ఆంధ్రప్రదేశ్‌

ఐక్య ఉద్యమాలతో పాలకులకు గుణపాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 17: కేంద్ర, రాష్ట్రాలలో పాలకులు అనుసరిస్తున్న విధానాలకు వామపక్షాల ఐక్య ఉద్యమాలతో పాతర వేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సీపీఐ మహాసభల్లో భాగంగా శనివారం ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వామపక్షాలు సమైక్యంగా సమన్వయంతో ఉద్యమించి బీజేపీ, సంగ్ పరివార్ లాంటి వాటిని తరిమివేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులతో సమైక్య శక్తిని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నామని, దానిద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకులపై ఉద్యమానికి సన్నద్ధం అవుతామని స్పష్టం చేశారు. మూడున్నరేళ్ళలో ప్రపంచంలో అగ్రరాజ్యాల పెత్తనం పెరిగిపోయి పొరుగు రాష్ట్రాల మధ్య ఉన్న సత్సంబంధాలను చెడగొట్టి యుద్ధాలకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా అవినీతిలో కూరుకుపోయిందని, దాని నుంచి బయటపడేందుకు మాయ మాటలతో ఇతర దేశాల పర్యటనలతో మభ్యపెడుతున్నారన్నారు. దేశంలో అత్యధిక సంపద కొద్దిమంది వద్దే ఉందని, వారిలో కొందరు అక్రమాలకు, అవినీతికి పాల్పడి ఇతర దేశాలకు పోతుంటే పాలకులే సహాయం చేస్తున్నారన్నారు. నాడు లలిత్‌మోదీ, విజయ్‌మాల్యా, నేడు నీరద్‌మోదీ ఇదే కోవకి చెందారన్నారు. వీరంతా బీజేపీ నేతలకు సన్నిహితులేనని, విజయ్‌మాల్యా బీజేపీ మద్దతుతో రాజ్యసభ సభ్యునిగా కూడా కొనసాగారన్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలలో బీజేపీ ముఖ్యమంత్రులు అవినీతిలో కూరుకుపోయారని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్ శక్తులకే అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. మధ్యప్రదేశ్‌లో సమస్యను పరిష్కరించాలని అడిగిన రైతులను కాల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉంటున్నామని చెబుతున్న పాలకులు తమ నిర్ణయం మేరకే ధరలు ఉండాలంటూ నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నారన్నారు. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు కూడా ఇదే ధోరణిలో ఉన్నారని, సమస్యల పట్ల నిబద్ధతతో ఉండకుండా వాటిని దాటవేసేందుకు తమ మాటల గారడిని ఉపయోగిస్తున్నారన్నారు. నాడు ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో నేడు పోరాడితే అడ్డుకుంటామని ప్రభుత్వమే చెప్పడం దుర్మార్గంగా అభివర్ణించారు. ప్రజా సమస్యలు చెప్పుకునే వేదికలైన ధర్నా చౌక్‌లను ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సమస్యల పట్ల ప్రజలను పక్కదారి పట్టిస్తూ గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్న నరేంద్రమోదీ, కేసీఆర్ లాంటి నేతలకు ప్రజలే గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం వామపక్ష శక్తులన్ని ఏకమై ప్రజలకు మద్దతుగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.