ఆంధ్రప్రదేశ్‌

కులాలపై ‘దేశం’ కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 22: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందస్తు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా అత్యంత కీలకమైన కులాల ఓట్లపై కనే్నశారు. 2004నాటి మాదిరిగా తన ప్రభుత్వాన్ని దింపేయాలన్నంత కసి, పట్టుదల ఏ వర్గంలోనూ ఇప్పుడు లేకపోవడం, గత ఎన్నికల్లో కేవలం ఐదున్నర లక్షల ఓట్ల తేడాతోనే ప్రభుత్వంలోకి వచ్చిన వైనాన్ని విశే్లషించుకున్న బాబు.. ఇప్పుడు కులాలకు చేరువయ్యే పనిలో ఉన్నారు. ఆ మేరకు పార్టీకి చెందిన ఆయా కుల నేతలను ఇప్పటినుంచే జనక్షేత్రంలో దించుతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా మారిన వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరతామని, అయితే మెజారిటీనే ముఖ్యమని బాబు ఇటీవలి కాలంలో తరచూ చెబుతున్నారు. అందులో భాగంగా కులాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. అందుకే ఇటీవలి కాలంలో, ఓసీల నుంచి బీసీల వరకూ ఎస్సీల నుంచి ఎస్టీల వరకూ అన్ని కులాలకు ప్రయోజనాలు కల్పించే కార్యక్రమాలు, పథకాలపై దృష్టి సారిస్తున్నారు. ఎన్టీఆర్ హయాం నుంచీ టీడీపీని సంప్రదాయకంగా వ్యతిరేకించే బ్రాహ్మణ సామాజిక వర్గం, గత ఎన్నికల్లో బాబు నాయకత్వంలోని టీడీపీ వైపు మొగ్గుచూపింది. దానితో తాను అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. సీఎం అయిన తర్వాత వారి కోసం 500 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఆ సామాజికవర్గంలో ఇతర పార్టీలకు చెందిన వారు కూడా టీడీపీలో చేరుతున్న పరిస్థితి నెలకొంది. ‘ఇప్పుడు రాష్ట్రంలో బ్రాహ్మణుల్లో మెజారిటీ శాతం టీడీపీవైపే ఉన్నారు. కార్పొరేషన్‌తో వారి జీవన స్థితి మారింది. అంతా స్కాలర్‌షిప్పులతో చదువుకుంటున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంతకుమించి ఏ బ్రాహ్మణుడైనా ఏం ఆశిస్తార’ని గుంటూరు టీడీపీ బ్రాహ్మణ నేత సిరిపురపు శ్రీ్ధర్ ప్రశ్నించారు. అదేవిధంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీని కాదని తనకు జైకొట్టిన కాపులను మెప్పిస్తూ వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటుచేశారు. దానితో టీడీపీని సంప్రదాయకంగా వ్యతిరేకించే కాపులు మొత్తం కాకపోయినా, దాదాపు 60 శాతంపైగా కాపు వర్గం ప్రస్తుతం టీడీపీకి మద్దతునిస్తోంది. ఆ వర్గం శాసించే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయభేరి మోగించడమే దానికి నిదర్శనమంటున్నారు. గత ఎన్నికల్లో దన్నుగా నిలిచిన కాపు ఓటు బ్యాంకును శాశ్వతం చేసుకునేందుకు, వారిని బీసీల్లో చేర్చుతూ ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపారు. ఈ చర్యలతో.. ప్రతిసారి వ్యక్తిగతంగా బాబును, సంస్థాగతంగా టీడీపీని వ్యతిరేకించే కాపు ఉద్యమ నేత ముద్రగడ కూడా బాబుకు కృతజ్ఞతలు ప్రకటించాల్సిన అనివార్యత ఏర్పడింది. ‘బాబుకు కాపులు జీవితాంతం రుణపడి ఉంటారు. ఏ సీఎం చేయనివిధంగా మమ్మల్ని బీసీలో చేర్చుతూ తీర్మానించారు. గతంలో కాంగ్రెస్ మమ్మల్ని వాడుకుని, టీడీపీకి వ్యతిరేకంగా ఉసికొల్పింది. ఇప్పుడు కాపుజాతి నిజాలేమిటో గ్రహించింద’ని కాపునేత చందు సాంబశివరావు వ్యాఖ్యానించారు. తాజాగా బీసీ, ఎస్సీలపై బాబు దృష్టి సారించారు. బాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు విజయవంతమైన ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తూ తాజాగా క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో జనాభాపరంగా అత్యధికంగా ఉన్న బీసీలను మెప్పించే ఈ నిర్ణయం ఖరీదు 400 కోట్లు. దీనివల్ల రెండున్నర లక్షల మంది బీసీలు లబ్ధిపొందనున్నారు. గ్రామాల్లో ఎక్కువగా ఉండే గొర్రెలు, పశువుల పెంపకందారులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చేనేత, బంగారం, వడ్రంగి, రజక, నారుూ బ్రాహ్మణులు వంటి 124 బీసీ కులాల వారికి ఈ పథకం వర్తించనుంది. ఆ రకంగా ఆ వర్గాలను గంపగుత్తగా ఆకట్టుకునే రాజకీయ ఎత్తుగడకు బాబు తెరలేపారు. ఇక బీసీల తర్వాత జనాభాపరంగా ఎక్కువగా ఉన్న దళితుల విషయంలో బాబు ప్రత్యేక రాజకీయ వ్యూహంతో వెళుతున్నారు. వారిని వైసీపీ నుంచి మానసికంగా దూరం చేసే కార్యక్రమాలకు పదునుపెడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత మాలల సంఖ్య ఎక్కువ, మాదిగల సంఖ్య వారికంటే నాలుగున్నర లక్షలు తక్కువైన నేపథ్యంలో.. గత ఎన్నికల ముందు వైకాపాకు జైకొట్టిన మాల వర్గాన్ని ముందుగా దరిచేర్చుకునే వ్యూహానికి తెరలేపారు. అందులో భాగంగా వైకాపాలో ఉన్న మాల నేతలను పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్చుకుని వారికి కార్పొరేషన్ చైర్మన్, పార్టీ పదవులు ఇచ్చారు. దానితో మాలలు సంప్రదాయకంగా వైకాపాకు మానసిక మద్దతుదారులన్న ముద్రను చెరిపేసి, వారిని టీడీపీ వైపు మళ్లించే బాధ్యతను మాల నేతలు భుజానెత్తుకునే పరిస్థితి ఏర్పడింది. విభజనకు ముందు వరకూ మాలలు కాంగ్రెస్, మాదిగలు టీడీపీలో కొనసాగుతున్న పరిస్థితి ఉండేది. విభజన తర్వాత పరిస్థితి మారడంతో పార్టీ మాలలను ఆకర్షించి, మాదిగలను విస్మరిస్తోందన్న అసంతృప్తి పార్టీలోని మాదిగల్లో పెరిగింది. దాన్ని గమనించిన బాబు కార్పొరేషన్లు, పార్టీ పదవుల్లో వారికీ స్థానం కల్పించారు. ఒకదశలో ఆ వర్గానికే పార్టీ ఏపీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్న చర్చ కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ మాదిగలకు రాజ్యసభ ఇవ్వని నేపథ్యంలో, వచ్చే ఎన్నికల్లో ఆ వర్గానికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా, మాదిగలను పూర్తిస్థాయిలో సంతృప్తిపరిచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, 26 నుంచి అంబేద్కర్ జయంతి నాడు ఏప్రిల్ 14 వరకూ రాష్ట్రంలో ఉన్న మాల, మాదిగ పల్లెల్లో పార్టీ నేతలు పర్యటించి, ప్రతి ఇంటి తలుపు తట్టే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మూడు నెలల పాటు ప్రతి ఒక్క నేత దళితవాడల్లో కార్యక్రమాలు నిర్వహించి, మండల-నియోజకవర్గ-జిల్లా స్థాయిలో సభలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో బాబు జన్మదినం రోజు లక్షమందితో దళిత మహాసభ నిర్వహించడం ద్వారా, టీడీపీ దళితులదేనన్న మానసిక భావన తీసుకువచ్చే కార్యక్రమాలు రూపొందించారు. ‘దళితవాడల్లో కేవలం మా పార్టీ దళిత నేతలే కాదు. పార్టీకి చెందిన అన్ని స్థాయిల వారు పర్యటించి, వారికి పార్టీ ఏమేమి ప్రయోజనాలు కల్పించిందో వివరిస్తాం. మిగిలిన పార్టీలు వారిని ఓటుబ్యాంకుగా ఎలా మార్చుకుంటున్నాయో అర్థమయ్యేలా చెబుతాం. ప్రధానంగా దళితులు ఆరాధించే అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఎలా అవమానించిందో, మా పార్టీ ఏవిధంగా గౌరవించిందో వాడవాడలా స్పష్టం చేస్తా’మని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వివరించారు. ఇవికాకుండా రానున్న ఎన్నికల నేపథ్యంలో, జిల్లాల స్థాయిలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను ఈ నెలాఖరులోగా భర్తీ చేయాలని తాజా క్యాబినెట్‌లో నిర్ణయించడం ద్వారా, దళిత నిరుద్యోగ వర్గాలకు చేరువయ్యే ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో చాలాకాలం నుంచీ పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను సగానికి పెంచుతూ క్యాబినెట్ నిర్ణయించింది.
దీనివల్ల పదిన్నర కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయం వేలాది మంది తాత్కాలిక ఉద్యోగులను చేరువ చేస్తుందన్న ధీమా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.