Others

పరమత సహనమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరస్పర గౌరవమా?
‘సహనానికి ఆంగ్లంలో వాడే ‘టాలరెన్స్’ పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. ఇది ఒకరిని సహించడం లేదా భరించడం అనే అర్థాన్నిస్తుంది. పరస్పర గౌరవం, సహకారం అన్న అర్థాలని ఇది సూచించదు.

మత విశ్వాసాలకు సంబంధించిన చర్చా కార్యక్రమాలు జరుగుతున్నపుడు ఇతర మత విశ్వాసాల పట్ల ‘సహనం’ లేదా ‘అసహనం’ అనే పదాలను ప్రయోగించడం సర్వ సాధారణమైంది. ఆ పదాలను వాడడం ఇపుడు గొప్పగా భావిస్తున్నారు. ఒకరి పట్ల సహనం వహించడం గొప్ప విషయమే. నిజానికి మనం ఒకరి పట్ల సహనం వహిస్తున్నామంటే వారిపట్ల మనలో గౌరవం వుందని కాదు. ఏ భార్య కూడా భర్త తనని సహిస్తున్నాడు, భరిస్తున్నాడు అంటే సంతోషించదు. ఆత్మగౌరవం వున్న ఏ ఉద్యోగి కూడా సహోద్యోగులు తనని సహనంతో భరించడాన్ని అంగీకరించలేడు.
వాస్తవానికి మనం ఎవరి పట్ల సహనం వహిస్తాం? మనలో ఎవరిపట్ల తక్కువ భావం, అయిష్టత ఉందో వారిపట్ల సహనం వహిస్తూంటాం సమాజంలో సభ్యత కోసం. నిజానికి ఈ సభ్యత పైపూత మాత్రమే, మనలో సహజంగా ఉన్నది కాదు. సభ్యత కోసం బలవంతంగా తెచ్చిపెట్టుకున్న సహనం మత విశ్వాసాల విషయంలో నేడు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇతర మత విశ్వాసాల పట్ల ఇలా ‘బలవంతపు సహనం’ వహించడం సరికాదు. అన్ని మతాల వారూ పరస్పరం సహజ గౌరవభావంతో మెలగడం కావాలి.
అసలు ‘పరమత సహనం’ అన్న భావన ఎక్కడి నుంచి వచ్చింది? ఐరోపాలో వ్యాపించిన క్రైస్తవ మతంలో వివిధ సంప్రదాయాలున్నాయి. క్రైస్తవ మతానికి చెందినవారే అయినా వారిలో ఒకరంటే ఒకరికి పడదు. ఎవరికి వారు తమ విశ్వాసమే నిజమైనదనీ, తమదే నిజమైన చర్చి అనీ, ఇతరులవి అబద్ధపు మతాలనీ భావించేవారు. వారి మధ్య శతాబ్దాల తరబడి యుద్ధాలే జరిగాయి. పరస్పర హింసాకాండను అణచివేయడానికి ‘సహనం’ అనేది ఐరోపా దేశాలలో ఒక రాజకీయ అవసరమైంది. ఆ అవసరం కొద్దీ పుట్టుకొచ్చినదే ‘పరమత సహనం’ భావన. ఒకరి విశ్వాసాల పట్ల మరొకరికి గౌరవభావం సహజంగా పుట్టుకొచ్చింది కాదు. ఇతర విశ్వాసాల పట్ల ఐరోపా వారిలోని సహనం బాహ్య వ్యక్తీకరణ మాత్రమే. ఈ కృత్రిమమైన ‘పరమత సహనం’ వారి మధ్య ఎప్పుడైనా బద్దలు కావచ్చు. ఇప్పటికీ ప్రపంచంలో పలుచోట్ల ‘పరమత సహనం’ అన్నది ఏదో అవసరం కోసం బలవంతంగా తెచ్చిపెట్టుకున్న బాహ్య వ్యక్తీకరణే అవుతోంది. వివిధ విశ్వాసాల వారి మధ్య సహనం కాదు, పరస్పర గౌరవం ఉండాలి. ఇప్పటిదాకా పైపై సహనపు మెరుగులకే అలవాటు పడిపోయినవారిలో పరస్పర గౌరవం పట్ల అవగాహన కలిగించడం చాలా కష్టమైన పనే!
హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులలో వివిధ విశ్వాసాల విషయంలో ‘పరస్పర గౌరవానికి’ సహజంగానే ఆమోదం వుంది. ఎటొచ్చీ అబ్రహామిక్ మతాలకు చెందినవారే దీనిపట్ల తమ విముఖతను వ్యక్తం చేస్తున్నారు. 2000లో ఐక్యరాజ్యసమితి ‘సర్వమత సదస్సు’ను (మిలీనియం రెలిజియన్ సమ్మిట్) నిర్వహించింది. శ్రీ దయానంద సరస్వతి నాయకత్వంలో హిందూ ధర్మ ప్రతినిధులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాల అధికారిక పత్రంలో ‘పరమత సహనం’కు బదులుగా ‘పరస్పర గౌరవం’ అన్న పదాన్ని పేర్కొనాలని దయానంద సరస్వతి స్వామి సూచించారు. ‘వాటికన్’ ప్రతినిధులకు నేతృత్వం వహించిన కార్డినల్ జోసెఫ్ రాత్జిర్ (తరువాతి కాలంలో ఈయన పోప్ బెనడిక్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.) దీనిపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తాము అనాగరికమని భావించే మతాలనూ, ఆ మతానుయాయులనూ గౌరవించాల్సిన పరిస్థితే వస్తే- తాము చేసే మతమార్పిడి కార్యకలాపాలను ఎలా సమర్ధించుకోగలమన్నదే క్రైస్తవుల ఆందోళన. అందుకే వారు ఇతర మత విశ్వాసాలను ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరవించరన్న ఆరోపణ ఉంది.
వివిధ మత విశ్వాసాలకు చెందినవారి మధ్య పరస్పర గౌరవం వుండాలన్న దయానంద సరస్వతి సూచన ‘సర్వమత సదస్సు’లో పెద్ద దుమారానే్న లేపింది. అబ్రహామిక్ మతాలకు చెందినవారు సదస్సులో తమకు సరైన గౌరవం ఇవ్వాలని తూర్పు ఆసియా మతాల (అబ్రహామిక్ మతాలకు చెందని) వారిని గట్టిగా కోరారు. ఆఖరి నిమిషంలో వాటికన్ ప్రతినిధులు ముందుకు వచ్చి ‘పరస్పర గౌరవం’ విషయంలో తమ ఆమోదాన్ని తెలిపారు. సదస్సు ముగిసిన నెలరోజుల్లోనే వాటికన్ ‘అన్య మతస్తులు భగవంతుని దయకు పాత్రులు అయినప్పటికీ, చర్చిద్వారా మాత్రమే వారికి మోక్షం లభిస్తుంది’ అని తమ ఆలోచనా విధానాన్ని ప్రకటిస్తూ ఒక పత్రాన్ని విడుదల చేసింది. దీనిని చాలామంది స్వేచ్ఛావాద క్రైస్తవులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, వాటికన్ అధికారిక ప్రకటనలో మాత్రం ఏ మార్పూ కానరాలేదు.
క్రైస్తవులలోనే కాదు, ముస్లింలలో కూడా స్వేచ్ఛావాదులు ఉన్నారు. పాకిస్తాన్ వంటి దేశాలకు చెందిన స్వేచ్ఛావాద ముస్లింలు కూడా ‘పరమత సహనం కన్నా పరస్పర గౌరవం ముఖ్యం’ అన్న భావనతో ఏకీభవిస్తున్నారు. మతం మారవలసిన అవసరం లేకుండానే ఒకరి విశ్వాసాన్ని ఒకరు గౌరవించుకోవాలన్న భావన పట్ల వారిలో ఇంకా పూర్తి అవగాహన రావాలి. అమెరికాలోని అట్లాంటాకు చెందిన ఎమొరీ యూనివర్సిటీ వివిధ మతాల మధ్య సామరస్య సాధనకు 2007లో ‘ఇంటర్ రెలిజియస్ కౌన్సిల్’ ఏర్పాటు చేసింది. ఈ యూనివర్సిటీకి ఒక మహిళా లూథరన్ చర్చి మినిస్టర్‌ని ‘డీన్ ఆఫ్ ది చాపెల్ అండ్ రెలిజియస్ లైఫ్’గా నియమించారు. కానీ, లూథరన్ సంప్రదాయ గ్రంథాలు ఇతర మత విశ్వాసాల పట్ల కేవలం సహనానే్న కాకుండా గౌరవాన్ని కూడా ప్రకటిస్తున్నాయా? అన్న విషయంపై ఆమె వద్ద స్పష్టత లేదు. పరస్పర గౌరవం చాలా ముఖ్యమైనదనీ, దీనిపై అందరూ దృష్టి పెట్టాలన్న విషయంతో తానూ ఏకీభవిస్తానని ఆమె అన్నారు. ఒకపక్క లూథరన్ చర్చి మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క అందుకు విరుద్ధమైన ఆలోచనల గురించి ప్రజలకు వివరించి చెప్పాల్సి రావడం ఆమె ముందున్న సంక్లిష్ట పరిస్థితి. నిజానికి జీసస్ వల్ల మాత్రమే విముక్తి సాధ్యం అని బోధించే క్రైస్తవానికి ‘వివిధ విశ్వాసాల మధ్య పరస్పర గౌరవం’ అన్నది ఒక పెద్ద సవాలు.
హిందువులు త్రిమూర్తులను భక్తితో ఆరాధిస్తారు. భగవంతుని వివిధ అవతారాలను విశ్వసిస్తారు, పూజిస్తారు. క్రైస్తవం దేవుని పురుష స్వరూపంగానే విశ్వసిస్తుంది. హిందువులు దైవాన్ని స్ర్తి రూపంగా, శక్తిరూపిణిగా కూడా ఆరాధిస్తారు. ఈశ్వరుణ్ణి అర్ధ నారీశ్వర స్వరూపంగానూ ఆరాధిస్తారు. హిందూత్వంలో ఎవరికి నచ్చిన దేవతా స్వరూపాన్ని వారు ఆరాధించుకోవచ్చు. దైవం పట్ల హిందువుల భావనలను అసత్యాలంటోంది క్రైస్తవ మతం. ఆరాధనా వైవిధ్యాన్ని స్వాగతిస్తూ సర్వమత సమభావనను బోధించే హిందుత్వ ఆలోచనలతో ఏకీభవించడం ఆ లూథరన్ చర్చి మినిస్టర్‌కి అసాధ్యమైనదే!
క్రైస్తవులలో చాలా కొద్దిమంది మాత్రమే- ‘వివిధ మత విశ్వాసాల వారు పరస్పర గౌరవం కలిగివుండడం’ పట్ల ఆమోదాన్ని తెలుపుతున్నారు. జనేట్ హాగ్ అలాంటివారిలో ఒకరు. ఈమె ప్రిన్స్‌టన్ నుంచి వెలువడే వివిధ మత విశ్వాసాలకు చెందిన ‘సేక్రెడ్ జర్నీ’ అనే పత్రికకు సంపాదకురాలు. వివిధ మత విశ్వాసాలకి చెందినవారు పరస్పరం గౌరవించుకోవడం గురించి రాస్తూ ఆమె తన సంపాదకీయంలో ఇలా అంటారు- ‘సహనానికి, గౌరవానికి మధ్య ఎంతో వ్యత్యాసం వుంది. ప్రపంచంలో శాంతి అవగాహన నెలకొల్పే ప్రయత్నంలో మనం ఒకరి పట్ల ఒకరు సంయమనం పాటించడం, సహనాన్ని కలిగివుండడం వద్దనే ఆగిపోతున్నాం. అన్ని మతాలవారు పరస్పర గౌరవ భావాన్ని పెంపొందించుకునే విధంగా వారి ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చే దిశలో కృషిచేయాలి. ఇందుకు మనందరిలో వివిధ విశ్వాసాలపట్ల లోతైన అవగాహన అవసరం.’ ‘సహనానికి ఆంగ్లంలో వాడే ‘టాలరెన్స్’ పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. ఇది ఒకరిని సహించడం లేదా భరించడం అనే అర్థాన్నిస్తుంది. పరస్పర గౌరవం, సహకారం అన్న అర్థాలని ఇది సూచించదు. వివిధ వర్గాల మధ్య సంబంధాలలో సమతౌల్యం లేకపోవడాన్ని కూడా ‘టాలరెన్స్’ పదం సూచిస్తుంది. అంటే బలవంతులైన వర్గాన్ని బలహీనులు సహించాలి అన్న అర్థాన్ని ‘టాలరెన్స్’ పదం సూచిస్తుంది. పరస్పర గౌరవాన్ని సూచించడానికి లాటిన్ భాషలో ‘ఆనర్’ అన్న పదం వుంది. పరస్పర గౌరవం వున్నచోట అసహనానికి, విద్వేషానికి తావులేదుకదా!’’ అని అంటారు జనేట్ హాగ్. *

Dr. Duggirala Rajakishore 80082 64690