ఆంధ్రప్రదేశ్‌

పార్టీకి ‘పశ్చిమ’ పరేషానీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 3: పార్టీకి పెట్టనికోట వంటి జిల్లాల్లో నేతల మధ్య పెరుగుతున్న అంతర్గత కలహాలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి శిరోభారంగా పరిణమించాయి. ముఖ్యంగా ప్రతిపక్షానికి ఒక్క సీటు కూడా దక్కనివ్వకుండా, పార్టీకి తిరుగులేని మెజారిటీ అందించిన పశ్చిమ గోదావరి జిల్లాలో పెరుగుతున్న ముఠా తగాదాలు పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు తలనొప్పిలా మారాయి. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడం పార్టీకి ఇబ్బందిగా మారింది. టీడీపీ నాయకత్వానికి ముఠా తగాదాల ముప్పు ఏర్పడింది. అంతా కలసికట్టుగా పనిచేయాలని, వర్గ విబేధాలు పక్కకుపెట్టి మళ్లీ ఆయా జిల్లాల్లో పార్టీ గెలిచేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్న అధినేత ఆదేశాలు అమలవుతున్నట్లు కనిపించడం లేదు. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు తమ పాత అలవాట్లు మార్చుకోకపోవడం పార్టీకి తలనొప్పిలా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీడీపీ చరిత్రలో తొలిసారి మంత్రిపై సొంత పార్టీ నేతలే పోలీసు కేసు పెట్టడం సంచలనం సృష్టించింది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కొత్తగా తొలిసారి మంత్రివర్గంలో చేరిన జవహర్, ఇటీవలి కాలంలో వివాదాలకు కేంద్రబిందువవుతున్నారు. చాగల్లు జడ్పీటీసీ విక్రమాదిత్య వర్గానికి, జవహర్ వర్గానికి జరుగుతున్న అధిపత్యపోరు పార్టీని రోడ్డున పడేయడం పార్టీ శ్రేణులను కలచివేసింది. జవహర్ వర్గీయులు మరో వర్గానికి చెందిన పార్టీ సహచరులపై చేయి చేసుకోవడం, అది చివరకు మంత్రిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసే వరకూ వెళ్లడం సంచలనం సృష్టించింది. రెండు వర్గాలు ఒకరికొకరు అనుకూల-వ్యతిరేక నినాదాలతో ర్యాలీలు నిర్వహించడం నాయకత్వానికి ఆగ్రహం తెప్పించింది. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి, సీనియర్ నేత పీతల సుజాతకు మళ్లీ సొంత నియోజకవర్గంలో సమస్యలు మొదలయ్యాయి. మంత్రి పదవి పోయినా ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయకుండా, నియోజకవర్గానికే పరిమితమయి పార్టీ అభివృద్ధిపై దృష్టి పెట్టిన పీతలకు ఎంపీ వర్గీయుల నుంచి అవమానాలు ఎదురవడంపై దళితుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రిగా ఉన్నప్పటి నుంచీ ఆమెను పనిచేసుకోనీయకుండా, ఆమె నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్న ఎంపీ మాగంటి బాబు తీరుపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, నాయకత్వం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి పీతల అనుచరుల్లో ఉంది. తాజాగా సుజాతకు సమాచారం లేకుండానే ఎంపీ కామవరపుకోటలో జరిగిన జన్మభూమి గ్రామసభకు హాజరవడంపై పీతల మనస్తాపం చెందారు. దీనిపై ఆమె ఇన్చార్జి మంత్రి పుల్లారావు, జిల్లా మంత్రి పీతాని సత్యనారాయణ, పార్టీ కార్యాలయ కార్యదర్శి, సమన్వయకర్త టిడి జనార్దన్‌రావుకు ఫిర్యాదు చేసి, తనకు విలువ ఇవ్వకుండా అవమానించిన వైనాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లి ఒక దళిత మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆవేదన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పీతల ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంతోపాటు, పశ్చిమ గోదావరి జిల్లాలోని మరో మూడు నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన కమ్మ సామాజికవర్గ నేతలే గత మూడేళ్ల నుంచీ జోక్యం చేసుకుంటున్న వైనం మిగిలిన వర్గాలకు ఆగ్రహం కలిగిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా ఉండటంతో, ఆ వర్గ నేతలు ఎమ్మెల్యేలయినా, మంత్రులనయినా లెక్కచేయకుండా సమాంతర అధికారాలు చెలాయిస్తున్నారన్న ఆరోపణలున్నా, నాయకత్వం ఇప్పటివరకూ దానిపై దృష్టి సారించకపోవడం అసంతృప్తికి గురిచేస్తోంది. దీనిపై ఇన్చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు అంటీముట్టనట్లు వ్యవహరించడమే కాకుండా, ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు మిగిలిన సామాజికవర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కాగా, అటు కర్నూలులో ఇద్దరు నేతల మధ్య ఇప్పటినుంచే కర్నూలు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేచింది. వచ్చే ఎన్నికల్లో ఆ సీటు వంద శాతం తనకే వస్తుందని ఎంపి టి.జి.వెంకటేష్ తనయుడు భరత్ బహిరంగంగా మీడియాకే చెబుతున్నారు. అయిత తాను ఏ నియోజకవర్గానికి మారే ప్రసక్తి లేదని, మళ్లీ ఇక్కడ నుంచే పోటీ చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఎదురుదాడి చేస్తున్నారు. వీరిద్దరి మాటల యుద్ధానికి ప్రభుత్వ కార్యక్రమాలో, మీడియా భేటీలో వేదిక అవుతున్నాయి. ఇక తొలి నుంచీ పార్టీకి తలనొప్పిలా మారిన అనంతపురం జిల్లా వ్యవహారంలో.. తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యాలు మితిమీరుతున్నాయంటూ సొంత పార్టీ నేతలే బుధవారం రోడ్డెక్కి ధర్నా చేయడం సంచలనం సృష్టించింది. పార్టీ కార్యకర్త శేఖర్‌కు చెందిన అన్నా ట్రాన్స్‌పోర్టులో జెసి వర్గీయులు విధ్వంసం సృష్టించిన ఫలితంగా కారు, లారీ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం అయిన వైనం పార్టీలో రచ్చకు కారణమయింది. జెసి వర్గీయుల దాడికి నిరసనగా టీడీపీ కార్యకర్తలతో కలసి స్థానిక నేతలు కాకర్ల రంగనాధ్, జయరామిరెడ్డి పోలీసుస్టేషన్ వద్ద బైఠాయించి, జెసిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పార్టీ పరువు రోడ్డెక్కినట్టయింది. ఇప్పటికే జెసి-ప్రభాకర్‌చౌదరి మధ్య విబేధాలు రచ్చకెక్కగా, తాజాగా తాడిపత్రి కేంద్రంగా తలెత్తిన ఈ గొడవ నాయకత్వానికి ఇబ్బందిగా మారింది. ‘ఇలాంటి పరిస్థితికి కారకులైన వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేసిన నాయకత్వానిదే ఈ తప్పంతా. ఒకసారి ఒకరిపై చర్యలు తీసుకుంటే మిగిలినవారు దారికొస్తారు. నంద్యాల-కాకినాడ ఎన్నికల విజయం తర్వాత పార్టీ తిరిగి కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న ధీమా, నమ్మకాన్ని ఇలాంటి చర్యలు దెబ్బతింటాయి. ఒకరిని చూసి మరొకరు రోడ్డెక్కితే అది వైసీపీకి లాభం కలిగిస్తుంది. మా సార్ కూడా ఇక చర్యల విషయంలో మాటలు కాకుండా చేతల్లో చూపిస్తేనే పార్టీ పేరు నిలుస్తుంద’ని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.