ్రామ, వార్డు సభల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలి, కృష్ణా పుష్కరాల్లో 90 శాతం సంతృప్తి సాధించాం, జన్మభూమిలో కూడా అదే స్ఫూర్తి కనిపించాలి, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా, సమర్థంగా పని చేయాలి, మన అంకితభావంతోనే ప్రజల్లో సానుకూలత సాధ్యం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం తన నివాసం నుంచి రెండవరోజు జన్మభూమిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జన్మభూమి నిర్వహణపై గ్రామాలు, వార్డులకు రోజువారీ గ్రేడింగ్‌లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాసేవలో పోటీతత్వం పెంచేందుకే జన్మభూమి గ్రేడింగ్‌లు ఇస్తున్నామన్నారు. రోజువారీ నివేదికలు వెంటనే పంపించాలని ఆదేశించారు. నివేదికలు సకాలంలో పంపినందుకు 40 శాతం, గ్రామ స్థాయిలో సర్వేకు 40 శాతం, జిల్లా స్థాయిలో సెంటిమెంట్ అనాలిసిస్‌కు 20 శాతం మార్కులు ఇస్తున్నట్లు తెలిపారు. తొలిరోజున విజయనగరం, కడప, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలు ఏ గ్రేడ్ సాధించినట్లు వెల్లడించారు. నెల్లూరు, విశాఖ, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లాలు బి గ్రేడ్ వచ్చిందన్నారు. అన్ని జిల్లాలు ఏ గ్రేడ్ వచ్చేలా పోటీపడాలని దిశానిర్దేశం చేశారు. నకరికల్లు, తిక్కవోలు, కొత్తపల్లి, అమలాపురం, పెందుర్తి తదితర మండలాలు ఏ గ్రేడ్ సాధించాయంటూ, అదే విధంగా కొత్తపల్లి, అశ్వాపురం, నక్కపల్లి, ఎగువ తంబళ్లపల్లి గ్రామాలు ఏ గ్రేడ్‌లో ఉన్నాయని తెలిపారు. మిగిలిన మండలాలు, గ్రామాలు కూడా ఏ గ్రేడ్ సాధించాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. గ్రామ, వార్డు సభలు ప్రశాంతంగా, పూర్తి క్రమశిక్షణతో జరపాలన్నారు. ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్ధికేతర ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని, ఆర్ధికపరమైనవి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని సూచించారు. జమాబందీ తరహాలో ఫిర్యాదుల పరిష్కారం శరవేగంగా జరగాలన్నారు. ‘గ్రామాలు, వార్డులు అత్యత్తమంగా రూపొందాలి, అత్యున్నత సమాజం ఏర్పడాలి. 16వేల గ్రామాలు, వార్డుల్లో జరిగే అతి పెద్ద సామూహిక ప్రజాసేవా కార్యక్రమం జన్మభూమి. ప్రజా సంతృప్తే అభివృద్ధి, సంక్షేమం, అధికారుల పనితీరుకు కొలమానం. 80 శాతం సంతృప్తే లక్ష్యంగా పని చేయాలి. ప్రజల్లో అవగాహన, పోటీతత్వం పెంచడం మనందరి బాధ్యత. అత్యున్నత జీవన ప్రమాణాలున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. అర్హులు అందరికీ పింఛన్లు సకాలంలో అందుతున్నాయా? రేషన్ సకాలంలో అందుతోందా? అర్జీల పరిష్కారం బాగుందా, లేదా? చంద్రన్న బీమా మీ గ్రామంలో అమలు అవుతుందా, లేదా? ఉచిత వైద్య శిబిరాలు, పశు వైద్య శిబిరాల్లో సేవలు బాగున్నాయా, లేదా? వివిధ అంశాలపై జన్మభూమి అధికారులు అవగాహన కల్పిస్తున్నారా, లేదా? అనే అంశాలపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి తెలిపారు. గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో తొలిరోజున ప్రజల్లో 70 నుండి 80 శాతం సంతృప్తి వచ్చిందని, అనంతపురం, విశాఖపట్నం, కడప, కర్నూలు జిల్లాల్లో 60 నుండి 70 శాతం సంతృప్తి వ్యక్తమైందని చెప్పారు. 80 శాతం సంతృప్తే లక్ష్యంగా పని చేయాలని మార్గదర్శకం చేశారు. సాధికారమిత్రులు, జన్మభూమి కమిటీలు, స్థానిక సంస్థల ప్రతినిధుర అభిప్రాయాలు కూడా తీసుకోవాలని సూచించారు. సాధికారమిత్రలను విలేజ్ రిసోర్స్ పర్సన్స్‌గా వినియోగించుకోవాలన్నారు. సాధికార మిత్రుల పనితీరును ఎప్పటికప్పుడు విశే్లషిస్తున్నామన్నారు. తినే తిండి, తాగేనీరు, పరిసరాల పరిశుభ్రత, జీవన విధానంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా మందుజాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహారంలో పోషక విలువలు పెంచుతున్నామన్నారు. శారీరక వ్యాధులు చాలా వరకు నియంత్రిస్తున్నామంటూ మానసిక వ్యాధులను ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారానే అధిగమించగలమని తెలిపారు. టెలికాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సంక్షేమ, ప్రణాళికా శాఖ, రియల్ టైం గవర్నెన్స్, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలనా సంస్థల అధికారులు ఎస్‌ఎస్ రావత్, సంజయ్ గుప్తా, అహ్మద్ బాబు, రామాంజనేయులు, కృష్ణమోహన్ తదితరులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.