ఆంధ్రప్రదేశ్‌

ప్యాకేజీపై యూ టర్న్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 21: రాష్ట్ర విభజన సమయంలో చట్టంలో పొందుపర్చలేకపోయినా నాటి ప్రతిపక్ష, నేటి అధికారపక్ష బీజేపీ ఒత్తిడితో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో ప్రకటించినట్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో ప్రకటించిన విధంగా ప్యాకేజీ నిధులు, రాయితీలపై మార్చి 5న పార్లమెంటు సమావేశాలు పునఃప్రారంభం రోజున కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడని పక్షంలో ప్రత్యేక హోదాకు డిమాండ్ చేయాలని పార్టీ నేతలతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. స్నేహధర్మం పాటించి కేంద్ర ప్రభుత్వం హోదా ప్రకటనకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని అర్ధం చేసుకుని ప్యాకేజీకి అంగీకరిస్తే అది కూడా ఇవ్వకపోవడం, కనీసం ప్రతి ఏటా నిధులు కేటాయించడానికి వీలుగా చట్టబద్దత కల్పించకపోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విధితమే. బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు నిత్యం పార్టీ సీనియర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న అంశాల్లో వాస్తవాలు ఏమిటో తెలుసుకోవడం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున నివేదికను చంద్రబాబు పంపించారు. కేంద్రం చట్టప్రకారం రాష్ట్రానికి లబ్ది చేకూర్చిందా? లేదా? అన్న అంశాలను నిగ్గుతేల్చడంతోపాటు ప్యాకేజీ అంగీకరించకుండా హోదాకే పట్టుపట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయించడంతో ప్యాకేజీకి అంగీకరించిన టీడీపీ ఏకాకిగా మారే ప్రమాదముంది. అయితే ఇప్పటికే ప్యాకేజీకి అంగీకరించి ఇపుడు మళ్లీ ప్రత్యేకహోదా అంటే రాజకీయ ఇబ్బందులు ఉంటాయన్న ఉద్దేశంతో మార్చి 5న పార్లమెంటులో కేంద్రం ప్రకటన చూశాక తుది నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
విభజన చట్టం ఆమోదం కొరకు లోక్‌సభలో బిల్లును సులభంగా గట్టెక్కించిన కాంగ్రెస్‌కు ఆ తరువాత రాజ్యసభలో బీజేపీ మద్దతు అనివార్యమైంది. దాంతో నాడు ప్రతిపక్షపార్టీ నేత హోదాలో చంద్రబాబు బీజేపీ నేతలతో సంప్రదించి ప్రత్యేకహోదా చట్టంలో పొందుపర్చలేదని ఆ పని చేశాకే బిల్లు పెట్టాలని పట్టుపట్టి ఒప్పించారు. దాంతో మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో నేరుగా బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీలతో సంప్రదింపులు జరిపారు. చట్టంలో చేర్చడానికి సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని ప్రధాని హోదాలో రాజ్యసభలో ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు ఇస్తున్నట్లు ప్రకటిస్తానని వారికి చెప్పారు. అందుకు అంగీకరించిన బీజేపీ నేతలు 10 సంవత్సరాలు హోదా ప్రకటన చేయాలని సూచించారు. అయితే మన్మోహన్ రాజ్యసభలో ఐదు సంవత్సరాలు మాత్రమే హోదా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. బీజేపీ పక్ష నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తాము అధికారంలోకి రానున్నామని, అప్పుడు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని బిల్లును ఆమోదించారు. ఆ తరువాత ఎన్నికలు రావడం కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి, బీజేపీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో చేతులు కలిపి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో కూడా తమ పార్టీ ఎంపీలు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిని మంత్రులుగా ప్రతిపాదించింది. ఆ తరువాత రాష్ట్ర ప్రయోజనాలపై సంప్రదింపులు జరిపిన అనంతరం రెండేళ్ల తరువాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని చావుకబురు చల్లగా చెప్పారు. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ప్యాకేజీని 10 సంవత్సరాలు అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనిపై పార్టీ నేతలతో చర్చించిన చంద్రబాబు ప్యాకేజీకి అంగీకరించి తక్షణం చట్టబద్దత కల్పించాలని కోరారు. ఈ విషయంలో కూడా కేంద్రం జాప్యం చేస్తూ చివరి బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్యాకేజీకి చట్టబద్దత కల్పించకపోవడం, అందుకు అవసరమైన నిధులు ఇవ్వకపోవడంతో కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్లమెంటులో నిరసన కార్యక్రమం చేపట్టారు. సమావేశాలు జరుగకుండా అంతరాయం కలిగించడమే కాకుండా చివరకు ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగాన్ని కూడా అడ్డుకునే వరకు వెళ్లింది. దీంతో బీజేపీ అధినేత అమిత్‌షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, అరుణ్‌జైట్లీ టీడీపీకి చెందిన తమ సహచరమంత్రి సుజనా చౌదరి, పార్టీ ఎంపీలతో పలుదఫాలు సమావేశమై దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ బకాయిలు తక్షణం విడుదల చేయడం, హోదాకు బదులు ప్రకటించిన ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాయితీలు ప్రకటిస్తామని, విశాఖపట్టణంలో రైల్వేజోన్, కడపలో ఉక్కు కర్మాగారంతో పాటు చట్టంలో ఉన్న ఇతర అన్ని అంశాలపై ప్రత్యేకంగా ప్రకటన చేస్తామని నచ్చచెప్పారు. పార్లమెంటులో అధికారిక ప్రకటన వెలువడేంత వరకు తాము ఆందోళన విరమించలేమని సుజనా చౌదరి కేంద్రమంత్రులకు తెలియజేశారు. ఆ తరువాత ఆయన ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్రం రాష్ట్ర విభజన అంశాలపై దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్న సమాచారం అందించారు. దాంతో చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర అధికారులను 23న ఢిల్లీకి పిలిపించి వారితో కేంద్ర అధికారులు చర్చించనున్నారు. అంతా అయ్యాక మార్చి 5వ తేదీ రాష్ట్రానికి అనుకూల, అధికార ప్రకటన వస్తుందని టీడీపీ నేతలు ధీమాతో ఉన్నారు. అది నెరవేరకపోతే ఇతర పార్టీలతో కలిసి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయనున్నట్లు వారు స్పష్టం చేశారు.